“బ్లేమ్ గేమ్” మాత్రమే రాజకీయమా ? పార్టీలు ప్రజల్ని కించ పరుస్తున్నాయా

By KTV Telugu On 24 January, 2023
image

మా ఇంటికొస్తే ఏం తెస్తారు. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు. అనేది ఓ సామెత. దీని అర్థం రకరకాలుగా ఉంటుంది. రాజకీయాల్లోనూ ఈ సామెత పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. మంచి ఏం జరిగినా మాది చెడు అయితే మీది అనేది రాజకీయ పార్టీల సిద్దాంతం. ప్రతీ సమస్యకు కారణం మీరంటే మీరని వాదించుకోవడమే ఇప్పుడు రాజకీయం అయిపోతోంది. అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అన్నది ఇక్కడ అసలు మ్యాటర్ కాదు. తప్పును పక్క పార్టీ మీద తోసేశామా లేదా అన్నదే ముఖ్యం. దీని వల్ల రాజకీయం ఎంత లాభం వస్తుంది. రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణల్ని ప్రజలు నమ్మేస్తారా. బాధ్యత ఉన్న పార్టీలు కూడా తప్పును పక్కనోళ్ల మీద నెట్టేసి దులిపేసుకోవడం సమంజసమేనా.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఏ విధానమైన వంద శాతం ఫూల్ ఫ్రూఫ్ గా ఉండదు. దీనిలోనూ లోపాలున్నాయి. ఇబ్బంది పడుతున్న వారు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఇలా జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్సేనని భారత్ రాష్ట్ర సమితి మరో సందర్భంలో నిందించింది. నిజానికి బీఆర్ఎస్ తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉంది. ఇట్టే కాళేశ్వరం కట్టేశామని చెప్పుకుంటూ ఉంటుంది. మరి పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ ఎలా కారణం. ఒక వేళ కాంగ్రెస్ తప్పులు చేసి ఉంటే అధికారం లో ఉన్నారు కాబట్టి సరి చేసి ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయారు అన్నది ఎవరూ అడగకూడదు వాళ్లు చెప్పకూడదు. నింద మాత్రం కాంగ్రెస్ మీద వేసేస్తారు. ఈ విషయాల్లోనే కాదు ఏ విషయంలో చూసినా రాజకీయ ఆరోపణలు అలాగే ఉంటాయి. ఒక పార్టీ నిర్వాకాన్ని మరో పార్టీ మీద రుద్దేసుకుంటారు. పాలనా వైఫల్యాలను ప్రతిపక్ష మీద వేసేస్తూంటాయి పాలకపక్షాలు.

ఇది తెలంగాణలో మాత్రమే జరగడం లేదు అన్ని చోట్లా ఇంతే. కర్ణాటకలో ప్రజల ఇబ్బందులకు బీజేపీ ప్రభుత్వ అవినీతే కారణం అని అక్కడి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటుంది. ప్రతీ వివాదానికి కాంగ్రెస్ చెప్పేది అదే. సేమ్ స్టైల్ లో బీజేపీ కూడా రివర్స్ కౌంటర్ ఇస్తూంది. తమిళనాడు లో అయితే అక్కడ రాజకీయపార్టీల మధ్య నడిచే బ్లేమ్ గేమ్ మరో రేంజ్ లో ఉంటుంది. పదేళ్ల పాటు అన్నాడీఎంకే పాలన ఉంది. ఇప్పుడు డీఎంకే పాలన నడుస్తోంది. డీఎంకే తాము చేయలేకపోతున్న ప్రతీ పనికి అన్నాడీఎంకే నే కారణమని నిందిస్తూ ఉంటుంది. దక్షిణాదితో పాటు ఇండియా మొత్తం ఇదే పరిస్థితి. జాతీయ స్థాయి గురించి చర్చించుకుంటే ఇది పెద్ద టాపిక్. సీరియస్ ఇష్యూ ఏది వచ్చినా బీజేపీ నెహ్రూ తప్పిదమని చెబుతుంది.

రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఇతర పార్టీల మీద తప్పుల్ని తోసేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలా చేయడం వల్ల వారు తమ తప్పు లేదని బాధ్యత లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం మొదటి లక్ష్యం. కానీ మరి ఇలాంటి వాదనలను ప్రజలు నమ్ముతారా అంటే చెప్పడం కష్టం. అధికారంలో ఉన్న పార్టీ తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి తమ చేతకాని తనాన్ని ఇతర పార్టీలపై నెట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అవతలి పార్టీ చేయలేదనే ఈ పార్టీకి అధికారం అప్పగించారు. ఈ పార్టీ పనులు చేయలేక ఆ పార్టీని కారణంగా చూపిస్తే ప్రజలు ఎలా హర్షిస్తారు. ఒక్క అభివృద్ధి పనుల విషయంలోనే కాదు అవినీతి ఆరోపణలు ఇతర విషయాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని అనుకోవచ్చు.

రాజకీయం అంటే ఎదుటి పార్టీపై ప్రతీ సారి నిందలేయడమే అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఒకప్పుడు విపక్ష పార్టీలు అధికార పార్టీల్ని ఇరుకున పెట్టడానికి ఆరోపణలు చేసేవి. అయితే బేస్ లేకుండా గాసిప్స్ లాగా చేసే ఆరోపణలు ఉండేవి కావు ఓ పద్దతి ఉండేది. ఇలాంటి ఆరోపణలు వస్తాయని అధికార పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండేవి. వీలైనంత పారదర్శక పాలన సాగించేవి. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. ఎన్ని ఆరోపణలు వస్తే అన్ని ఆరోపణలు ఎదుటి పార్టీపై చేస్తే లెక్క సరిపోతుందనే రాజకీయం వచ్చేసింది. ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చిన రాజకీయ చైతన్యం పెరిగిపోయి తాము అభిమానించే పార్టీ ఎన్ని తప్పు చేసినా నిస్సిగ్గుగా సమర్థించేంత టెంపరి తనం రావడం రాజకీయ పార్టీలకు మరింత బలం తెచ్చి పెట్టినట్లయింది. అందుకే ఆయా పార్టీల రాజకీయ సిద్దాంతం తమకు అంటిన బురదను ఇతరులకు అంటిచడం అయిపోయింది.

రాజకీయాలంటే ప్రత్యర్థి పార్టీపై లేనిపోని ఆరోపణలు చేసి ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత పెంచడం అన్నట్లుగానే ప్రస్తుతం మారపోయింది. ప్రజాప్రయోజనం అనేది కనిపించడం లేదు. ప్రజలు ఓటర్లు మైండ్ సెట్ కూడా పూర్తిగా నెగెటివిటీగా మారిపోయింది. ఓ పార్టీపై కోపం వస్తే మరో పార్టీ వైపు చూస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు తమపై వేస్తున్న ట్రాప్ ను మాత్రం గుర్తించలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు ప్రజల్ని మెప్పించడం మానేసి ఇతర పార్టీలపై వ్యతిరేకత పెంచి తప్పక తమకు ఓటేయాలన్న పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయం ఆరోపణలు ప్రత్యారోపణలతో నిండిపోయింది.