ప్రస్తుతం పాకిస్థాన్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్య నిలువలు అడుగంటి పోయాయి. ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజల జీవన పరిస్థితులు దిగజారిపోయాయి. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సబ్సిడీలో అందించే గోధుమ పిండి కోసం జనం తన్నుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆందోళనలు మిన్నంటాయి. పీవోకేలోని గిల్గిట్, బాల్టిస్థాన్ ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేయాలనే డిమాండ్ ను మరింత బలంగా వినిపిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ర్యాలీలతో పాకిస్థాన్ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. రెండు వారాలుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు ముమ్మరంగా సాగుతున్నాయి. తమ ప్రాంతం పట్ల పాక్ చూపిస్తున్న వివక్షను వారు ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. కార్గిల్ రోడ్డును తెరిచి భారత్ లో కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సబంధించిన వీడియోలు ట్విట్టర్ లో సంచలనం సృష్టించాయి. పీవోకేలో నెలకొన్న పరిస్థితులు భారత్ కు అనుకూలించేవేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూడు నెలల క్రితం భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ ని తిరిగి సొంతం చేసుకుంటామని అన్నారు. భారత్ ను పాక్ వెన్ను పోటు పొడిచిందని ఆక్రమించిన కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని చెప్పారు. పాకిస్థాన్ తన చర్యల పర్యవసానాలను చవిచూడాల్సి వస్తుందని పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని భాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. పాక్ ఆక్రమిత గిల్గిత్ బాల్టిస్థాన్ హస్తగతం చేసుకున్న తర్వాత జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అయితే గిల్గిట్, బాల్టిస్తాన్లను స్వాధీనం చేసుకోడానికి అనువైన సమయం కోసమే భారత సర్కారు వేచి చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. పాక్ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతే అక్కడి ప్రజల మద్దతుతో, సైనిక బలంతో పీవోకేను సొంతం చేసుకోవడానికి మార్గం సుగమమం అవుతుందని భావిస్తున్నారు.