బీఆర్ఎస్ పార్టీకి ఆరంభంలోనే అవరోధాలు

By KTV Telugu On 21 February, 2023
image

జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలనుకున్న భారత రాష్ట్ర సమితికి అనుకున్నంతగా కలిసి రావడం లేదు. ఏపీలో ఒకరిద్దరు నేతలు కలిసినా మహారాష్ట్రలో మాత్రం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మరాఠీ ప్రాంతాల్లోనే విస్తరణ సులభమని భావించిన నేతలకు గడ్డుకాలం ఎదురవుతోంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను గులాబీ బాస్ సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్‌ నేతలకు అప్పగించారు. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆ జిల్లా నేతలు చేరికలపై దృష్టి పెట్టారు. నాందేడ్ సభ ఊపుతో ఇతర జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావించారు. తెలంగాణ ఉత్తర ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాలకు మూడు వైపులా మహారాష్ట్ర ఉంది. వేయి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. తెలంగాణ మూలాలు అధికంగా ఉన్న నాందేడ్, అమరావతి, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో బలపడడం ద్వారా మహారాష్ట్ర అంతటా విస్తరించవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందుకే తెలంగాణ మూలాలున్న నేతలకు గాలం వేస్తోంది.

వాస్తవానికి గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలోని కిన్వట్‌, వని, ధర్మాబాద్‌ తాలుకాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పరిణామాలు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. కానీ గడ్చిరోలి జిల్లా అహేరీ నియోజకవర్గంలోని ప్రజలు బీఆర్ఎస్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతుండడంతో అక్కడి రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను నిండా ముంచిన బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రలో అడుగు పెట్టనీయబోమని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ హడావుడిని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూడా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే స్పందించకపోయినా జిల్లాల నేతలు మాత్రం బీఆర్ఎస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. మరాఠాల ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ దెబ్బ తీయాలని చూస్తోందని ప్రచారం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల నేతలను ప్రలోభ పెట్టి తెలంగాణలో వీలీనం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఎంఎన్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఆయా పరిస్థితులకు తగ్గట్లే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు పేరున్న, బలమైన నేతలు ఎవరూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరలేదు. ఇప్పటివరకు చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం దీపక్ మాత్రమే బలమైన నాయకుడు. మిగతా వాళ్లంతా అవుట్ డేటెడ్ లీడర్లే అన్న చర్చ సాగుతోంది.

మరాఠీలకు భాషాభిమానం, ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువేనని చెప్పాలి. ఇతర ప్రాంతాల వారిని వాళ్లు అసలు రానివ్వరు. షిర్డీలో కూడా తెలుగువారి ప్రాబల్యం పెరిగిపోతోందని గతంలో ఉద్యమాలు చేశారు. తెలుగు పేర్లు చిన్నగానూ మరాఠీ పేర్లు పెద్దగానూ కనిపించాలని హుకుం జారీ చేశారు. ఇప్పుడు రాకపోకలు వివాహ బంధాల ఆధారంగా మహారాష్ట్రలో బలపడాలని బీఆర్ఎస్ అనుకుంటే పొరపాటేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో పేరున్న ఒకరిద్దరు తెలంగాణ నేతలను చూసి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేవని అక్కడి వారు అంటున్నారు.