వారసులందు బీజేపీ నేతల వారసులు వేరయా

By KTV Telugu On 12 April, 2023
image

అవినీతి కంటే వారసత్వ రాజకీయాలు ప్రమాదకరమని ప్రధాని మోదీ అమిత్ షా పదే పదే చెబుతూంటారు. మరి వారు బీజేపీలో వారసుల్ని ప్రోత్సహించడం లేదా అంటే చెప్పడానికే నీతులు అనే సామెతను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో యడ్యూరప్పకు రిటైర్మెంట్ ఇచ్చి ఆయన ఇద్దరు కుమారులకు రాజకీయ భవిష్యత్ ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాజకీయ వారసులు అనే నీతి బీజేపీ ఎందుకు పాటించదన్న విమర్శలు సహజంగానే ప్రారంభమవుతాయి. అయితే బీజేపీ ఇలాంటి వారసుల్ని ప్రోత్సహించడం ఇదే మొదటి సారి కాదు. ఆ పార్టీలోని అగ్రనాయకుల వారసులంతా రాజకీయాల్లోకి వచ్చారు. కీలక పదవులు చేపట్టాడు. చేపడుతున్నారు కూడా.

కాంగ్రెస్ పై వారసత్వ పార్టీ అనే ముద్రవేసి ఎన్నికల్లో లాభపడింది బీజేపీ. కానీ బీజేపీ వారసత్వ రాజకీయాలు మేడిపండులాంటివి పొట్టవిప్పి చూస్తే అందరూ వారసులే. వారసత్వ రాజకీయాలు విడనాడాలంటున్న మోదీ అసలు తమ పార్టీలోని వారసుల విషయంలో మాత్రం నోరు మెదపరు. రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ బీజేపీలో రాజవంశీకులకు పెద్దపీట వేస్తారు. వారి వారసులు బీజేపీలో తిరిగి నాయకులుగా ఎదుగుతారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 303మంది ఎంపీలు బీజేపీ తరపున గెలిస్తే వారిలో 45మంది వివిధ రాజవంశాలకు చెందినవారు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు అంటే బీజేపీ ఎంపీల్లో 15శాతం మంది వారసులే. మోదీ కేబినెట్ లో ఉన్న 15మంది మంత్రులు వారసులే. ఏరికోరి వారసులకు ప్రాధాన్యమిచ్చారు మోదీ. యడియూరప్ప ఓ కుమారుడు ఎంపీ, మరో కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తున్నారు.

కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం అనే బీజేపీ అచ్చం కుటుంబ రాజకీయాలను నమ్ముకుంది. నిన్నటికి నిన్న కేరళకు చెందిన కాంగ్రెస్‌ నేత ఏకే అంటోని కుమారుడు అనిల్‌ అంటోనీకి కాషాయ కండువా కప్పారు. బీజేపీలో కీలకంగా ఉండే నేతలంతా వారసులే. కేంద్ర మంత్రిగా అనురాగ్‌ ఠాకూర్‌ హిమాచల్‌ మాజీ సీఎం బీజేపీ సీనియర్‌ నేత ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కుమారుడు. మరో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ బీజేపీ మాజీ జాతీయ కోశాధికారి మాజీ కేంద్రమంత్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ వారసుడు. జ్యోతిరాదిత్య సింధియా విజయరాజే సింధియా మనుమడు మాధవరావు సింధియా కుమారుడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ తొలి ప్రొటెం స్పీకర్‌ రిన్‌చిన్‌ ఖరూ కుమారుడు, దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత గంగాధర్‌పంత్‌ ఫడ్నవీస్‌ వారసుడే. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వసుంధర రాజే కుమారుడు ఎంపీగా మాజీ సీఎం కల్యణ్ సింగ్ కుమారుడు ఎంపీగా ఉన్నారు. యశ్వంత్ సిన్హా సాహిబ్ సింగ్ వర్మ ప్రమోద్ మహాజన్ వారసులూ రాజకీయాల్లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది.

వారసత్వం పేరుతో రాహుల్ గాంధీని కేటీఆర్ ను టార్గెట్ చేయడం వెనుక బీజేపీకి దీర్ఘ కాలిక లక్ష్యం ఉందనుకోవచ్చు. వారు బీజేపీకి ప్రధాన ఆటంకాలుగా కనిపిస్తున్నారు. అందుకే ప్రజల్లో వారికి అర్హత లేదని వారి అర్హత వారసత్వమే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి నాయకులు వారసత్వంతోనే నిలబడరు. అర్హత సామర్త్యం కూడా ఉండాలి. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అందరి కుమారులు మళ్లీ ముఖ్యమంత్రులు కాలేకపోయారు కదా. అయినా సరే కొంత మంది నేతలను టార్గెట్ చేసుకుని వరుసగా విమర్శలు చేయడం వారసత్వ ముద్ర వేయడం రాజకీయంలో భాగమే. అయితే అదే సమయంలో తమ కింద నలుపు చూసుకోవాల్సిన అవసరం కూడా బీజేపీ నేతలపై ఉంది. రాజకీయాల్లో వారసుల్ని లేకుండా చేయాలనుకుంటే ముందు బీజేపీ తాను చేయాలనుకున్నది చేయాలి. తమ పార్టీలో అసలు వారసత్వమే ఉండదనే దానికి కట్టుబడాలి. ఇతరులకు అలాంటి నీతులు చెప్పాలి లేకపోతే ప్రజలు నమ్మరు. ప్రస్తుతం రాజకీయాల్లో మాటల మాంత్రీకుల హవా నడుస్తోంది. ఎవరు బాగా మాటలు చెబితే వారు చెప్పిందే ప్రజలు వింటున్నారు. అయితే ఇది తాత్కలిక విజయాలనే అందిస్తుంది రేపు ప్రజలు వీరు తమను తప్పుదోవ పట్టించారని అనుకుని రియలైజ్ అయితే ప్రజలు చేసే తిరుగుబాటు వేరుగా ఉంటుంది.