కర్ణాటక మందుతో రాజస్థాన్ పార్టీకి వైద్యం

By KTV Telugu On 29 May, 2023
image

కర్నాటక మందుతో రాజస్థాన్ పార్టీకి వైద్యం చేసి బతికించుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం పథక రచన చేస్తోంది. కర్నాటక ఫార్ములానే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసి ఫలితాలు రాబట్టాలని భావిస్తోంది. పార్టీ అగ్ర నేత కె.సి. వేణుగోపాల్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ పై చర్చలు జరిపి తుది నిర్ణయానికి వచ్చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా కన్నడ మంత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పారని తెలుస్తోంది. కర్నాటకలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సజావుగా ఏమీ లేదు. పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్-మాజీ సిఎం సిద్ధరామయ్యలు పార్టీని నిట్ట నిలువునా చీల్చి రెండు వర్గాలుగా కొనసాగుతూ కత్తులు దూస్తున్న సమయమది. ఎన్నికల్లో గెలవాలంటే నేతలు ఐక్యంగా ఉండక తప్పదని వ్యూహకర్తలు పదే పదే చెప్పడంతో కాంగ్రెస్ హై కమాండ్ కన్నడ కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. డికే-సిద్ధరామయ్యలతో ముందుగా విడి విడిగా మాట్లాడారు. మీ ఇద్దరూ ఇలాగే కొట్టుకుంటూ ఉంటే మరోసారి బిజెపియే అధికారంలోకి వస్తుంది. మీరు చేతులు కలిపితే అధికారం మీ చేతుల్లోకి వస్తుంది అని విడమరచి చెప్పారు. ముందుగా సానుకూలంగా స్పందించకపోయినా కొంత ఆలోచించాక ఇద్దరు నేతలూ కూడా కలసి ఉంటేనే కలదు సుఖమని పాట పాడుకుని ఎన్నికలయ్యే వరకు కలసి ఉన్నట్లు నటిద్దామని చెప్పా అవగాహనకు వచ్చారు. దాన్ని సమర్ధవంతంగా అమలు చేశారు. అది తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు కోసం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. సరే ఆ తర్వాత దాన్ని కూడా సరిదిద్దారు.

కర్నాటకలో ఈ ఇద్దరు నేతలకంటే ఘోరంగా రాజస్థాన్ లో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్- యువనేత సచిన్ పైలట్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గెహ్లాట్ అయితే ప్రతిపక్ష బిజెపి నుంచి కన్నా తన పార్టీకే చెందిన సచిన్ పైలట్ నుండే సవాళ్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అవినీతిపై సచిన్ పైలట్ దీక్షకు దిగారు. ఇది ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చింది. దీంతో గహ్లోత్ మండిపడుతున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షుడిగా, డిప్యూటీ సిఎంగా ఉండేవారు. అయితే గహ్లోత్ పై తిరుగుబాటు చేసిన పైలట్ గాంధీలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పైలట్ ను మంత్రి వర్గంలో చేర్చుకోడానికి కూడా గెహ్లాట్ ఇష్టపడలేదు. అంతకు ముందున్న పిసిసి అధ్యక్ష పదవిని అశోక్ తన విధేయుడైన గోవింద్ సింగ్ కు ఇప్పించుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో ఈ ఇద్దరినీ ఇలాగే వదిలేస్తే కాంగ్రెస్ కొంప కొల్లేరవుతుందని భయపడుతోన్న పార్టీ నాయకత్వం కర్నాటక వైద్యాన్నే దీనికీ అప్లై చేయాలని భావిస్తోంది.

అశోక్-పైలట్ లను కూర్చోబెట్టి అధికారం రావాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఇద్దరూ సఖ్యతగా ఉండి తీరాలని చెప్పబోతున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి సచిన్ పైలట్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే అశోక్ గెహ్లాట్ దీనికి అభ్యంతరం చెబుతున్నారు. గోవింద్ సింగ్ ను పిసిసి పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో కీలక సామాజిక వర్గమైన జాట్ లు కాంగ్రెస్ కు దూరం అవుతారని అశోక్ గెహ్లాట్ అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. అయితే పైలట్ ను అడ్డుకోడానికే అశోక్ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తోన్న నాయకత్వం దీనికి ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. జాట్ ఓటర్లు దూరం కాకుండా చేసుకోవాలంటే డిప్యూటీ సిఎం గా మరో జాట్ నాయకుని నియమిస్తే సరిపోతుందని అపుడు పిసిసి పదవిని సచిన్ పైలట్ కు ఇవ్వచ్చని భావిస్తున్నారు.
కర్నాటకలో కలసి ఉండడం వల్ల వచ్చే లాభాన్ని చూసింది కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు పంజాబ్ లో గ్రూపు తగాదాల వల్ల జరిగే నష్టాన్ని చవి చూసింది. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్- పిసిసి అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య గొడవలు పార్టీని నిండా ముంచాయి.  హై కమాండ్ వైఖరి నచ్చక అమరీందర్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీలికలు పేలికలు అయినట్లయ్యింది. ఇది ప్రజలకు విసుగు తెప్పించింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చింది.  కాంగ్రెస్ ను తిరస్కరించి ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టారు పంజాబ్ ప్రజలు. తాము ఘర్షణలు పడి పార్టీని ముంచిన సిద్ధూ, అమరీందర్ సింగ్ లు కూడా ఓడిపోయారు.

ఈ అనుభవం నుంచే పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ నాయకత్వం కర్నాటకలో జాగ్రత్త పడింది. అది వర్కవుట్ కావడంతో ఇపుడు దానికి కన్నడ ఫార్ములా అని పేరు పెట్టుకుని ఇటువంటి పరిస్థితులు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆక్రమంలోనే ముందుగా పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్, తెలంగాణాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణాలోనూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సీనియర్లతోనూ భేటీ నిర్వహించి ఎన్నికలు అయ్యే వరకు పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని గట్టిగా చెప్పనున్నారు. తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తోన్న ప్రియాంక గాంధీయే ఈ విషయంలో చొరవ తీసుకుని తెలంగాణా కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత సాధించే బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. దీంతో పాటు కర్నాటకలో పంచసూత్ర హామీల ఫార్ములాను కూడా అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి సారించడంతో పాటు మహిళలు యువతను ఆకట్టుకునేలా పథకాలను రూపొందించే పనిలో ఉంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా వినూత్న ఆలోచనలతో దూసుకుపోవాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయాలతో పాటు 2024లో కుంభస్థలాన్ని కొట్టి నరేంద్ర మోదీని గద్దె దింపి కేంద్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాలన్న పంతంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కన్నడ ఫార్ములా తెచ్చిన విజయంతో హుషారుగా ఉన్న అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దీన్నే ఇతర రాష్ట్రాలకూ వర్తింప చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.