భారత్‌లో ఇక కమ్యూనిస్టు పార్టీల శకం ముగిసినట్లేనా

By KTV Telugu On 13 April, 2023
image

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కు ఉన్న జాతీయ హోదా గుర్తింపును రద్దు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదేమీ పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రోజురోజు బలహీనం అవుతున్నారు. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కమ్యూనిస్టుల చేతిలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ. మిగతా అన్ని చోట్లా పునాదులు కదిలిపోయాయి. గతమెంతో ఘనం ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇక కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇక ఇండియాలో కమ్యూనిస్టు పార్టీల శకం ముగిసినట్లేనా.

త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం అయింది. రెండో సారి కూడా కనీస ప్రభావం చూపలేకపోయింది. 1970ల నుంచే వామపక్షాలు బలహీనపడటం ప్రారంభమయ్యాయి. 2011లో పశ్చిమబెంగాల్‌లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. అది ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక పతనం కావడానికి ఒక్క రాష్ట్రమే మిగిలింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనం ఎంతో కాలంలో లేదన్న అభిప్రాయం ఉంది. 1977 నుంచి 2011 వరకు బెంగాల్ ను కమ్యూనిస్టులు అప్రతిహతంగా పరిపాలించారు. 2011 లో మమతా బెనర్జీ దూకుడుతో కమ్యూనిస్టుల పాలనకు బ్రేక్ పడింది. అప్పటినుంచి అంతకుముందు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులలో అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు మరణించారు వందలాదిమంది గాయపడ్డారు. దాంతో బెంగాల్లో కమ్యూనిస్టుల బలం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొనడం ద్వారా బిజెపి బాగా బలం పుంజుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి బిజెపి మమతా బెనర్జీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. దాంతో కమ్యూనిస్టులు తమ ఓట్లన్నీ తృణమూల్ కాంగ్రెస్ కే ఓట్లేశారు. 35 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టులు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.

భారతీయ కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉన్న తమ ఓట్లను ఇతర పార్టీలకు ధారాదత్తం చేయడానికి త్యాగాలు చేయడానికే పూర్తిగా సిద్ధపడ్డారు. గతంలో పశ్చిమ బెంగాల్ త్రిపుర కేరళలలో అధికారంలో ఉండిన కమ్యూనిస్టు పార్టీ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కేంద్రంలో ఏర్పడిన కిచిడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీ దేశంలోని మీడియా సినిమా విద్య సాహిత్యం ప్రింటింగ్ వంటి పలు రంగాలలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు కేవలం కేరళకే పరిమితమైంది. బీహార్ తమిళనాడులలో అధికార పక్షాలకు తమ మద్దతునిస్తోంది. ఆ మధ్య మాహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఏర్పడిన కిచిడీ ప్రభుత్వానికి కూడా కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచారు. దశాబ్దాలపాటు త్రిపురను ఏలిన కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు దఫాలుగా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ వామపక్షాలు అధికారంతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే కనీస ప్రాతినిధ్యం కోసం బతిమాలుకుంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌తో బేరాలు ఆడుకుంటున్నారు. ఏపీలో టీడీపీని బతిమాలుకుంటున్నారు.

ఈ రోజు వామపక్షానికి రెండు రకాల అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు సోవియట్‌ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సోషలిస్టులు అంబేద్కరిస్టులు ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు. అయితే వీరంతా ఈ ముద్రను అంగీకరించరు. భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని ఆ పార్టీల నేతలు అర్థం చేసుకోవడంలో తప్పు జరగడం కూడా ఓ కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం పూర్తిగా కారల్ మార్క్స్. పెట్టుబడి దారి వ్యవస్థ బూర్జువాల దగ్గరే ఆగిపోయింది. కాలం మారింది కానీ వారి ఆలోచనలు మారలేదు. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేశారు. కొత్త తరం కమ్యూనిస్టులకు అసలు కమ్యూనిజంపై స్పష్టత ఉండటం లేదు. ప్రజల ఆలోచనా సరళి కూడా మారిపోయింది.

పాత రోజుల్లో కమ్యూనిస్టులకు ఆదరణ ఉండేది. దానికి కారణం ప్రజా పోరాటాలు. అయితే నయా భారతంలో ప్రజలకు అంత తీరిక లేదు. ప్రజా పోరాటాలకు ప్రాధాన్యత కనిపించడం లేదు. అదే సమయంలో కమర్షియల్ పాలిటిక్స్ పెరిగిపోయాయి. కుల మత ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయి. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను వీటికి అతీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. దీనికి యువతను ఆకట్టుకోలేకపోవడం వృద్ధ నేతలు తర్వాత తరాన్ని ఎదిగేలా నాయకత్వ లక్షణాలను చూపకపోవడం కారణం అనుకోవచ్చు. కారణం ఏదైనా కమ్యూనిస్టులు పూర్తిగా ఫెయిలయ్యారు. ఇక ఆ పార్టీలు భారత్ లో నామమాత్రమే అనుకోవచ్చు. కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు ఎప్పుడైనా ఎగసిపడవచ్చు. అలా జరిగితే ప్రజలందరికీ మేలు జరుగుతుందనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు.