కశ్మీర్‌లో రాహుల్‌తో – ఖమ్మంలో బీఆర్ఎస్‌తో! కమ్యూనిస్టులు ఏం సందేశం ఇస్తున్నారు

By KTV Telugu On 18 January, 2023
image

ఖమ్మం బీఆర్ఎస్ సింహగర్జన సభకు కమ్యూనిస్టులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఖమ్మంలో రాజకీయ సమీకరణాలతో మాత్రమే కాదు దేశ రాజకీయాలలో కమ్యూనిస్టులతో ఉన్న అవసరం కోసం కేసీఆర్ ఇటీవల పొత్తుల ప్రకటన చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్‌తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలూ చెబుతున్నారు. అయితే ఈ కలయిక ఒక్క తెలంగాణకే పరిమితం కాదని జాతీయ స్థాయిలో ఉంటుందని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలు వచ్చి ప్రకటిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఖమ్మం బీఆర్ఎస్ సింహగర్జనకు కూడా హాజరవుతున్నారు. ఇలా హాజరవుతున్న వారిలో సీపీఐ జాతీయ నేత డి.రాజా కూడా ఉన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు. ఖమ్మం గర్జన సభకు వచ్చే ముందు రోజే ఆయన కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు. జమ్మూకశ్మీర్‌లో జరిగే రాహుల్ భారత్ జోడో యాత్రలో తాను పాల్గొంటానని ప్రకటించారు.

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభించి కశ్మీర్ వరకూ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచేందుకు మిత్రపక్ష పార్టీలతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలను నేతలను ఆహ్వానిస్తూ వస్తున్నారు. వీరిలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసే ఆలోచన ఉన్న వారు జోడోయాత్రలో రాహుల్ గాంధీతో పాదం కలిపారు. కానీ కమ్యూనిస్టులు ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినా ఇప్పటి వరకూ స్పందించలేదు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌తో ఎలాంటి సమస్యా లేదు. నిజం చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో వారు కాంగ్రెస్ కు సపోర్టుగా ఉంటారు. కానీ రాష్ట్రాలకు వచ్చే సరికి వారికి గందరగోళం తప్పడం లేదు. ఇప్పుడు అది మరింతగా పెరిగిపోతోంది.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి లెఫ్ట్ పార్టీలకు ప్రత్యర్థి. అక్కడ అధికారం కోసం కమ్యూనిస్టు పార్టీల కూటమి , కాంగ్రెస్ కూటమి పోటీ పడుతూంటాయి. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికితే పట్టు నిలుపుకుంటున్న ఒక్క రాష్ట్రం చేజారిపోతుంది. అందుకే కేరళకు సంబంధించినంత వరకూ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ దేశ రాజకీయాలకు వచ్చే సరికి బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటరనుకుంటోంది. అయితే ఇప్పుడు తెలంగాణ దగ్గరకు వచ్చే సరికి కమ్యూనిస్టు పార్టీలకు ఇక్కడ కాంగ్రెస్ తో ఎలాంటి సమస్యా లేకపోయినా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. ఇదే సీపీఐ పార్టీ ద్వంద్వ రాజకీయ ప్రమాణాలన్న విమర్శలకు కారణం అవుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సీపీఐ నేత డీ రాజా పాల్గొంటారు. అంతకు ముందే బీఆర్ఎస్ సభలో పాల్గొంటున్నారు. పైగా తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇది కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉంది.

కమ్యూనిస్టు పార్టీల నేతలు దేశమంతా ఒకే విధానాన్ని అనుసరించలేకపోతున్నారు. రాష్ట్రానికో పాలసీ పెట్టుకోవడం ముఖ్యంగా బలం ఉన్న చోట్ల సొంతంగా కాంగ్రెస్ కు కాకుండా ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలవడం లేదా రాజకీయ పోరాటం చేయడం వంటివి చేస్తున్నారు. దేశం మొత్తం వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీతో అన్నట్లుగా ఉంటున్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి మేలు కలగకపోగా కమ్యూనిస్టులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు దేశంలో కమ్యూనిస్టులు బలమైన శక్తులుగా ఉండేవారు. రాజకీయాల్లో ఎంతో కొంత నీతి నిజాయితీ నిబద్ధత సిద్దాంతాల పట్ల ఆసక్తి ఉన్న పార్టీలుగా కమ్యూనిస్టులకు పేరు ఉండేది. కానీ రాను రాను వారి రాజకీయ నిర్ణయాల కారణంగా ప్రజల్లోనూ నిరాసక్తత ఏర్పడి ఆదరణ తగ్గుతోంది. అయినప్పటికీ ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ నిర్ణయాలు వదులుకోవడం లేదు.

రాజకీయ అవసరాల కోసం నిర్ణయాలు మార్చుకోవడం సంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తాయి. వాటికి ఉండే రాజకీయ అనుకూలతలు కమ్యూనిస్టులకు ఉండవు. ఎందుకంటే కమ్యూనిస్టుల పునాది సిద్దాంతాలు. వాటిని బలహీనం చేసుకుంటే పార్టీనే కుప్పకూలిపోతుంది. అలాంటి పరిస్థితి వచ్చినా నిర్ణయాల్లో మార్పులు ఉండటం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్‌తో కలిసి వెళ్లి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టి కమ్యూనిస్టులు తమ క్యాడర్‌కు ఎలాంటి సందేశం ఇస్తారో వాళ్లే విశ్లేషించుకోవాల్సి ఉంది.