ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నందుకు సుప్రీం చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆమ్ఆద్మీకి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానం చెక్‌పెట్టింది. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని తేల్చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచింది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని మేయర్ పీఠాన్ని దొడ్డిదారిన దక్కించుకోవాలనుకుంది బీజేపీ. సుప్రీం తీర్పుతో బీజేపీ సర్కారు దొడ్డిదారి ప్రయత్నాలకు తెరపడింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో 250 వార్డులకు ఆమ్ఆద్మీ పార్టీ 134 వార్డులను గెలుచుకుంది. ఈపాటికి ఆ పార్టీ మేయర్ బాధ్యతలు స్వీకరించి ఉండాలి. కానీ పదిహేనేళ్లుగా తమ చేతుల్లో ఉన్న ఎంసీడీ చేజారటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. ఆమ్ఆద్మీపార్టీ కౌన్సిలర్లను చీల్చే ప్రయత్నం చేసింది. ప్రజలు సీట్లు ఇవ్వకపోయినా నామినేటెడ్ సభ్యుల ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. 104 సీట్లతోనే ఏదోలా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంది బీజేపీ. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో 10 మందిని ఎంసీడీకి నామినేట్ చేయించింది. వారితో మేయర్ ఎన్నికల్లో ఓట్లేయించాలన్న బీజేపీ ప్లాన్ సుప్రీం తీర్పుతో బెడిసికొట్టింది.
మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలను ఎన్నుకునే అవకాశం లేకుండా కార్పొరేషన్లో బీజేపీ గందరగోళం సృష్టించింది. ఎన్నికల ప్రక్రియ జరగకుండానే మూడుసార్లు సమావేశాలు వాయిదావేయాల్సి వచ్చింది. నామినేటెడ్ సభ్యుల కుట్రతో పాటు ఎన్నిక జరగకుండా అవరోధాలు సృష్టిస్తున్నారంటూ ఆమ్ఆద్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం ఆప్‌కి అనుకూల తీర్పునిచ్చింది. 24గంటల్లో ఎన్నికలకు సంబంధించిన కమిటీని సమావేశపరచాలని ఆదేశించింది. ఎంసీడీలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేజ్రీవాల్‌ని బద్నాంచేసేందుకు బీజేపీ పన్నిన ఎత్తుగడ తిరగబడింది. ఢిల్లీలో పేరుకున్న చెత్తను ఊడ్చేయాలంటే బీజేపీని సాగనంపాలంటూ కేజ్రీవాల్ ఇచ్చిన స్లోగన్ జనంలోకి బలంగా వెళ్లింది. దీంతో ప్రజలు ఆమ్ఆద్మీకే పట్టంకట్టి బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టారు. ఇప్పుడు న్యాయపోరాటంలో గెలిచి బీజేపీకి మరోసారి షాక్ ఇచ్చింది సామాన్యుడి పార్టీ.