అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసింది. ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీల చూపు లోక్ సభ ఎన్నికలపై ఉంది. లోక్ సభ నియోజక వర్గాల నుండి పోటీ చేయాలని బి.ఆర్.ఎస్. బిజెపి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అటు పార్టీల నాయకత్వాలు సైతం ఏ నియోజక వర్గంలో ఎవరిని బరిలో దించితే బాగుంటుందో ఇప్పుడే కసరత్తులు మొదలు పెట్టేశాయి. నచ్చిన నియోజక వర్గంపై నేతలు కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం క్యూలో ఉన్నారు. అయితే పార్టీల నాయకత్వాలు ఏం చేస్తాయన్నది కాలమే చెప్పాలి.
సికింద్రాబాద్ నుంచి పోటీకి మాజీ మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్ తో పాటు, మన్నే క్రిషాంక్ సిద్దంగా ఉన్నారు. మల్కాజ్ గిరి నుంచి పోటీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు టిక్కెట్ ఆశిస్తున్నారు. వరంగల్ నుంచి సిట్టింగ్‌ఎంపి పసునూరి దయాకర్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పోటీపడుతున్నారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్‌ఎంపి మాలోత్ కవిత లేదా ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ లలో ఒకరికి టికెట్ ఇవ్వనున్నారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపి నామా నాగేశ్వరరావుతో పాటు..మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కూడా ట్రై చేస్తున్నారు. నల్గొండలో గుత్తా అమిత్, నల్లమోతు భాస్కర్, వేంరెడ్డి నర్సింహారెడ్డి పోటీలో ఉన్నారు.
భువనగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీ ఆర్ ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణరెడ్డితో పాటు గొంగిడి సునీత కూడా ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత, అదిలాబాద్ నుంచీ మాజీ ఎంపి నగేష్, మెదక్ నుంచి పార్టీ అధినేత కేసిఆర్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి కేసిఆర్ కాకపోతే మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లో ఎంపి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
కమలం పార్టీలోని కొందరు నేతలు ఇప్పుడు ఎంపీ సీట్లపై కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. హస్తినలో లాబీయింగ్ మొదలు పెట్టారు. పలువురు నాయకులు ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నాం అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పార్టీ అధికారికంగా ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించలేదు. నాయకుల తీరుతో కాషాయ పార్టీలో పార్లమెంట్ సీట్ల గోల మొదలైంది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాయి. బీజేపీకి చెందిన కొందరు నేతలు పార్లమెంటుకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం పార్లమెంట్ బరిలో దిగేందుకు సై అంటున్నారు. బీజేపీకి తెలంగాణలో ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉండగా..వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మరోసారి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాలు నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే అదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం ఎంపీ సోయం బాపురావు పోటీ చేస్తారా? లేదా? అనే సందేహం వ్యక్తం అవుతుంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తనకు ఆ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి, మెదక్ సీట్లలో ఏదో ఒక చోట నుండి పోటీ చేసే అవకాశం ఉంది. మెదక్ నుండి రఘునందన్ రావు గతంలో పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీకి రెడీ అంటున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సుభాష్ రెడ్డి పోటీ చేయాలని అనుకుంటున్నారట. వరంగల్ పార్లమెంట్ స్థానం కొండేటి శ్రీధర్ ఆశిస్తున్నారట. మహబూబాబాద్ నుంచి పోటీ చేసేందుకు హుస్సేన్ నాయక్ సిద్ధంగా ఉన్నారని టాక్. పెద్దపల్లి నుండి మరోసారి తనకు అవకాశం రావచ్చని ఎస్ కుమార్ భావిస్తున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ పోటీకి దిగడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ కే మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…