అంతన్నాడు ఇంతన్నాడు చివరకు చతికిలపడ్డాడు అన్నట్లుగా ఉందీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నం పురిట్లోనే సంధి కొట్టింది. తొలి ఎన్నికలోనే జాతీయ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దానితో బీఆర్ఎస్ శ్రేణులు పునరాలోచనలో పడ్డాయి. దేశ్ కి నేతా అనిపించుకోవాలని కేసీఆర్ కలలు కనడంలో తప్పులేదు. అందు కోసం బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పెట్టి విస్తరణకు ప్రయత్నించడంలో కూడా ఎలాంటి తప్పూ లేదు. కాకపోతే బలానికి వాస్తవ పరిస్థితులకు తేడా తెలుసుకోకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారని మహారాష్ట్ర పరిణామాలు చెప్పకనే చెప్పాయి.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అన్ని రాష్ట్రాలను వదిలేసి మరాఠా భూమిపైనే కేసీఆర్ తన శక్తియుక్తులను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇప్పటి వరకు మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించారు. అందులో నాందేడ్ జిల్లాలోనే రెండు సభలు జరిగాయి. మూడో సభ కొద్ది రోజుల క్రితం ఔరంగాబాద్ లో నిర్వహించారు. ఆయా సభలకు జనాలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర లో ఖాతా తెరవాలని అనుకుంటున్న గులాబీ బాస్ కు మరాఠాలు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన మార్కెట్ కమిటి డైరెక్టర్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చేదు అనుభవాన్నీ మిగిల్చారు. తెలంగాణ మూలాలున్న భోకర్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా సాగిన పోటీలో బీ ఆర్ఎస్ అభ్యర్థులందరూ ఓడిపోవడం చర్చ నీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని నిర్మల్ జిల్లా సరిహద్దు లో మహారాష్ట్రలోని బోకర్ తాలూకా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంది. మొత్తం 18 డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఒక్క డైరెక్టర్ పదవిని కూడా దక్కించుకోలేకపోయారు. ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తమ మద్దతుదారులను అభ్యర్థులుగా నిలిపాయి. 18మంది డైరెక్టర్ల పోస్టులకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 15 మంది బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలుపొందారు. బలమైన నేతలను పార్టీ లో చేర్చుకుని పకడ్బంధీ పోల్ మేనేజ్మెంట్ చేసినా బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం పై చర్చ సాగుతోంది.
భోకర్ మార్కెట్‌కు నాందేడ్ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది. చాలా మంది ప్రముఖులు ఇక్కడి మార్కెట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే రాజకీయంగా ఎదిగారు. 64 గ్రామాలు ఈ మార్కెట్ పరిధిలో ఉన్నాయి. కోల్డ్ స్టోరేజీలున్న ఈ మార్కెట్ లో సజ్జలు, జొన్నలు, శనగలు, పెసలు, సోయా, నువ్వులు, కందులు, గోధుమలు, పొద్దు తిరుగుడు గింజలకు ప్రసిద్ధి. మార్కెట్ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో తమ మద్దతుదారులను గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా రైతులకు ఉచిత కరెంటు తో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తామని విపరీతంగా ప్రచారం చేశారు. అయినా మరాఠా రైతులు విశ్వసించ లేదు. పోటీ చేసిన 18 మంది ఓటమి పాలయ్యారు. ఆ మార్కెట్ మీద పట్టున్న నాగ్ నాథ్ సింగ్ కూడా ఓడిపోయారు.
కిసాన్ సర్కార్ నినాదం తో కేసీఆర్ చేస్తున్న హడావిడి పై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. తెలంగాణ ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన భారత రాష్ట్ర సమితికి భోకర్ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి. అన్నింటికి మించి బోకర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే గా కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో చవాన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయినా భారీ పోల్ మేనేజ్మెంట్, హామీలతో సులువుగా గెలుస్తామని లెక్కలు వేసుకున్న బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ఫలితాలను చూసి నిరాశ చెందాల్సిన పనిలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఓ భారీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సవాళ్లు ఎదురవ్వడం సాధారణమేనంటున్నారు. ఇవి తమలో పట్టుదలను మరింత పెంచుతాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.