వేడెక్కిన సరిహద్దులు.. ఎవరు కారకులు
పాకిస్తాన్ బార్డర్లోనో, చైనా సరిహద్దుల్లోనో ఉద్రిక్తతలు చెలరేగాయంటే అర్ధముంది. శత్రుదేశాలు కయ్యానికి కాలుదువ్వుతుంటాయి. మన బలగాలు దీటుగా తిప్పికొడుతుంటాయి. కానీ మనలో మనం కొట్టుకుంటుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? మొన్నటిదాకా ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదాలు హింసకు దారితీశాయి. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. బెళగావిలో ఆందోళనలకు దిగిన కర్ణాటక రక్షణ వేదిక మహారాష్ట్ర నెంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. పరిస్థితి చేజారకుండా భారీగా బలగాలను మోహరించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర-కర్నాటకల మధ్య వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. 1960లో భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు ఇచ్చారనేది మహారాష్ట్ర వాదన. దీనిపై మహారాష్ట్ర సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అటు తమకు చెందిన కొన్ని గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నాయంటోంది కర్నాటక. బెళగావిలో మహారాష్ట్ర మంత్రులు ఇద్దరు పర్యటన పెట్టుకోవటాన్ని కర్నాటక ముఖ్యమంత్రి ఆక్షేపించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే హెచ్చరికలతో వారు తమ పర్యటన రద్దు చేసుకున్నారు. బెళగావితో పాటు నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు, గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. డిసెంబరు నెల వచ్చిందంటే వివాదం వేడెక్కుతుంటుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహించడమే దీనికి కారణం. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికే బెళగావి జిల్లా అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. తర్వాత దాన్ని బొంబాయి రాష్ట్రంలో భాగంగా గుర్తించారు. 1948లో బెళగావి సిటీ కౌన్సిల్ ఆ జిల్లాను సంయుక్త మహారాష్ట్రలో విలీనం చేయాలని తీర్మానం చేసింది. 1953లో ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిషన్ ఆ నాలుగు జిల్లాలపై మైసూరు రాష్ట్రానిదే పూర్తి అధికారమని నివేదిక ఇచ్చింది. 1966లో సుప్రీం సూచనతో జస్టిస్ మెహర్‌చంద్ మహాజన్ సారథ్యంలో ఏర్పాటైన కమిషన్ నివేదిక కూడా కర్ణాటకకు అనుకూలంగా వచ్చింది. దీన్ని మహారాష్ట్ర మరోసారి సుప్రీంలో సవాల్ చేసింది. 18 ఏళ్ల తర్వాత దీనిపై తుది విచారణ జరగబోతోంది. దీంతో స్వదేశంలోనే రెండురాష్ట్రాల సరిహద్దు భగ్గుమంటోంది.