కర్ణాటక ఎన్నికల ప్రచార సరళిని చూస్తే బీజేపీ తరపున ఎవరూ తెర ముందు కనిపించలేదు. అంతా మోదీ..మోదీ..మోదీ. గెలిస్తే క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేసి ఇమేజ్ ను అమాంతం పెంచేసేవారు. అందులో సందేహం లేదు. మరి కర్ణాటకలో ఓడిపోయారు. ఇప్పుడు ఓటమి బాధ్యత ఎవరిది ఖచ్చితంగా మోదీది అనే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ పరాజయం గిల్టీ ఫీలింగ్ కలిగించి ఉంటుంది. శిఖరంలా ఉన్న తాను ఇలా పిల్ల కాలువలో పడినట్లుగా ఎందుకు అయిపోయిందని ఆయన మథనపడుతున్నారేమో కానీ. ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ అత్యున్నత స్థాయిలో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రెడీ అవ్వాలని కానీ ఈ సారి ప్రచార వ్యూహం మాత్రం హైపర్ లోకల్ గా ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. అంటే కేవలం రాష్ట్ర స్థాయి నేతలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేయబోతున్నారు. మోదీ ముద్ర లేకుండా చేయలనుకుంటున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రెడీ అవుతోంది. ఇందు కోసం దీర్ఘ కాలిక ప్రణాళికలు ఎప్పట్నుంచో అమలు చేస్తున్నారు. అయితే సెమీ ఫైనల్స్ గా చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే సంబరాలు చేసుకున్నారు కానీ అసలు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే ప్రజల నాడి ఎంటో తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. డిసెంబర్‌తో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. నిజానికి ఈ రాష్ట్రాల్లో రాజస్థాన్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి బలం ఉంది. తెలంగాణలో పుంజుకున్నామని చెబుతున్నారు. కానీ ఇక్కడ మోదీని తెర ముందుకు తెచ్చి పెడితే ఎంత వరకూ వర్కవుట్ అవుతుందన్నది మాత్రం బీజేపీ పెద్దలకే క్లారిటీ లేదు. అందుకే రాష్ట్ర అంశాలు రాష్ట్ర నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు.
కర్ణాటకలో తప్పు ఎక్కడ జరిగిందో బీజేపీ విశ్లేషించుకంటోంది. రాష్ట్ర అంశాలను జాతీయ అంశాలను మిళితం చేయడం ద్వారా ప్రజలు కన్ఫ్యూజ్ కు గురయ్యారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎన్నికలు జరగనున్న నాలుగు పెద్ద రాష్ట్రాల్లో బాధ్యతలను ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలకే ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే ఒకరికి కాకుండా ఉమ్మడి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతల్ని ఎన్నికల్లో ప్రోత్సహించనున్నారు. నిజానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టి పార్టీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నారు. కానీ యడ్యూరప్పను పక్కన పెట్టి కర్ణాటకలో చేతులు కాల్చుకున్నందున అది అంత తెలివైన నిర్ణయం కాదని గట్టి ఓబీసీ నేతగా పేరున్న శివారాజ్ సింగ్ చౌహాన్ నే కొనసాగించాలని భావిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో మరోసారి స్వీప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాజస్థాన్ లో వసుంధర రాజేతో పాటు ఇతర నేతల్ని సమన్వయం చేయనున్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ లో గెహ్లాట్, పైలట్ మధ్య పోరు రోడ్డుకెక్కింది. వారి పార్టీని బజారుపాలు చేసుకుంటున్నారు. అక్కడ బీజేపీ తమ రాష్ట్ర నేతలను సమన్వయం చేసుకుంటే భారీ విజయం ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. అయితే వసుంధర రాజేపై మోదీకి సదభిప్రాయం లేదు. కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వసుంధ రాజేను ప్రోత్సహించడం మినహా మోదీకి మరో ప్రత్యామ్నాయం లేదు.
తెలంగాణ బీజేపీ జోరు మీద ఉంది. గత ఎన్నికల నాటికి పోలిస్తే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎంతో మెరుగైంది. దాదాపుగాప్రతీ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ తయారయ్యారు కానీ నేతల కొరత ఉంది. ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. అందుకే బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతల్ని ప్రాంతాలవారీగా బాధ్యులుగా నియమించి పార్టీ విజయం కోసం ప్రయత్నాలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ రెడీ అయింది. తెలంగాణ ఎన్నికల్లో మోదీ యాక్టివ్ పార్ట్ తీసుకునే అవకాశం లేదు. పూర్తిగా హైపర్ లోకల్ అంశాలతో ఎన్నికలకు వెళ్లనున్నారు. ఒకటి, రెండు సభలుపెట్టవచ్చు కానీ కర్ణాటకలోలా పూర్తి స్థాయి మోదీ ఏ రాష్ట్రంలోనూ బాధ్యతలు తీసుకునే అవకాశం లేదని భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హిందీబెల్ట్ లో ఈ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజీపీ స్వీప్ చేసింది. ఒకటి, రెండు స్థానాలు తప్ప అన్నీ బీజేపీకే దక్కాయి. ఈ సారి అక్కడ ప్రభుత్వాలు ఏర్పడకపోతే ఆ పార్లమెంట్ సీట్లలో సగం కోతపడినా ఢిల్లీలో ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. తన చరిష్మా తగ్గిపోయిందని అనిపించుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఆయన ప్రాధాన్యాన్ని ఆయనే తగ్గించుకోవాలని డిసైడయ్యారు. తెర వెనుక వ్యూహాలు ఎన్నికల విషయంలో కేంద్ర సహకారం మాత్రం పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలకు లభించనుంది.