నవ వసంతాలు నవ కుసుమాల పేరిట కేంద్రం తమ తొమ్మిదేళ్ల పాలనను విస్తృతంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. దేశం మొత్తం. దాదాపుగా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన పురోగతి సాధించామని చెబుతోంది. అయితే ఉన్నవన్నీ అమ్మేయడమే పురోగతా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారి ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి కానీ తమకు మాత్రం అలా అమ్మేయడం అభివృద్ధేనని చెబుతోంది. సందట్లే సడేమియాలో బ్యాంకులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామని ఎక్కడా ప్రచారం కాకుండా ప్రకటించేసింది కూడా. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్తున్నది. ఏయే బ్యాంకులను ముందుగా ప్రైవేటీకరణ చేయాలన్న దానిపై ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయనుంది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా చర్యలను వేగవంతం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ విశాల ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలు తీసుకుంటుండడం సమర్ధనీయం కాదు. ఆర్థికమంత్రి ప్రకటన బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే విషయంలో తగ్గడం లేదని అర్థమవుతోంది.
బ్యాంకుల జాతీయీకరణ ఇందిరగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన ఓ అద్భుతమైన పని. అది దేశాభివృద్ధికి ఉపయోగపడింది. ఇప్పుడు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడమే మంచి పని అని కేంద్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అయితే ఒకే సారి కాకుండా ఓ పద్దతి ప్రకారం బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. ముందుగా బ్యాంకుల్ని విలీనం చేశారు. ఇప్పుడు వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్న ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ప్రభుత్వరంగ చిన్న బ్యాంకులపై మొదట గురి పెట్టారు. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అమలు జరిగిన బ్యాంక్ విలీనాల కారణంగా 28 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య నేడు 12కు చేరుకుంది. భవిష్యత్‌లో ఇది 4 లేక 5 కు పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నీతిఆయోగ్ 2021లో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ఐడీబీఐని కూడా ప్రైవేటీకరిస్తామని తెలిపారు. దారి సుగమం చేసేందుకు వీలుగా సంబంధిత చట్టాల్లో మార్పుల కోసం ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు-2021ను రూపొందించింది. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. అంటే వెనక్కి తగ్గినట్లు కాదు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు. గతంలో బిల్లు రెడీ చేసి కూడా ఆపడంతో వెనక్కి తగ్గారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తెర వెనుక జరుగుతున్న పనులు నిరూపిస్తున్నాయి.
1969లో దేశంలో బ్యాంకుల జాతీయీకరణ జరుగకముందు ప్రైవేటు బ్యాంకులు నగరాల్లో ఉండేవి. అవి సంపన్నులకు భూస్వాములకు మాత్రమే సేవలందించేవి. ఇందిరాగాంధీ జాతీయీకరణతో చేయడంతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా ప్రభుత్వ బ్యాంకులు విస్తరించాయి. అప్పటి వరకూ బ్యాంకులంటే తెలియని సాధారణ ప్రజలకు అవి కొండంత అండగా నిలిచాయి. అవసరమైనప్పుడు రుణాలిచ్చాయి. కష్టార్జితాన్ని భద్రపర్చుకోవటానికి అవకాశాన్నిచ్చాయి. ఎఫ్‌డీల రూపంలో నికర ఆదాయానికి ఒక మార్గం చూపాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలను సాకారం చేశాయి. భారతదేశ ఆర్థికవ్యవస్థ కుదురుకోవటంలో ప్రభుత్వ బ్యాంకులు పోషించిన పాత్ర కీలకమని చెప్పక తప్పదు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో 1991 నుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరికైనా ఒక కోటికి మించి రుణం ఇవ్వాలంటే రిజర్వుబ్యాంకు నుండి ముందస్తు అనుమతి ఉండాలన్న నిబంధనను తొలగించారు. క్రమేపీ బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74 శాతానికి పెంచారు. అనేక ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను తగ్గించుకుంటూ వస్తున్నారు. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వందల సంఖ్యలో ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీశాయి. ఇప్పుడు ఉన్న ప్రపంచ దిగ్గజ బ్యాంకులన్నీ దివాలా తీశాయి. ప్రజల సొమ్మును వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే నిలదొక్కుకున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం నిలదొక్కుకొని గట్టెక్కడానికి ప్రభుత్వరంగ బ్యాంకులే ముఖ్య కారణం.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మూడేళ్ళుగా రూ.2 లక్షల కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ కేంద్రం నష్టాల సాకులు చెబుతోంది. ఎందుకంటే రాజకీయ పెద్దల అండందడంలతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కార్పొరేట్లు భారీగా ఎగ్గొట్టడం వల్ల మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు వస్తున్నాయి. గత ఆరేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల 11 లక్షల కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో రాకుండా నిరోధిస్తే బ్యాంకింగ్ రంగం అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. బ్యాంకింగ్ లో ప్రభుత్వ వాటాలు అమ్మడం మొదలైన తరువాత నుండి ఇప్పటి దాకా దాదాపు 40 శాతం పైగా వాటాలను ప్రభుత్వ బ్యాంకుల నుండి ఉపసంహరించారు. బ్యాంకింగ్ రంగంలో లక్షల్లో ఉద్యోగులు రిటైర్ అవుతుంటే నియామకాలు వేలల్లోనే ఉంటున్నాయి. స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగి సగటున 1680 మందికి సేవలు అందిస్తుంటే అదే ప్రయివేటు రంగంలో అగ్రగామి బ్యాంక్ అయిన హెచ్.డి.ఎఫ్.సి లో ఉద్యోగి కేవలం 467 కస్టమర్లకు సేవలు అందిస్తున్నాడు. ఏ కార్పొరేట్ల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులలో భారీగా పారు బకాయిలు పెరుగుతున్నాయో వారే రేపు బ్యాంకులను కొనుగోలు చేస్తారు. అత్యధిక వాటాలను పొందుతారు. అప్పుడు ప్రజల డిపాజిట్లకు భద్రత ఎవరు. బ్యాంక్ అంటే ప్రభుత్వానిది అనే ఓ నమ్మకం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను ఆ నమ్మకం సడలిపోయేలా చేస్తున్నారు. మంచే జరుగుతుందని కేంద్రం చెబుతుంది కానీ కార్పొరేట్లకే మంచి జరుగుతుందని ఇతరులు అంటున్నారు. ఏదైనా బ్యాంకింగ్ రంగాంపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఖచ్చితంగా దానిపై ప్రభుత్వ బ్యాంక్ అనే ముద్ర ఉండాలి లేకపోతే నమ్మకం కష్టమే.