జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తొలి పరీక్షలో పాస్ అవుతారా

By KTV Telugu On 5 March, 2023
image

భారత రాష్ట్ర సమితి రాజకీయ నడక అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు. పబ్లిసిటీ కోసం ఎవరినో చేర్చుకుంటూ పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నాననుకుంటే పెద్ద పొరపాటే కావచ్చు. తెలంగాణ దాటి బయట విజయ దరహాసం చేయడమంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయమని గులాబీ దళపతికి తెలియనిది కూడా కాకపోవచ్చు. అయినా తెలంగాణలో వరుసగా రెండు సార్లు గెలిచిన జోష్ ఆయన్ను ముందుకు నడిపిస్తుండొచ్చు. ఎటు చూసినా ముళ్ల కిరీటాలే కానీ పూల పాన్పులు లేవని కేసీఆర్ కు తెలియని కాదు. కుదరదనుకున్న తెలంగాణే సాధించినోడికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అంత కష్టమా అన్న మొండి ధైర్యం ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. కాకపోతే తొలి పరీక్ష ఆయనకు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచే మొదలవుతుంది. మరికొద్ది నెలల్లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అక్కడ ఎలా నరుక్కొస్తోందా అన్న చర్చ మొదలైంది.

బీఆర్ఎస్ పెట్టాలనుకున్నప్పటి నుంచి కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీకి సమదూరం పాటించే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని ఆయన ప్రకటించి చాలా రోజులైంది. ఆ దిశగా కర్ణాటకలోని జనతా దళ్ సెక్యులర్ తో ఆయన స్నేహం చేయాలనుకున్నారు. ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారు. అయితే అక్కడే అడుగు ఆగిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. జేడీఎస్ ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ కు దూరం కావాల్సిన అనివార్యత ఏర్పడుతుందన్న ఆందోళన దౌవెగౌడ, కుమారస్వామిలో ఉందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం వేరు ఎన్నికల తర్వాత సర్దుబాట్లు చేసుకోవడం వేరని అందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి ఎవరు ఎక్కువ పదవులు ఇస్తే లేదా సీఎం పదవి తమకు వదిలేస్తే కలిసిపోదామనుకునే తత్వం జేడీఎస్ నేతలది కావడంతో వాళ్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం లేదనిపిస్తోంది.

నిజానికి హైదరాబాద్ కర్ణాటకలో బీఆర్ఎస్ కు బాగానే ఓట్లు వస్తాయని లెక్కగడుతున్నారు. అక్కడి తెలుగువారు కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అందుకే జేడీఎస్ తొలుత కేసీఆర్ పార్టీ వైపు మొగ్గు చూపించని చెబుతున్నారు. అయితే తర్వాత కొంచెం దూరం జరిగింది. ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమానికి కుమారస్వామి వెళ్లలేదు. అందుకు ఒకటి రెండు కారణాలూ ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దానితో బీఆర్ఎస్ వైపు జరిగితే కాంగ్రెస్ పార్టీకి కోపం రావచ్చని కుమారస్వామి అనుమానిస్తున్నారట. అసలు బేస్ లేని బీఆర్ఎస్ వైపు వెళ్లేకంటే రాష్ట్రంలో స్ట్రాంగ్ గా ఉన్న కాంగ్రెస్ ను నమ్ముకుంటే మంచిదని విశ్వసిస్తున్నారట

కేసీఆర్ కు కూడా కర్ణాటక విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి. జేడీఎస్ ఎప్పుడు ఒంటరిగా గెలిచింది లేదని అందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుని కుమారస్వామి సీఎం అవుతుంటారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు ఎక్కువ సీట్లు వస్తాయన్న విశ్వాసమూ బీఆర్ఎస్ వర్గాల్లో కలగడం లేదు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ ప్రచారానికి వెళ్లిన పక్షంలో ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే తొలి పరీక్షలోనే ఫెయిలైట్లు అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. దానితో ఇటు బీఆర్ఎస్ అటు జేడీఎస్ రెండు పార్టీలు అనుమానంగానే ముందుకు సాగుతున్నాయన్న చర్చ జరగుతోంది. నోటిఫికేషన్ కు ఎక్కువ టైమ్ లేకపోవడంతో త్వరలోనే క్లారిటీ రావచ్చు.