అబద్దాల ప్రచారంలో మనమే ముందున్నాం!
నిజం గడపదాటేలోపు అబద్దం ఊరంతా చుట్టేస్తుంది. సోషల్‌మీడియాలో అదే జరుగుతోంది. సహజంగానే గోబెల్స్ ప్రచారంలో అధికారంలో ఉండే పార్టీలది పైచేయి అవుతోంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి సోషల్‌మీడియానే బ్రహ్మాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సివిలిటీపై మైక్రోసాఫ్ట్ చేసిన సర్వేలో భారత్‌లోనే ఫేక్ న్యూస్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందని తేలింది. దీనిమీద బీబీసీ మరింత లోతుగా అధ్యయనం చేస్తే అసత్య సమాచార ప్రచారంలో బీజేపీ అనుకూలవర్గాలే ముందున్నాయన్న విషయం బయటపడింది.
ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్.. ఏ ప్లాట్‌ఫామ్‌నైనా బీజేపీ విజయవంతంగా ఉపయోగించుకుంటుందోని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జాతీయవాదం, హిందూ సమాజం, పూర్వవైభవ పునరుద్ధరణ, దేశ ప్రగతి లాంటి అంశాల ఆధారంగా తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా చేరవేస్తున్నారని సర్వేలో తేలింది. ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించే అంశాలపైనే ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో అసత్య ప్రచారాన్నే కొందరు నిజమని నమ్మడం అనర్థాలకు కారణమవుతోంది.
సంస్థలపై ప్రజల్లో ఉన్న అపనమ్మకం కూడా సోషల్‌మీడియా ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఫేక్ న్యూస్ పాఠకులు భారత్‌లో 60 శాతం ఉంటే ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. 22 దేశాల్లో మైక్రోసాఫ్ట్ చేసిన డిజిటల్ సివిలిటీ సర్వే సూచీలో భారత్ ఏడో స్థానంలో ఉంది. 16వేల ట్విట్టర్ అకౌంట్లు, 3 వేల ఫేస్‌బుక్ అకౌంట్లను బీబీసీ పరిశీలించింది. వీటిలో బీజేపీ అనుకూలవర్గాల ఖాతాల్లోనే ఇలాంటి పోకడలు ఎక్కువగా కనిపించాయి. 50 శాతం కంటే ఎక్కువమంది భారతీయులు ఆన్‌లైన్ బాధితులనే విషయం కూడా ఈ సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ.