దొంగలు పడ్డ ఆర్నెల్లకన్నట్లు.. ఇప్పుడు తీర్పు!

By KTV Telugu On 2 January, 2023
image

పెద్ద నోట్ల రద్దు. రాత్రికిరాత్రి తీసుకున్న నిర్ణయంతో కోట్లమంది రోడ్డునపడ్డారు. బడాబాబులు బాగుపడ్డారు. రోజుల తరబడి బ్యాంకులముందు జనం క్యూలు. పాతనోట్లు మార్చుకోడానికి కొత్త నోట్లు తీసుకోడానికి పడ్డ కష్టాలు పగవాడికి కూడా వద్దన్నట్లున్నాయి. అది జనం మరిచిపోడానికి ప్రయత్నిస్తున్న పీడకలలాంటి నిర్ణయం. 500, 1000 రూపాయల నోట్లు రద్దుచేసి 2000 నోటుని ప్రవేశపెట్టడంపై బీజేపీలోనే భిన్నస్వరాలున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వం ఊహించినట్లు నల్లధనం బయటికి రాలేదు. ఏ అద్భుతమూ జరగలేదు. దొంగనోట్ల ప్రవాహం ఆగలేదు. ఎందుకు చేశారో దానివల్ల ఎవరు లబ్ధిపొందారో ఎవరికీ తెలీదు.

జనం మరిచిపోతున్న నోట్ల రద్దు వ్యవహారం సుప్రీం తీర్పుతో మళ్లీ చర్చకొచ్చింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దుకు తీసుకున్న నిర్ణయం సబబేనని సమర్ధించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. కేంద్రప్రభుత్వం తాను తప్పేమీ చేయలేదని చెప్పుకోవడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు విచారించగా నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం వ్యతిరేక తీర్పుని వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదన్నారు జస్టిస్‌ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టసభను విస్మరించడాన్ని తన తీర్పులో ఆమె తప్పుపట్టారు.

నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంలో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో బీఆర్‌ గవాయ్‌, ఏఎస్‌ బొప్పన్న, రామసుబ్రమణియన్‌, నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిని విచారించింది. 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ఆరేళ్ల తర్వాత సుప్రీం తన తీర్పు చెప్పింది. విపక్షాలు నోట్ల రద్దు నిర్ణయాన్ని మళ్లీ తప్పుపడితే డిఫెన్స్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ తీర్పు ఉపయోగపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్‌. పెద్ద నోట్ల రద్దుతో గరిష్టంగా ఈ ప్రయోజనం జరిగిందని చెప్పడానికి కేంద్రం దగ్గర కూడా బలమైన పాయింట్‌ ఇప్పటికీ లేదు.