మఠాలు, స్వాముల చుట్టూ తిరుగుతుంటుంది కర్నాటక రాజకీయం. మఠాలను ఎంత ప్రసన్నం చేసుకుంటే అంత మద్దతు దొరుకుతుంది. ఇక దక్షిణాన సినీతారలకు క్రేజ్ ఉండనే ఉంది. కర్నాటకలో కొందరు నటులంటే ప్రజలకు వల్లమాలిన అభిమానం. అందులో మన ఈగ ఫేమ్ సుదీప్ కూడా ఉన్నాడు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సుదీప్ మద్దతుకోసం బీజేపీతో పాటు కాంగ్రెస్ జేడీఎస్ కూడా గట్టి ప్రయత్నాలు చేశాయి. అయితే చివరికి సుదీప్ కమలం పార్టీనే కనికరించాడు.
కన్నడ నటుడు సుదీప్ బీజేపీలో చేరొచ్చని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈమధ్య నటి ఎంపీ సుమలత కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. సుదీప్ ముందుకొస్తే ఎక్కడినుంచైనా పోటీచేయించాలనుకుంది కమలంపార్టీ. అయితే తాను పోటీకి సిద్ధంగా లేనని బీజేపీకి ప్రచారంచేస్తానని సుదీప్ ప్రకటించాడు. సుదీప్ రావటం కర్నాటకలో బీజేపీకి ప్లస్‌పాయింటే. ఎందుకంటే దీపు కిచ్చా వంటి పేర్లతో పాపులర్ అయిన సుదీప్ వాల్మీకి నాయక వర్గానికి చెందినవాడు. కర్ణాటకలో బీసీ జాబితాలో ఉండే ఈ వర్గం ప్రాబల్యం ఎక్కువ. సుదీప్ రాకతో ఆ వర్గంలో బీజేపీకి సానుకూలత పెరిగేఅవకాశం ఉంది.
బీజేపీలో చేరకముందు సుదీప్‌కోసం కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేసింది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో ఫిబ్రవరి నెలలో సుదీప్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలోనే ఎంపీ సీటుని కాంగ్రెస్ సుదీప్‌కి ఆఫర్ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కూడా సుదీప్ కోసం గట్టి ప్రయత్నాలుచేసింది. మూడు ప్రధాన పార్టీలు కన్నుగీటినా చివరికి బీజేపీకే జైకొట్టాడు సుదీప్. స్వయంకృషితో పైకొచ్చిన సుదీప్ 27ఏళ్లుగా కన్నడ చిత్రసీమలో రాణిస్తున్నాడు. అన్నిరంగాల్లో ప్రవేశముంది. కన్నడకే కాదు తమిళం తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ ఆయనకు పేరుంది. అలాంటి సుదీప్ కీలక సమయంలో కలిసిరావడం మంచి శకునం అనుకుంటోంది బీజేపీ.