నేషనల్ హైవేలో గులాబీ కారు.. తగ్గేదేలే

By KTV Telugu On 9 February, 2023
image

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో దేశ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన కేసీఆర్, తెలుగు వారికి పట్టున్న ప్రాంతాలను టార్గెట్ చేశారు. అక్కడ బీఆర్ఎస్ పట్టు పెంచుకోవడానికి చాపకింద నీరులా సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల దృష్టిని ఆకర్షించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోని నేతలను పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పుతున్నారు. దేశానికి తెలంగాణ ఓ రోల్ మోడల్ అంటోన్న కేసీఆర్ తమ పథకాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని అంటున్నారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్, అనంతరం మహారాష్ట్రాలో శివాజీ వంశం నేతలను పిలిచి కండువాలు కప్పేశారు. అక్కడితో ఆగకుండా కార్యాచరణ కూడా మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో రైతుల కోసం పనిచేస్తున్న టికాయత్ ను సైతం పిలిపించి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతలోనే కేసీఆర్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు చత్తీస్ ఘడ్ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి తనయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి తనయుడు జనతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌జోగి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. చత్తీస్ ఘడ్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న నేత బీఆర్ఎస్ తీర్థం తీసుకుంటే అక్కడ స్థానికంగా అది కేసీఆర్ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది.

ఇక పొరుగునే ఉన్న ఆంధ్రాలో శరవేగంగా రాజకీయం నడుపుతున్నారు. త్వరలో విశాఖలో సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్న గులాబీ దళం ఆ సందర్భంలో ఏపీ నుంచి కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇటీవల విశాఖలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావుతో పాటు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ప్రధానంగా కాపు-బలిజ నేతలపై ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పనిచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఈక్రమంలోనే మరికొందరినీ బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం పలుకుతున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనూ గులాబీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ టీడీపీలో ఉన్న అసంతృప్తులను ఆకర్షించే ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా మంతనాలు కూడా సాగుతున్నాయంటున్నారు.

మహారాష్ట్రలోనూ కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే నాందేడ్‌లో భారీ సభను నిర్వహించి పలువు నేతలకు కండువాలు కప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ బోణీ కొట్టాలనే ఆశతో ఉంది. సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు కూడా. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి వారితో బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు గ్రామాలు తెలంగాణలో కలపాలని కూడా కోరుకుంటున్నాయి. ఆయా గ్రామాలు కూడా తీర్మానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ధర్మాబాద్, భోకర్, బిలోలి, దెగ్లూర్, నర్సి, నాయగాం, ముత్కేడ్, ఉమ్రి, కిన్వట్ వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతంలో పార్టీని విస్తరించడం సులభ తరమవుతుందని భావిస్తోంది.

మరోవైపు తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు నాయకులతో మాట్లాడుతున్న కవిత ఇటీవల తమిళనాడుకు చెందిన ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ తో భేటీ అయ్యారు. కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్న శరత్ కుమార్ దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం లక్ష్యం అజెండా వంటి అనేక అంశాలపై శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో మాట్లాడారు. అదేవిధంగా రేపు ఆమె చెన్నైకి వెళ్తున్నారు. 2024 ఎన్నికలపై చెన్నైలో ఒక ప్రముఖ వార్తాపత్రికకు చెందిన సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో కవిత పాల్గొననున్నారు. ఈ సదస్సు వేదికగా బీఆర్ఎస్ పార్టీ అజెండా ముందు ముందు జాతీయ రాజకీయాలలో బీఆర్ఎస్ పోషించనున్న పాత్ర, దేశ అభివృద్ధికి కెసిఆర్ ఆలోచనలు ఎమ్మెల్సీ కవిత అందరికీ తెలిసేలా చెప్పనున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలోనూ మార్పు తీసుకురావటానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెయ్యబోతుందో కవిత చెప్పనున్నట్లు తెలుస్తోంది.