ఎన్నో ఓటముల మధ్య చీకట్లో చిరుదివ్వెలా కాంగ్రెస్‌కో గెలుపు. హిమాచల్‌ప్రదేశ్ విజయంతో కాంగ్రెస్ ఆశలు చిగురించాయి. మోడీ మేనియాలో తెరమరుగైపోతామన్న భయాన్ని హిమాచల్ విజయం కాస్త దూరం చేసింది. గుజరాత్‌లో దారుణంగా దెబ్బతిన్నా హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ సర్కారుని కాంగ్రెస్ గద్దెదించగలిగింది. షరామామూలుగానే సీఎం సీటుకోసం కొట్లాటతో కాంగ్రెస్ కొంపమునుగుతుందని అనుకున్నారు. కానీ అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎంచుకుని కాంగ్రెస్ విజ్ఞతను ప్రదర్శించింది.
సుఖ్విందర్‌సింగ్ హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశ్వాసపాత్రుడైన నాయకుడిగా ఉండటమే ఆయనకు కలిసొచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 68 స్థానాలకు కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. సగానికి పైగా ఎమ్మెల్యేలు సుఖ్వీందర్ నాయకత్వాన్ని సమర్ధించటంతో పోటీకొచ్చిన నేతలు వెనక్కితగ్గారు. సీఎం పదవికోసం పోటీపడ్డ ప్రతిభాసింగ్, డిప్యూటీ సీఎంగా ఎన్నికైన ముకేశ్ అగ్నిహోత్రి ఇద్దరూ మాజీ సీఎం వీరభద్రసింగ్ ఆశీస్సులతో పాలిటిక్స్‌లోకొచ్చారు. సుఖ్వీందర్ సింగ్ విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి స్వతంత్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
విద్యార్థి నాయకుడి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు అధినాయకత్వం మనసెరిగి మసలుకున్నారు సుఖ్విందర్‌సింగ్. విద్యార్థి దశలో ఫైర్‌బ్రాండ్ అనే పేరున్నా పార్టీ అంతర్గత విషయాల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఎన్నికల్లో గెలిచాక కూడా ఆయన అత్యుత్సాహం చూపించలేదు. రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడం సుఖ్వీందర్‌కు మరో సానుకూలాంశం. పార్టీలో కొత్తవారికి అవకాశాలు దొరకడం లేదనే అపోహలు దూరం చేయాలని పార్టీ అధినాయకత్వం భావించడం కూడా సుఖ్వీందర్‌ని సీఎం పదవి కట్టబెట్టింది. డ్రైవర్ కడుపున పుట్టిన సుఖ్విందర్ సీఎంగా రాణిస్తాడని అతని తల్లే కాదు పార్టీ నాయకత్వం కూడా నమ్మకంతో ఉంది.