ఓ ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారు. అదే తరహాలో ఇప్పుడు ఓ యువకుడు ఛాయ్ అమ్మి బెంజ్ కారు కొన్నాడు. ఒక ఛాయ్‌వాలా బెంజ్ కారు కొనడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం ఛాయ్ అమ్మి అంత డబ్బు ఎలా సంపాదించాడనే చర్చ మొదలైంది. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే కదా. బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం. అహ్మదాబాద్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ ఎంబీయే మధ్యలోనే ఆపేశాడు. కుటుంబ పోషణ కోసం 2017లో ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ వద్ద ‘ఎంబీయే చాయ్‌వాలా’ పేరుతో ఒక చిన్న టీ స్టాల్ ప్రారంభించాడు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే పేరుతో ఇతర ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఓపెన్ చేశాడు. అవి కూడా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ప్రఫుల్‌కు 200పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రపుల్ దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్ అయ్యాడు.
ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత నిలదొక్కుకున్నాడు. 2019-20 సంవత్సరంలో అతని టర్నోవర్ రూ.3కోట్లకు చేరింది. ‘ఎంబీయే చాయ్‌వాలా’ పేరుతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి కంటెంట్ క్రియేటర్‌గానూ మారాడు. ప్రఫుల్ బిల్లోర్ అకౌంట్‌కు 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అతనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు వచ్చింది. అటు చాయ్ షాపుల నుంచి ఇటు సోషల్ మీడియా నుంచి ప్రఫుల్ బిల్లోర్ కు భారీగా ఆదాయం వస్తోంది. ఆరేళ్లలో బాగా సంపాదించాడు. ఈమధ్యే ప్రఫుల్ మెర్సిడెస్ ప్రీమియమ్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. ఇది 7 సీటర్ లగ్జరీ ఎస్యూవీ. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.88లక్షల నుంచి రూ.1.05కోట్ల వరకు ఉంటుంది. తాను కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఒక చాయ్‌వాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ స్థాయి విజయం సాధించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ ఎంబీయే చాయ్ వాలా.