తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పుడు కేసీఆర్ గర్జనలతో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెంచుకున్నారు. అదే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి ఇప్పుడు అదే్ తరహా గర్జనలతో మరోసారి ప్రజల అభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 2001లో కరీంనగర్ గర్జన తెలంగాణకు సంబంధించినదైతే, ఖమ్మంలో జరుగుతోంది భారత్ మొత్తానికి సంబంధించినది. అందుకే ఆ స్థాయిలో సభను సక్సెస్ చేసేలా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి ఎవరూ ఊహించలేరు. ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలు వచ్చినప్పుడు ఓహో కేసీఆర్ ఈ ఆలోచనతో ముందడుగు వేశారా అని అనుకోవడం తప్ప ఆయన నిర్ణయాల్లో అంత లోతు ఉంటుందని ఊహించడం కష్టం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని చాలా మంది నేతలు పైకి తేలికగా తీసుకున్నా అంతర్గతంగా మాత్రం ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి తొలి అడుగును ఖమ్మం భారత్ సింహ గర్జన ద్వారా వేస్తున్నారు. ఈ సభ సక్సెస్ కాకపోవడ అన్నమాటే ఉండదు. మరి ఈ సభ నుంచి కేసీఆర్ ఎలాంటి ప్రయోజనం పొందుతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసుల్లోకి చేరిపోతుందా. టీఆర్ఎస్ అనే భావన స్థానంలో బీఆర్ఎస్ అనే భావన తెప్పించగలరా.
కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ప్రకటించన తర్వాత ఆవిర్భావ సభను తెలంగాణలో పెట్టరని ఢిల్లీ లేదా యూపీలో పెట్టవచ్చన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధికారిక గుర్తింపు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇతర రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల కోసం పర్యటించలేదు. ఆవిర్భావ సభను కూడా ముందుగా అనుకున్నట్లుగా ఢిల్లీ లేదా యూపీల్లో కాకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్, ఏపీలతో సరిహద్దు ఉన్న ఖమ్మంలో ఏర్పాటు చేయడం ద్వారా ఇది అంతర్రాష్ట్ర సభ అనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అంతే కాదు తనతో సహా నలుగురు ముఖ్యమంత్రులతో పాటు కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలు, బీఆర్ఎస్ కు సపోర్టుగా ఉంటున్న అఖిలేష్ యాదవ్ వంటి నేతల్ని కూడా ఆహ్వానించారు. ఓ రకంగా బీఆర్ఎస్ సభ బీజేపీని వ్యతిరేకించే పార్టీల ఉమ్మడి సభగా అనుకోవచ్చు. ఈ సభ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అయితే తెలంగాణలో ఈ సభ ఎఫెక్ట్ మరింత ఎక్కువ ఉంటుందని కేసీఆర్ ప్రధాన వ్యూహం కూడా ఇదేనని అంటున్నారు.
బీఆర్ఎస్ దేశ స్థాయికి వెళ్లాలంటే ముందు రాష్ట్రంలో గెలవాలి. మూడో సారి ఎన్నికలు గెలవాలంటే అంత తేలిక కాదు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నకేసీఆర్ అందుకే ఈ సారి భిన్న వ్యూహంతో తెరపైకి వచ్చారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ సెంటిమెంట్ ఆయనకు ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు భారత్ సెంటిమెంట్‌తో ఆయన తెలంగాణలో మొదట విజయాన్ని అందుకోవాలనుకుంటున్నారు. జాతీయ స్థాయికి వెళ్లిన నేతకు సొంత రాష్ట్రాల్లో ప్రజల మద్దతు ఉంటుంది. దానికి ప్రధాని నరేంద్రమోదీనే ఉదాహరణ. ఆయనకు గురరాత్ రాష్ట్రం పట్టం కడుతుంది. తమ వాడు ప్రధానిగా వెళ్తున్నాడు వెళ్తాడు పాలన చేస్తున్నాడు అనే పరిస్థితుల్లో వందకు వంద శాతం పార్లమెంట్ సీట్లు అక్కడి ప్రజలు బీజేపీకే కట్టబెడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఏకపక్ష విజయం కేవలం మోడీని చూసేనని చెప్పడానికి ప్రత్యేకమైన విశ్లేషణలు అక్కర్లేదు.
భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం ద్వారా కేసీఆర్ గుజరాత్లో మోదీ స్థాయి ఆదరణను తెలంగాణలో తాను పొందాలని అనుకుంటున్నారు. తనకు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే విషయంలో అన్ని పార్టీల మద్దతు ఉందని ఎన్టీఆర్ తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పడానికి అన్ని పార్టీలను ఏకం చేసిన నాయకుడు కేసీఆరేనని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ విషయాన్ని ఖమ్మం సభ ద్వారా నిరూపించడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజల్ని బీఆర్ఎస్ ఎంతగా నమ్మించగలుగుతుందో బీఆర్ఎస్కు స్థానికంగా అంత ఆదరణ పెరుగుతుందని అనుకోవచ్చు. నిజానికి బీఆర్ఎస్ కు ఆదరణ విషయంలో లోటు లేదు కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి మూడో సారి కూడా కేసీఆర్ సీఎం కావాలా వద్దా అన్న అంశంపై ఓటింగ్ జరుగుతుంది. పదేళ్ల పాలనలో ఎంత చేసినా ప్రజావ్యతిరేకత ఉండటం సహజం. దీన్ని అధిగమించాలంటే పాలనకు అతీతమైన ఇమేజ్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే తెలంగాణ బిడ్డ జాతీయ స్థాయిలో రూలింగ్ చేయడానికి వెళ్తున్నారని మద్దతుగా ఉండాలన్న అభిప్రాయాన్ని కల్పించాలి. కేసీఆర్ అదే చేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని లోకల్లో అందరూ మద్దతుగా ఉండాలన్న ఓ అభిప్రాయాన్ని వారి మనసులో ట్యూన్ చేస్తున్నారు.
ఖమ్మం భారత్ సింహ గర్జన ద్వారా కేసీఆర్ మూడు రకాల ప్రయోజనాలను ఆశిస్తున్నారు. అందులో మొదటిది బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావడం రెండోది తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ జాతీయ నేత ఆయనకు సొంత రాష్ట్ర ప్రజలుగా మనం మద్దతుగా ఉండాలన్న అభిప్రాయం ఏర్పడేలా చేయడంతో పాటు సవాల్‌గా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకోవడం. తెలంగాణ ఏర్పాటయిన దగ్గర నుంచి ఖమ్మంలో టీఆర్ఎస్ ప్రజాభిమానంతో అసెంబ్లీ సీట్లు గెలవలేదు. మొదటి సారి రెండో సారి ఒక్కో సీటుతోనే సరి పెట్టుకుంది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదని బీఆర్ఎస్ అధినేత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం లో వలస నేతలతో కారు ఓవర్ లోడ్ అయింది. ఎన్నికల నాటికి కొంత మంది ఇతర పార్టీల్లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి ఖమ్మంలో గతంలోలా కాకుండా మెజార్టీ సీట్లు గెల్చుకోవాలంటే అక్కడ ఆవిర్భావ సభ నిర్వహించడం అవసరమని కేసీఆర్ భావించారు. అనుకున్నట్లుగా నిర్వహిస్తున్నారు.
ఖమ్మం సింహగర్జన సభ కు జన సమీకరణలో ఎలాంటి లోటుపాట్లు ఎదురు కావు. అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు. కానీ ఆ ఎఫెక్ట్ ను రాజకీయంగా ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కేసీఆర్ ముందు ముందు తీసుకుబోయే నిర్ణయాలు వేయబోయే అడుగులు పార్టీ నేతల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఓ సభ నిర్వహించి ఇదే బలం అని చూపించుకోవచ్చు కానీ దాన్నే చూపించి బలపడిపోయామని నిర్ణయానికి వచ్చేస్తే అంతకు మించిన తెలివి తక్కువ తనం ఉండదు. ఖమ్మం సభ బీఆర్ఎస్కు గుడ్ స్టార్ట్ అని చెప్పవచ్చు. ఈ శుభారంభాన్ని కేసీఆర్ అండ్ కో ఎలా ఉపయోగించుకుంటారన్నదే ముందు ముందు కీలకం.