ఢిల్లీ బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో రాజశ్యామల యాగం

By KTV Telugu On 12 December, 2022
image

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు దేవభక్తి ఎక్కువ. కొత్తగా ఏ కార్యక్రమైనా చేపట్టడానికి ముందు ఆయన నిష్టగా పూజలు చేస్తారు. గతంలో భారీ ఎత్తున యాగాలు చేశారు. 2018లో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచి రెండో సారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగపెట్టారు. అటు చూస్తే మరో సంవత్సరంలో అంసెబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రాజశ్యామల యాగానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి హైదారాబాద్‌ లో కాదు… దేశ రాజధాని ఢిల్లీలో యాగం చేయబోతున్నారు.

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం సిద్ధమైంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సంతోష్‌ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాస్తు సంబంధమైన అంశాలపైన వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్‌ తేజ కొన్ని సూచనలు చేశారు. యాగశాల స్థలం ఎంపికచేసి అవసరమైన ఏర్పాట్లపై కూడా కొన్ని సూచనలు చేశారు. ఇటు కేసీఆర్‌ ఈరోజు హస్తినకు బయలుదేరారు. రేపు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. 13, 14 తేదీల్లో యాగం నిర్వహిస్తారని, యాగం అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారని సమాచారం. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, ఇతర ముఖ్య నాయకులందరూ హాజరుకానున్నారు.

ఈ నెల 13వ తేదీ రాత్రివరకు వీరంతా హస్తినకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలు ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలను కేసీఆరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తరువాత ఆయన జాతీయ మీడియాతో మాట్లాడతారు. నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉండి బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరింపచేసేందుకు కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తారని సమాచారం. రాజకీయ నేతలే కాకుండా రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లతో చర్చించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.