ఎర్ర జెండా వెలిసిపోయింది

By KTV Telugu On 11 January, 2024
image

KTV TELUGU :-

తెలుగురాష్ట్రాల్లో ఎర్ర జెండా వెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు రెండింట్లోనూ  కామ్రేడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా పెద్ద పార్టీల నేతలు రెండు సీట్లు విదల్చకపోతారా అన్నట్లు కమ్యూనిస్టు పార్టీలు దేబిరించుకుని  రాజకీయాలు చేస్తున్నాయి. రెండింట్లో సిపిఎం పార్టీ కొంతైనా నయం. రెండు చోట్లా ప్రాతినిథ్యం లేకపోయినా  ఆత్మగౌరవాన్ని కొంతైనా కాపాడుకుంటోంది సిపిఎం.  సిపిఐ పార్టీ మాత్రం అన్నీ వదిలేసుకుని ఒకటి రెండు సీట్ల కోసం  దేనికైనా రెడీ అయిపోతోంది. తెలంగాణా ఎన్నికల్లో కుల రాజకీయాలకు తెగబడిపోగా..ఏపీలో చంద్రబాబు నాయుడి దయాదాక్షిణ్యాలకోసం ఆయన కనుసన్నల్లో కామ్రేడ్లు పని చేసుకుపోతున్నారు. పేదల కోసం కాకుండా పెద్దల కోసం  రాజకీయాలు చేస్తున్నారు సిపిఐ నేతలు.

తెలంగాణాలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం సీట్ల కోసం కొంతకాలం బి.ఆర్.ఎస్. కు ఊడిగం చేశాయి. కేసీయార్ అడక్కపోయినా మిర్యాలగూడ ఉప ఎన్నికల్లో  బి.ఆర్.ఎస్.కు బేషరతు మద్దతు ఇచ్చేసిన కమ్యూనిస్టు పార్టీలు  అసెంబ్లీ ఎన్నికల్లో  తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశపడ్డాయి. అయితే ఎన్నికలకు చాలా ముందుగానే కమ్యూనిస్టులతో పొత్తు లేదని కావాలంటే రెండు ఎమ్మెల్సీ సీట్లు  పారేద్దామని కేసీయార్ తమ పార్టీ నేతలతోనే అన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంత అవమానం పొందినా  బి.ఆర్.ఎస్. తో పొత్తు కోసం చివరి దాకా కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.

బి.ఆర్.ఎస్. ఛీ కొట్టేసిన తర్వాత కామ్రేడ్లు ఏమీ ఫీల్ కాకుండా చాలా కూల్ గా కాంగ్రెస్ వైపు తిరిగి  యాచన మొదలు  పెట్టారు. బి.ఆర్.ఎస్. పట్ల కొంత వ్యతిరేకత ఉందని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం ఒంటరి పోరుతోనే అధికారంలోకి రావచ్చునని అనుకుంది. అయినా కామ్రేడ్లు వెంటపడ్డంతో సరేలే వాళ్లని కూడా కలుపుకుపోతే పోయేదేముందని కామ్రేడ్లతో పొత్తుకు సై అంది. అయితే సిపిఐ, సిపిఎంలకు చెరొక అసెంబ్లీ స్థానం మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకోవడంతో సిపిఎం అవమానంగా భావించి మీ పొత్తూ వద్దు మీరూ వద్దు అని కటీఫ్ చెప్పేసింది. సిపిఐ మాత్రం చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని కాంగ్రెస్ విదిల్చిన ఒక్కసీటే మహాప్రసాదం అనుకుని పొత్తులో ఉండిపోయింది.అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ ఇస్తానంది.

కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకున్న సిపిఎం పార్టీ పోటీ చేసిన 19 నియోజక వర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావడంతో చతికిల పడింది. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే  రెండు కమ్యూనిస్టు పార్టీలూ  కలిసి పోటీ చేయాలని అనుకున్నాయి. కాకపోతే సిపిఐ ఒక్క సీటుకోసం కాంగ్రెస్ తో ఉండిపోయింది. ఇపుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ను మనస్ఫూర్తిగా ఏమీ అనలేని..గట్టిగా అడగలేని దయనీయ స్థితిలో సిపిఐ ఉండిపోయింది.కాంగ్రెస్ ను వద్దనుకున్న సిపిఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టగలిగే స్వేచ్ఛను  మిగుల్చుకుంది.

ఆంధ్ర ప్రదేశ్  విషయానికి వస్తే అక్కడ అసలు కమ్యూనిస్టు పార్టీలనేవి ఉన్నాయా? అన్న అనుమానాలు వచ్చేలా వాటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో ఓ సారి కాంగ్రెస్ తోనూ మరో సారి టిడిపితోనూ పొత్తులు పెట్టుకుని కాసిని సీట్లు బేరమాడుకుని కొన్ని పదవులు సొంతం చేసుకుని కాలక్షేపం చేసిన కామ్రేడ్లు రాష్ట్ర విభజన తర్వాత ఎందుకూ కొరగాకుండా పోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు బోణీయే కొట్టలేదు. అయిదేళ్ల తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు  కూడా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల తర్వాత గత నాలుగున్నరేళ్లలో ఏపీలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోనూ  కమ్యూనిస్టులు ఉనికి చాటుకోలేకపోయారు.

ఏపీలో శాసన రాజధాని అమరావతిలో  బడుగు బలహీన వర్గాలతో పాటు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం  నడుం బిగిస్తే అక్కడ ఆ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే  సామాజికసమతుల్యత దెబ్బతింటుందని  టిడిపి నేతలు దుర్మార్గమైన పిటిషన్ ఒకటి హైకోర్టులో వేసి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు.రెండు కమ్యూనిస్టు పార్టీలూ  ఆ పిటిషన్ పై కానీ టిడిపి దురహంకారంపై కానీ పల్లెత్తు మాట అనలేదు.సరికదా అదేమీ తప్పు కాదన్నట్లు  మౌనంగా ఉండిపోయాయి. సిపిఐ అయితే చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి సై అంటూ రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తోంది.   చంద్రబాబు  జనసేన-బిజెపిలతో కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నారు. ఒక వేళ ఆ మూడు పార్టీలూ కలిస్తే కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయక తప్పదు.  మొత్తానికి సిద్ధాంతాల పునాదులపై ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇపుడు సీట్ల రాజకీయాల్లో మునిగి పరువు పోగొట్టుకున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి