ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఛార్జ్ షీట్ సిద్ధమైంది. మూడు రాష్ట్రాలకు చెందిన కీలక రాజకీయ నేతల పేర్లు ఛార్జ్ షీట్లో ఉండడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ నేతలంతా కూడా ఆ మూడు రాష్ట్రాల్లో అధికార పక్షానికి చెందిన కీలక నేతలే కావడం విశేషం. కేంద్రంలోని బిజెపి తమ చెప్పుచేతల్లోని దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను అస్థిర పర్చడానికి ప్రయోగిస్తోందని ఛార్జ్ షీట్లో పేర్లున్నవారు దుయ్యబడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కొంత కాలంగా కలవర పెడుతూనే వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియాను బోనులో నిలబెడుతూ బిజెపి నేతలు ఘాటు విమర్శలు చేస్తూనే వచ్చారు. సిసోడియా బంగారం లాంటి నాయకుడని ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడే రకమే కాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనకేసుకొచ్చారు. అయితే దర్యాప్తు సంస్థలు మాత్రం సిసోడియాను రోజుల తరబడి విచారిస్తూనే వచ్చాయి.సిసోడియా తప్పు చేశారని ఆరోపిస్తూనే వచ్చాయి. ఇదే స్కాంలో తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే ఈడీ అధికారులు గంటల తరబడి విచారించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను తన తండ్రి కేసీయార్ తరచుగా విమర్శలు చేస్తుండడం వల్లనే కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి తనను తనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు.
ఇక ఇదే కుంభకోణంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. మాగుంట ఏపీలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ.
అయితే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆ కుంభకోణంతో తనకు సంబంధమే లేదని మాగుంట స్పష్టం చేశారు.
ఇపుడు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు అధికారులు సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా పేరుతో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చారు.
ఈ కుంభకోణంలో చేతులు మారిన డబ్బునే గోవా ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల కోసం ఖర్చు చేశారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.
ఈ మొత్తం కుంభకోణంలో విజయ్ నాయర్ కేజ్రీవాల్ తరపున కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. నాయర్ తనకు నమ్మకస్తుడైన మనిషేనని కేజ్రీవాల్ ఫోన్లో చెప్పినట్లు ఈడీ ఆరోపించింది. మొత్తం వంద కోట్ల రూపాయలు ఆప్ కు చేరాయని వ్యాఖ్యానించింది. ఆ డబ్బునే గోవా ఎన్నికల్లో పార్టీ తరపున ఖర్చు చేశారని వాలంటీర్లకు చెల్లించారని ఈడీ తేల్చింది. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు పార్టనర్ షిప్ ఉందని ఈడీ ఆరోపించింది. అందులో ఆమె తరపున అరుణ్ పిళ్లై ప్రతినిథిగా ఉన్నారని ఈడీ దర్యాప్తులో తేల్చింది. కవిత అనుచరుడు శ్రీనివాసరావును కూడా విచారించిన ఈడీ కవిత ఆదేశాలతో పిళ్లైకి కోటి రూపాయలు ఇచ్చినట్లు శ్రీనివాసరావు వాంగ్మూలం ఇచ్చారని స్పష్టం చేసింది.
ఈ స్కామ్ కు సంబంధించి 100 కోట్ల నగదు లావాదేవీల గురించిన వివరాలనూ ఛార్జ్ షీట్ లో పొందు పరచినట్లు సమాచారం. అయితే ఈడీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు ఈడీని ప్రయోగించడం బిజెపికి కొత్త కాదన్నారు కేజ్రీవాల్. గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో బిజెపి ఇలానే చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గత ఎనిమిదేళ్ల కాలంలో అయిదు వేలకు పైగా ఛార్జ్ షీట్లు వేసిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్ వాటిలో ఏ ఒక్కింటిలోనూ సాక్ష్యాలు చూపలేకపోయిందని ఒక్కిరికి కూడా శిక్ష పడలేదని ఆరోపించారు. ఇందులో మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. చాలా కాలంగా బిజెపికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలను చిత్తుగా ఓడించి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. ఈ మధ్యనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బిజెపిని గద్దె దింపి ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరేసింది.
పంజాబ్ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి బిజెపిని చికాకు పెట్టారు కేజ్రీవాల్. సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. ఆ తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలో దిగారు. కాంగ్రెస్, బిజెపిలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఈ కారణంగానే తమని ఇబ్బంది పెట్టాలని కేంద్రంలోని బిజెపి కుట్రలు పన్నుతోందన్నది ఆప్ ఆరోపణ. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని అవి కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని కానీ జోక్యాన్ని కానీ అనుమతించనే అనుమతించవని బిజెపి నేతలు అంటున్నారు.
ఇటు కవిత పేరు ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో బి.ఆర్.ఎస్. లో కలకలం మొదలైంది. దీన్ని ఎలా తిప్పికొట్టాలా అని నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. టి.ఆర్.ఎస్. ను జాతీయ పార్టీగా మార్చి బి.ఆర్.ఎస్. ను ఏర్పాటు చేసి బిజెపికి సవాల్ విసురుతున్న కారణంగానే బిజెపి ఈడీని తమపైకి ఉసిగొలిపి తప్పుడు కేసులు బనాయించిందని బి.ఆర్.ఎస్. దుయ్యబడుతోంది. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం కేసీయార్ కుటుంబమంతా అవినీతి కార్యకలాపాల్లో నిండా మునిగిపోయారని ఇపుడు అడ్డంగా దొరికేసరికి కేంద్ర ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారని వారు అంటున్నారు. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.