స్వాతిమాలీవాల్‌ ఘటన ఒరిజనలా? కల్పితమా?

By KTV Telugu On 21 January, 2023
image

కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లా అండ్‌ ఆర్డర్‌ కేంద్రం చేతుల్లోనే ఉంది. ఈమధ్యే కొన్ని సంఘటనలతో దేశరాజధాని భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రియురాలిని ముక్కలు చేసి నాలుగుదిక్కులా పడేసిన ఆఫ్తాబ్‌ రాక్షసత్వాన్ని ఇంకా ఢిల్లీ ప్రజలు మరిచిపోలేదు. దేశ రాజధానిలో మహిళల రక్షణపై చర్చోపచర్చలు జరుగుతున్న సమయంలో మరో ఘటన జరిగింది. రోడ్డుపక్కన నిలబడ్డ మహిళను ఓ కారుడ్రైవర్‌ వేధించాడు. పట్టుకోబోయిన బాధితురాలిని కారుతో ఈడ్చుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె సాదాసీదా మహిళకాదు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌. మహిళల హక్కులు, రక్షణగురించి మాట్లాడే నాయకురాలికే రక్షణ లేదంటే ఇంకేమనాలి

ఢిల్లీ నగరంలో మహిళల భద్రతను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తన టీంతో రోడ్డుమీదికి వచ్చారు స్వాతీమాలీవాల్‌. తెల్లవారుజామున ఆమె ఎయిమ్స్‌ ఆస్పత్రి సమీపంలో నిలుచుని ఉండగా ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. లోపలికి వచ్చి కూర్చోమన్న డ్రైవర్‌ ఆమె దూరంగా వెళ్లటంతో అక్కడినుంచి వెళ్లి యూటర్న్‌ చేసుకుని మళ్లీ వచ్చాడు. ఎక్కడికి వెళ్లాలని అడుగుతూ అనుచితంగా ప్రవర్తించాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ చేతులను కారు అద్దంతో లాక్‌చేసి దాదాపు 15మీటర్లు ఆమెను లాక్కెళ్లాడు. ఫిర్యాదు అందిన అరగంటలోనే పోలీసులు 47 ఏళ్ల నిందితుడు హరీష్‌ చంద్రను పట్టుకుని రిమాండ్‌కి పంపించారు. తనకే ఇలా జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి ట్వీట్‌ చేశారు. సమయానికి తన బృందం అలర్ట్‌ కాకపోతే తన పరిస్థితి మరో అంజలిలా మారేదన్నారు.

స్వాతీమాలివాల్‌కు వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా స్పందించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ని టార్గెట్‌ చేసుకుంటూ శాంతిభద్రతలపై ప్రశ్నించారు. అయితే ఈ ఘటన బాధాకరమనో మహిళల భద్రతపై మరింత దృష్టిపెట్టాలనో చెప్పాల్సిన బీజేపీ నేతలు ఇదంతా డ్రామా అంటూ రాజకీయం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులపై బురద చల్లేందుకే ఈ డ్రామా నడిపారని ఆరోపిస్తున్నారు. నిందితుడు ఆమ్‌ఆద్మీ కార్యకర్తని అనుమానం వ్యక్తంచేశారు. స్వాతి మాలీవాల్‌ కూడా ఈ వ్యాఖ్యలపై అదే రేంజ్‌లో స్పందించారు. మహిళల భద్రతను అవహేళన చేస్తున్నారని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఎన్ని దాడులుచేసినా తన గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుందని స్వాతి హెచ్చరించారు. ఒకవేళ అది డ్రామా అనుకుంటే వాస్తవాన్ని జనం ముందు ఉంచొచ్చు. లాఅండ్‌ఆర్డర్‌ చేతిలో పెట్టుకుని డ్రామా అంటే జనం నమ్మరు. శ్రద్ధామర్డర్‌ని అంత రాజకీయంచేసిన బీజేపీ స్వాతిమాలీవాల్‌ ఘటనను కల్పితం అనటాన్ని ఎవరూ హర్షించరు.