లిక్కర్ స్కాం లో కొత్త ట్విస్ట్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు

By KTV Telugu On 15 April, 2023
image

ఢిల్లీ లిక్కర్ కేసు ప్రకంపనలు ఇంకా ఆగలేదు. సిబిఐ ఆఫీసు కేంద్రంగా పుట్టిన ఈ కంపం ఢిల్లీలోని అధికార పీఠాన్ని కదిలించే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన అధికారులు ఇపుడు ముఖ్యమంత్రికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అర్ధంకాక ఆప్ నేతలు కలవరపడుతున్నారు. ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అన్నదానిపై లోలోన గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీ రాష్ట్రం పేరుకు రాష్ట్రం కానీ చాలా చిన్న రాష్ట్రం. అంత చిన్న రాష్ట్రం పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అదేదో ఘనత సాధించినందుకు కాదు ఓ నిర్వాకం కారణంగానే ఢిల్లీ చర్చలో ఉందిపుడు.

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో నిబంధనలకు తిలోదకాలిచ్చి మద్యం వ్యాపారులకు లాభాలు తెచ్చేలా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు గానూ మద్యం సిండికేట్ పెద్దల నుండి ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. దక్షిణాదికి చెందిన లిక్కర్ ట్రేడ్ వింగ్ సౌత్ గ్రూప్ ఈ అక్రమాల వెనక ఉందని అంటున్నారు. సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి కుంభకోణానికి తెగబడ్డారన్న ఆరోపణతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనయ కవితను ఈడీ పలు దఫాలుగా విచారించింది. ఆంధ్రప్రదేశ్ లో పాలక పక్ష ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిపైనా ఆరోపణలు రాగా ఆయన్ను అరెస్ట్ చేశారు కూడా. ఇక కవిత అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. సిసోడియాకు కోర్టులో బెయిల్ కూడా రాలేదు. సిసోడియాతో పాటు మరి కొందరిని కూడా అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కే నోటీసులు పంపింది.

కేజ్రీవాల్ పై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అందులో భాగంగానే నిజాయితీకి మారుపేరైన కేజ్రీవాల్ కు సిబిఐ చేత నోటీసులు ఇప్పించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. అయితే నోటీసులకు తాము భయపడేది లేదని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. మనీష్ సిసోడియాతో పాటు మరో మంత్రిని అరెస్ట్ చేయడంతోనే ఆప్ ప్రభుత్వ ప్రతిష్ట కొంతమేర మసకబారింది. వారి స్థానంలో మరో ఇద్దరిని మంత్రులుగా నియమించారు కేజ్రీవాల్. ఇపుడు కేజ్రీవాల్ కే నోటీసులు వచ్చాయి. ఇంతకు ముందే పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విచారించగా ప్రతీ ఒక్కరూ కూడా ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉందనే చెబుతున్నారని సిబిఐ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ కు తెలీకుండా ఈ కుంభకోణం చోటు చేసుకునే ప్రసక్తే లేదని వారంటున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ అనేది ప్రభుత్వ పరంగా తీసుకునే విధానం. అది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రూపొందేది కాదు. ముఖ్యమంత్రికే కాదు ఆ మాటకొస్తే ఢిల్లీ మంత్రి వర్గానికి తెలిసే ఉండాలి. మరి కేజ్రీవాల్ ను విచారించనున్న సిబిఐ ఏ కొత్త విషయాలు రాబడుతుందో చూడాలి. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గత 2022 జులై నెలలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అప్పుడే ఈ కేసు వెలుగుచూసింది.

ఆ వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా హోంశాఖ సిబిఐని ఆదేశించింది. ప్రాధమిక దర్యాప్తు జరిపిన సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను ఏ-1గా పేర్కొంటూ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. ఇక సిబిఐ తో పాటు   కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమీర్ మహేంద్రు విజయ్ నాయర్ పి.శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబు అభిషేక్ బోయిన పల్లి అమిత్ అరోరా మాగుంట రాఘవరెడ్డి లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ సిసోడియాను అరెస్ట్ చేసినట్లే కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం గందరగోళం లో పడే అవకాశాలు ఉంటాయి. అపుడు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఉంటుంది.  ఢిల్లీలో కాంగ్రెస్-బిజెపిలను చావు దెబ్బతీసి అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. ఇటీవల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బిజెపిని ఓడించి పాతికేళ్ల తర్వాత బిజెపిని అధికారం నుండి తప్పించారు. ఈ కక్షలతోనే  కేజ్రీవాల్ ను వేధిస్తున్నారన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకునే విచారణకు రావల్సిందిగా సిబిఐ నోటీసులు జారీ చేసిందంటే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి ఉండచ్చంటున్నారు విశ్లేషకులు. అయితే కేజ్రీవాల్ సన్నిహితులు మాత్రం ప్రపంచం తల్లకిందులైనా కేజ్రీవాల్ అనే వ్యక్తి దమ్మిడీ అవినీతికి కూడా పాల్పడే రకం కాదని అంటున్నారు. కేజ్రీవాల్ ను రాజకీయంగా ఎన్నికల్లో గెలవలేకనే బిజెపి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మలుచుకుని వేధిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.  కేజ్రీవాల్ విచారణతో పాటు కవితను కూడా మరోసారి విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ సారి కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. తెలంగాణా బిజెపి నేతలయితే కవిత అత్యంత అమర్యాదకరమైన అవినీతికి పాల్పడ్డారని ఆమె అరెస్ట్ ఖాయమని చాలా రోజులుగా అంటూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.