మరోసారి ముఖ్యమంత్రిగా ఉండనంటున్నారు. ప్రధాని కావాలనే ఆశ లేదంటున్నారు. కానీ, బీజేపీని ఓడించడమే తన లక్ష్యమంటున్నారు. ఇకపై అంతా తేజస్వీయే చూసుకుంటాడని చెబుతున్నారు. నితీష్ వ్యూహమేంటి..? నెక్ట్స్ ఏం చేయబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఆర్జేడీ చైర్ పర్సన్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందుండి నడిపిస్తారంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో అధికార పార్టీ ప్రజాప్రతినిథులతో జరిగిన సమావేశంలో నితీష్ తన మనసులోని మాట బయటపెట్టారు. 2025 ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశ్ కూడా కావొచ్చని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
బీహార్‌లో కొంత కాలం క్రితం వరకూ బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నారు నితీష్. ఆ తర్వాత కమలం పార్టీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ-కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. మహాఘట్‌బంధన్ పేరిట కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నితీశ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఎన్డీయేతర పార్టీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన ప్రస్తుత లక్ష్యమన్న నితీశ్ విపక్ష నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. విపక్షాల కూటమిలో కాంగ్రెస్ తప్పకుండా ఉండాలనే నితీశ్ నిబంధన పెడుతున్నారు.
ఇకపై అంతా తేజస్వీనే చూసుకుంటాడంటూ ఆర్జేడీ శ్రేణుల్లో జోష్ నింపారు నితీష్. అదే సమయంలో జేడీయూ కేడర్‌ను కాస్త గందరగోళానికి గురిచేశారు. తేజస్వీ యాదవ్‌ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు నితీశ్. తమ ప్రభుత్వం ప్రజలకు చాలా చేస్తోందని, భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారని నితీష్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తమను విడదీయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆ ప్రయత్నాలు మానుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు.