ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉచ్చు బిగుస్తోంది.

By KTV Telugu On 23 February, 2023
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఆప్, బీఆర్ఎస్ ప్రభుత్వాలను షేక్ చేస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ సెగ ముఖ్యమంత్రిని తాకింది. మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ను పేరును ప్రస్తావించిన ఈడీ తాజాగా ఆయన వ్యక్తిగత కార్యదర్శిని విచారించడం చర్చనీయంశంగా మారింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల మేరకు పీఏను అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సర్కారులోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ పాలసీని ఆప్ సర్కారు వెనక్కి తీసుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అధికారులను వ్యాపారవేత్తలను రాజకీయ నేతలను విచారించారు. ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ విజయ్ నాయర్ సహా ఏడుగురుని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సమీర్ మహేంద్రుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్య ఫేస్ టైమ్ వీడియో కాల్ అరేంజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కార్యదర్శిని అధికారులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈకేసులో డిప్యూటీ సీఎం సిసోడియాకు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. వచ్చే ఆదివారం ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.

ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బుచ్చిబాబును ఈ నెల 7న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం బుచ్చిబాబును కోర్టులో హాజరుపరుచగా మూడు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. బుచ్చిబాబు మూడు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బుచ్చిబాబును విచారించేందుకు ఈడీ కూడా అనుమతి కోరింది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నారు.

లిక్కర్ స్కామ్‌లో స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్‌మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది. సౌత్‌ గ్రూపునకు చెందిన కవిత, మాగుంట, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిలు ఎవరెవరితో మాట్లాడారు. ఎవరెవరితో ఎక్కడ సమావేశమయ్యారన్న అంశాలు పొందుపరిచింది. కిక్‌బ్యాక్‌ల రూపంలో ముందుగా పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టాలనే అంశాన్ని పెట్టుబడిదారులు చర్చించారని పేర్కొంది. విజయ్‌నాయర్‌ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసు పెట్టడానికి తగిన కారణాలున్నాయని తెలిపింది. సౌత్‌ గ్రూపునుంచి ఆప్‌ నేతలకు సొమ్ములు ఎలా చేరాయో వివరించింది. ఎవరెవరిని ఏయే కారణాలతో అరెస్టు చేసిందీ తెలియజేసింది. సౌత్‌గ్రూపు నుంచి తీసుకున్న రూ.100 కోట్లలో రూ.30 కోట్లు గోవా ఎన్నికలకు ఆప్‌ ఖర్చు చేసినట్లు ఆరోపించింది.