ఎగ్గొట్టేందుకేనా వేలకోట్ల లోన్లు.. ఇదెక్కడి విడ్డూరం!

By KTV Telugu On 21 December, 2022
image

సామాన్యుడు వెయ్యి రూపాయల బాకీ ఉన్నా చీల్చిచెండాడేస్తారు. పీల్చి పిప్పిచేస్తారు. వంద కాల్స్‌, ఫైన్లమీద ఫైన్లు. ఏ పర్సనల్‌ లోనో తీసుకోవాలంటే సవాలక్ష రూల్స్‌. ఏ హౌస్‌లోనో తీసుకుని ఒక్క నెల ఈఎంఐ కట్టలేకపోతే వచ్చి తాళమేసినంత పనిచేస్తారు. మరవే బ్యాంకులు బడాబాబుల రుణాల విషయంలో మాత్రం వాళ్ల గేటుని కూడా టచ్‌ చేయలేవు. అడగ్గానే వేలకోట్ల రుణాలు పడుతుంటాయి. ఎగ్గొట్టినవాడు దర్జాగా దేశం దాటిపోతాడు. చివరికి ఏమీ చేయలేక బ్యాంకులు ఆ లోన్లని మొండిబకాయిల పద్దులో వేసి రద్దుచేసేస్తుంటాయి. ఆరేళ్లలో దేశవ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఎన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేశాయో తెలుసా. 19.94 లక్షల కోట్ల లోన్లు రద్దయిపోయాయి. మొండి బకాయిలు వసూలుచేయలేక బ్యాంకులు రద్దుచేసేశాయని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించింది. ఆయా బకాయిలను బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లు ను౦చి కొట్టేశాయి. మొండి బకాయిల రద్దు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే జరిగిందంటోంది కేంద్రం. విచిత్రమైన విషయం ఏమిటంటే రూ.కోటికి పైగా మొత్తాలను ఎగవేసిన వారి వివరాలతో పాటు మొండి పద్దుల వివరాలేవీ బ్యాంకుల దగ్గర లేకపోవడం.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రూ.25 లక్షలకు పైగా మొత్తాలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినవారు 2017 జూన్ 30 నాటికి 8045 మంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆ సంఖ్య12439. అంటే ఏటా ఎగ్గొట్టే బ్యాచ్‌ పెరుగుతూనే ఉందన్నమాట! ఉద్దేశ‌పూర్వకంగా బ్యాంకు రుణాల‌ను ఎగ్గొట్టిన టాప్ 50 బడాబాబుల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరు బ్యాంకుల‌కు రూ.92,570 కోట్లు ఎగ్గొట్టారు. గీతాంజ‌లి జెమ్స్ డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ రూ.7848 కోట్లు ఎగ్గొట్టాడు. ఎరా ఇఫ్రా సంస్థ సుమారు రూ.5879 కోట్లు ఎగ‌వేసింది. రీగో ఆగ్రో రూ.4803 కోట్లు కట్టలేనంటూ చేతులెత్తేసింది. కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ ప‌వ‌ర్‌(రూ.4,596 కోట్లు), ఏబీజీ షిప్‌యార్డ్‌(రూ.3708 కోట్లు), ఫ్రోస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ (రూ.3311 కోట్లు), విన్‌స‌మ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2931 కోట్లు), రోటొమాక్ గ్లోబల్‌ (రూ.2893 కోట్లు), కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌(రూ.2311 కోట్లు), జూమ్ డెవ‌ల‌ప‌ర్స్‌(రూ.2147 కోట్లు) బ్యాంకులకు భారీగా టోపీ పెట్టాయి. నిజాయితీగా బతకడం కష్టమేమోగానీ మందిని ముంచి సుఖంగా బతికేయొచ్చని బడాబాబులు నిరూపిస్తున్నారు. ఎగవేతల చరిత్ర ఇంత దారుణంగా ఉన్నా దేశంవిడిచి పారిపోయిన ఇక్కడే ఉండి అప్పులు ఎగ్గొడుతున్నవారి వివరాలు తమ దగ్గర లేవని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమే చెబుతుంటే ఇక దిక్కెవరు?!