సమర్ధమైన పాలన అందిస్తామని జనం నమ్మేలా లేరు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపితే మీరున్నప్పుడు ఏం ఒరగబెట్టారని ప్రశ్నిస్తారు. అనుకోకుండా అమూల్ పాల గొడవ కలిసొచ్చింది. దాని వేడి చల్లారకుండా చూస్తూనే తాయిలాలతో కర్నాటక ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలతో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. నాలుగు హామీలను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని వరాలు ఉంటాయని ఊరిస్తోంది.
కర్నాటకలో ఫలానా పార్టీ కచ్చితంగా అధికారంలోకొస్తుందని చెప్పే పరిస్థితి లేదు. పోయిన ఎన్నికల్లోనూ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు కర్నాటక ఓటర్లు. దీంతో మొదట జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ తెరవెనుక చక్రం తిప్పటంతో ఆ ప్రభుత్వం కూలిపోయి కమలంపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఎన్నికల్లోనూ సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ పోటీతో కన్నాడనాట త్రిముఖపోటీ నడుస్తోంది. దీంతోఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి కూడా తనదే కీలక పాత్ర ఉంటుందన్న అంచనాతో జేడీఎస్ ఉంది.
సర్వేలు తనకే అనుకూలంగా ఉండటంతో ఒంటరిగానే అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మద్దతుకోసం ఆ పార్టీ ఉచిత హామీలు ఇస్తోంది. ఉచిత కరెంటు ఉచిత బియ్యం నిరుద్యోగ భృతి మహిళలకు ఆర్థిక సాయం వంటి నాలుగు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. అధికారంలోకి వస్తే గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. మహిళా ఓటర్ల మద్దతు కోసం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలనెలా 2వేల రూపాయలు ఇస్తామంటోంది. అన్న భాగ్య యోజన పథకంతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామన్నది కాంగ్రెస్ ఇస్తున్న మరో హామీ. యువనిధి పథకం కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు నెలనెలా 3 వేల భృతి అందిస్తామని కాంగ్రెస్ హామీఇస్తోంది.
పంజాబ్ గుజరాత్ ఉత్తరాఖండ్ త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గట్టి దెబ్బ తగిలింది. మరోవైపు జాతీయపార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ కాంగ్రెస్‌కి తానే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటోంది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. రాహుల్ భారత్ జోడో యాత్రతో కర్నాటకలో తమ బలం పెరిగిందన్న అంచనాతో కాంగ్రెస్ ఉంది. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఉచిత పథకాలను అస్త్రంగా ప్రయోగిస్తోంది. ఈ ఉచిత హామీలు కలిసొస్తే కర్నాటకలో కాంగ్రెస్ ప్రయత్నం ఫలించినట్లే.