ఉరిశిక్షపైనే ఈ దేశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ కరడుగట్టిన నేరస్తులకు, ఉగ్రవాదులకు విధించగలిగే అతి పెద్ద శిక్ష అదే. నిర్భయ హంతకులకైనా, పార్లమెంట్‌పై దాడిచేసిన నిందితులకైనా ఈ శిక్షేపడింది. ప్రపంచంలో మరణశిక్షలు రకరకాలుగా విధిస్తున్నారు. ఈ ఆధునికకాలంలోనై శిరచ్ఛేదనం చేసే దేశాలున్నాయి. గోడకు నిలబెట్టి కాల్చేసే శిక్షలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. విషపూరిత ఇంజక్షన్ మరికొన్నిచోట్ల అమలులో ఉంది. స్వాతంత్య్రానికి పూర్వంనుంచీ మన దేశంలో ఉరిశిక్ష అమల్లో ఉంది. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటన్నదానిపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.
కరడుగట్టిన నేరస్తులకు ఉరిశిక్ష అమలుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వీలైనంతవరకు తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఎంతటి నేరస్తుడైనా మరణం మాత్రం గౌరవప్రదంగా ఉండటం ముఖ్యమన్నది సుప్రీం అభిప్రాయం. ప్రాణాలు పోయేదాకా ఉరికొయ్యకు వేలాడదీసే సంప్రదాయిక పద్ధతి బదులు ప్రత్యామ్నాయ ఆధునిక మార్గాలపై నిపుణుల కమిటీ నియామకానికి సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.
కొన్ని క్షణాలే కావచ్చుగానీ ఉరి ఏ మనిషికైనా బాధాకరమైన ముగింపు. కొందరు వెంటనే చనిపోతారు. మరికొందరు కొన్ని నిమిషాలపాటు ఉరితాడుకు విలవిల్లాడుతూ ఊగుతుంటారు. అందుకే మరణశిక్షలో కొత్త విధానంపై సుప్రీం ఆలోచన చేస్తోంది. ఉరిశిక్ష పడిన ఖైదీలకు నొప్పి లేకుండా మరణాన్ని ప్రసాదించాలంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీం విచారించింది. ఉరిశిక్ష బదులు తుపాకీతో కాల్చిచంపడం, విషపూరిత ఇంజెక్షన్, ఎలక్ట్రిక్ ఛైర్ వంటి మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఉరిశిక్ష క్రూరమైనదన్న లా కమిషన్ నివేదిక సుప్రీం ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ శిక్ష విధిస్తున్నారు. అందులో ఏ రసాయనం ఉపయోగిస్తారో అధ్యయనం చేయాలని సుప్రీం సూచించింది. ఇంజక్షన్ విధానం కూడా బాధాకరమేనని, తుపాకీతో కాల్చిచంపడం మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడటంతో ఇతర ప్రత్యామ్నాయాలు ఏమున్నాయన్న దానిపై చర్చ మొదలైంది.