లిక్కర్‌ స్కామ్‌లో మరో ఇద్దరి అరెస్ట్..

By KTV Telugu On 8 February, 2023
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు మరింతగా దూకుడు పెంచుతున్నాయి. దీంతో డొంక అంతా కదులుతోంది. ఇప్పటివరకు ఢిల్లీ, తెలంగాణాకు చెందిన వ్యక్తులను అరెస్టు చేయగా తాజాగా పంజాబ్ కు చెందిన మల్హోత్రా అరెస్ట్‌ అయ్యాడు. బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. గౌతమ్ మల్హోత్రా పంజాబ్‌ మాజీ ఎమ్మెల్యే దీపక్ మల్హోత్రా కుమారుడు. మద్యం తయారీ వ్యవహారాల్లో నిమగ్నమైన ఓయాసిస్‌ గ్రూప్‌ వ్యవహారాలను కూడా గౌతమ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. గౌతమ్‌ వైన్స్‌ పేరుతోనే ఓయాసిస్‌ గ్రూప్‌ మార్కెట్‌లోకి మద్యం తీసుకొస్తోంది. లిక్కర్ స్కామ్‌లో గ్రూపులుగా ఏర్పడటంలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానిస్తోంది. అక్రమ నగదు తరలింపు నేరాల్లో నిందితుడుగా వున్న గౌతమ్ మల్హోత్రా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విధానాన్ని అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేర్లు చేర్చుతున్నారు అధికారులు. దాంతో ఈ కేసులో మరో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గరు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎమ్మెల్సీ మాజీ సీఏ పాత్ర ఉందనే అనుమానాలు ఆధారాలతోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడు. ఈ స్కామ్‌లో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. అంతకుముందు అతని ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆడిటర్ బుచ్చిబాబు అరెస్ట్‌తో కవితకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ప్రచారం సాగుతోంది. కవితకు అత్యంత సన్నిహితుడిగా బుచ్చిబాబు ఉన్నారనే టాక్ ఉంది. ఇప్పటికే కవితను ఈ స్కాంలో సీబీఐ ప్రశ్నించడంతో పాటు ఇటీవల ఛార్జిషీట్‌లో ఆమె పేరును కూడా చేర్చింది. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు అరెస్ట్ బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది. బుచ్చిబాబు అరెస్ట్‌తో త్వరలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి.

మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నందున గతేడాది సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీ మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు పలు ప్రముఖులతో దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తుల పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రూస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలువురి ప్రముఖుల పేర్లు కూడా ఉండటం హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు,అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా తాజాగా గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసింది ఈడీ. మనీ లాండరింగ్ అక్రమ నగదు తరలింపు వ్యవహారాల పై దర్యాప్తు జరుపుతోంది. మద్యం కంపెనీలకు వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసినందుకు గాను 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు విజయ్ నాయర్ ద్వారా ఇచ్చినట్లు నిందితులపై ఆరోపణలు నమోదు అయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ పాలసీ ముడుపులను ఖర్చు చేసినట్లు ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పేర్కొంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.