నేలపై అత్యంత వేగంగా పరిగెత్తే జీవుల్లో చీతాను మించింది మరేదీ లేదు. ఈ అరుదైన వన్యప్రాణులు ఆఫ్రికా ఖండంలో విస్తరించిన విశాలమైన సవానా గడ్డి మైదానాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి గంటకు సుమారుగా 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. కేవలం మూడు సెకన్లలోనే ఇది గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. వాటి శరీర నిర్మాణం కూడా అవి వేగంగా పరిగెత్తేందుకు వీలుగా ఉంటుంది. పొడవైన కాళ్లు, సన్నటి నడుముతో తీక్షణమైన కంటిచూపుతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిలో వెన్నెముక చాలా పొడుగ్గా ఉంటుంది. అది ఎటు పడితే అటు కదిలేందుకు వీలుగా ఉంటుంది. పరిగెడుతున్నప్పుడు కాళ్లు వెనక్కి వెళ్లినప్పుడు వెన్నెముక సాగుతుంది. మళ్లీ కాళ్లు ముందుకొచ్చినప్పుడు ముడుచుకుంటుంది. పరిగెట్టేటప్పుడు శరీరమంతా కదులుతున్నా దాని తల మాత్రం స్థిరంగా ఉంటుంది. కళ్లు తాను వేటాడుతున్న జంతువు మీదే కేంద్రీకృతమై ఉంటాయి. ఒక్కసారి అది తన ఎరను ఎంపిక చేసుకున్నాక సుమారుగా 30 సెకన్లలోపే దాన్ని పడగొట్టాలి. ఆ తరువాత దాని గరిష్ట వేగం తగ్గిపోతుంది. అందుకే వేటలో అవి 50 శాతమే విజయం సాధిస్తాయి. సాధారణంగా 2 నుంచి 5 రోజులకు ఒకసారి వేటాడతాయి. ఇవి పులులలాగా గాండ్రించలేవు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7,500 చీతాలు ఉన్నాయి.
ఒకప్పుడు మన దేశంలో కూడా చీతాలు ఉండేవి. కానీ 1948 నాటికి మిగిలి ఉన్న చివరి చీతా చనిపోవడంతో అవి మనదేశంలో అంతరించిపోయాయి. 1952లో చీతాలను అంతరించిన వన్యప్రాణులుగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో అంతరించిన చీతాలను తిరిగి పునరుద్ధరంచడానికి నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. పాజెక్ట్ చీతా లో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక బోయింగ్ విమానంలో మన దేశానికి తీసుకొచ్చారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఈ చీతాలు మన దేశంలోకి అడుగుపెట్టాయి. వీటిలో ఐదు ఆడ మూడు మగ చీతాలు ఉన్నాయి. వచ్చిన వెంటనే వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా వాటిని 30 రోజులు క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. ఆ తరువాత వాటిని పార్కులో విడిచిపెట్టారు. చీతాల ఆలనా పాలనా చూసేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకువస్తోంది. వీటికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ17 ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరి వెళ్లింది. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చీతాలు ఇండియాకు చేరుకుంటాయి. వీటిలో 7 మగ, 5 ఆడ చీతాలున్నాయని తెలిపారు. వీటికోసం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో పది క్వారంటైన్ ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దక్షిణ ఆఫ్రికా నుంచి మొత్తం 24 చీతాలను భారత్‌కి రప్పించాలన్నది ఒప్పందం. ఇప్పుడు 12 చీతాలు వస్తున్నాయి. వచ్చే 8 నుంచి 10 ఏళ్లలో మిగతా 12 చీతాలు వస్తాయి. ఈలోగా ఇక్కడ కూడా వాటి సంతతి వృద్ధి చెందుతుంది.