రాహుల్ నాయకత్వంపై ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరాలెందుకు

By KTV Telugu On 1 March, 2023
image

మోడీకి ప్రత్యామ్నాయ నేత ఎవరు అనేది చాలా కాలంగా దేశ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఎవరికి వారు తామే అనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీని మాత్రం గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఎవరికి వారు ఈగోలను పక్కన పెట్టి రాహుల్ ను మాత్రమే నాయకుడిగా అంగీకరించి కలసి కట్టుగా ముందుకు వస్తే నరేంద్రమోడీకి వచ్చే ఎన్నికల్లో కాస్త పోటీ ఇవ్వగలిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని చెప్పడానికి పెద్ద రాజకీయ విశ్లేషకులు అవసరం లేదు. కనీస అవగాహన ఉన్న వారు కూడా అంగీకరిస్తారు అలాంటిది తామే మోడీకి పోటీ అంటూ ముందుకు వస్తున్న వారికి తెలియదని అనుకోలేం. కానీ అలాంటి నేతల్లో రాహుల్ ను అంగీకరించలేని ఓ ఈగో ఉంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజల మనసుల్లో తన ఇమేజ్ మార్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా.

రాహుల్‌గాంధీ భారత జోడో యాత్ర ప్రభావం ప్రభావం కాంగ్రెస్ పై స్పష్టంగా కనిపిస్తోంది. సోనియా గాంధీ సైతం జోడో యాత్ర తో తన ఇన్నింగ్స్‌ ముగిసినట్టేనని ప్రకటించారు. అంటే రాహుల్‌ నాయక త్వాన్ని దేశ వ్యాప్తంగా అందరూ ఏకీభవిస్తున్నారనీ ఆయనకు ఇక అవరోధాలుండవన్నది ఆమె అభిప్రాయం అనుకోవాలి. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవరూ వ్యతిరేకించరు. జోడో యాత్ర ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వైపు నిర్వహించాలని నిర్మయించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసీఘాట్‌ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్‌ వరకూ ఈసారి జోడో యాత్ర సాగవచ్చు. ఈ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ తన నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించేందుకు మోడీకి తాను ధీటైన నేతనని ప్రూవ్ చేసుకునేందుకు ఎన్నికల ద్వారా అవకాశం లభిస్తుంది.

భావసారూప్యం గల పార్టీలతో పొత్తుకు ఏఐసిసి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ రా పొత్తుల విషయంలో అంత చురుగ్గా లేరు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌ను దూరం పెట్టాయి. కర్ణాటకలో జేడీఎస్‌ దూరం అయిపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కూడా గుడ్ బై చెప్పాయి. బెంగాల్‌లో పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ కూడా చెప్పడం లేదు. బీజేపీయతర పార్టీల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే విషంయలో ఆ పార్టీలన్నింటిదీ ఒకటే మాట. తీవ్రమైన పోరాటం చేసి బీజేపీని ఓడించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాయి. అయితే అదే సమయంలో వారంతా కలసి కట్టుగా పోరాడటానికి మాత్రం మందుకు రావడం లేదు. దానికి కారణం ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై వారిలో వారికి ఏకాభిప్రాయం లేకపోవడమే.

కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో మద్దతుగా నిలిచినా రాహుల్ నాయకత్వానికి మద్దతు ఇవ్వకపోవడానికి ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు కూడా ఓ కారణం. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం వారికి ఇష్టం ఇండదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ పూర్తి స్థాయి పట్టు సాధించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడానికి ఆమె సిద్ధపడటం లేదు.అలాగే యూపీలో కూడా మాయావతి అఖిలేష్ ఇద్దరూ పొత్తులు పెట్టుకున్న తర్వాత యూపీ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కాంగ్రెస్ తో పొత్తు వల్ల వారికి వచ్చే లాభం పెద్దగా లేదు. కానీ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇలాంటి కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన పార్టీలు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధపడటం లేదు.

రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా వచ్చే ఎన్నికల వాతావరణం ఏర్పడితే ఆ రెండు పార్టీలకే ప్రాధాన్యత పెరుగుతుందన్న భావనలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇదే జరిగితే తమకు నష్టం అన్న భావనలో ఉన్నాయి. ఇప్పటి వరకు రాహుల్ గాంధీని బీజేపీ మరో విధంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది. ఎక్కడ అడుగు పెట్టినా ఓడిపోతారని చెప్పడం ప్రారంభించారు. కానీ మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు రాహుల్‌ను బీజేపీ అలా చెప్పలేకపోతోంది. మోడీకి ధీటుగా రాహుల్ గాంధీ కూడా ఎదిగారు. ఎన్నికల తర్వాతే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవాలన్నది అన్ని పార్టీల అభిప్రాయం. కానీ మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు అనేది చూపించకపోతే ప్రజలూ నమ్మే పరిస్థితి ఉండదు. అందరూ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.