కర్ణాటకలో లింగాయత్ ఓట్లు రాబట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 2013 ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. శెట్టార్ సావది చేరికతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి హస్తం శ్రేణులు. మరి బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడినట్టేనా కమలనాథులు ఏమంటున్నారు. కర్ణాటకలో బలమైన సామాజికవర్గం రాజకీయంగా కీలకమైన లింగాయత్‌లు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎటువైపు మొగ్గుతారనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్ మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావది కాంగ్రెస్ గూటికి చేరడంతో లింగాయత్ ఓటుబ్యాంక్ చీలుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. శెట్టార్ సావది లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకులు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే పైగా వివాదరహితుడు. లక్ష్మణ్ సావది కూడా బెళగావి ప్రాంతంలో కీలకమైన నేత. వీరిద్దరిని బీజేపీ పక్కనపెట్టడంతో కాంగ్రెస్ తెలివిగా అందిపుచ్చుకుంది. లింగాయత్‌లను బీజేపీ అవమానిస్తోందనే కొత్త ప్రచారానికి తెరతీసింది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ప్రజలు 17 శాతం ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నేతగా ఎదిగారు.
బీజేపీకి ఇంతకాలంగా లింగాయత్‌లు మద్దతు ఇవ్వడానికి ఓ విధంగా ఆయనే ప్రధాన కారణం. యడ్డీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల ఇప్పటికే లింగాయత్‌లలో అసంతృప్తి ఉంది. ప్రస్తుత సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే అయినా యడియూరప్పకు ఉన్నంత క్రేజ్ బొమ్మైకి లేదు. లింగాయత్‌లు దూరమైతే పార్టీ పరిస్థితి ఏంటనేది బీజేపీకి పదేళ్ల క్రితమే అనుభవమైంది. 2013లో యడియూరప్ప బీజేపీని వదిలి కర్ణాటక జనతా పక్ష పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు లింగాయత్లు బీజేపీకి దూరం జరిగారు. దీంతో ఆ ఎన్నికల్లో జేపీ కేవలం 40 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు కూడా లింగాయత్లు పార్టీకి దూరమైతే అలాంటి పరిస్థితులే వస్తాయేమో అనే ఆందోళన కొందరు బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే యడ్డీ మాత్రం ఈ వాదనను తొసిపుచ్చారు. లింగాయత్‌లు బీజేపీకి అండగా ఉన్నారని ఎప్పటికీ ఉంటారని స్పష్టంచేస్తున్నారు అయితే బిజెపి లెక్కలు వేరే ఉన్నాయి. ఇపుడు బిజెపికి దూరమైన లింగాయత్ అగ్రనేతలంతా కూడా అవినీతి ఆరోపణలు ఉన్నవారే. ఆకారణంగానే వారికి పార్టీ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ప్రజల్లోనూ వారి పట్ల వ్యతిరేకత ఉందని బిజెపి నాయకత్వం అంటోంది. అంత వ్యతిరేకత ఉన్న నేతలు పార్టీ గోడ దాటినంత మాత్రాన బిజెపికి నష్టం రాదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పరులు ఏ పార్టీ తరపున పోటీ చేసినా ప్రజలు ఓడిస్తారని వారు అంటున్నారు.
గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే దానికి నిదర్శనమని బిజెపి అగ్రనేతలు స్వానుభవంతో చెబుతున్నారు. 2021లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇవ్వకూడదని దీదీ నిర్ణయించారు వారంతా బిజెపిలో చేరారు. అయితే ఎన్నికల్లో వారిలో కేవలం నలుగురే గెలిచారు. ఈ 34 మంది బయటకు పోవడంతో వారి స్థానంలో కొత్త నేతలను నిలబెట్టిన మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. కర్నాటకలో ఇపుడు అదే జరగబోతోందని కమలనాథులు నమ్ముతున్నారు. అవినీతి పరులను చేర్చుకున్న కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుందని వారంటున్నారు. లింగాయత్ ఓట్లు దూరమవకుండా బీజేపీ హైకమాండ్ కూడా జాగ్రత్త పడుతోంది. ధార్వాడ్ జిల్లాలోని శ్రీ మూరుసవీర మఠ్‌ను సందర్శించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. గురుసిద్ధ రాజయోగీంద్ర స్వామి ఆశీర్వాదం అందుకున్నారు. ఆ తర్వాత సిద్ధరూధ మఠ్‌ను సందర్శించారు జేపీ నడ్డా. ఇవి రెండూ లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన మఠాలే. మరి లింగాయత్‌ల మద్దతు ఎవరికో తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే.