కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్ధులను పూర్తిగా ఎంపిక చేయలేదు. బిజెపిలో అవినీతి పరులను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో రెబెల్స్ భగ్గుమన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అందరి కన్నా ముందుగా తొలిజాబితా విడుదల చేసి దూకుడు ప్రదర్శించింది. జాతీయ పార్టీలకు తాను ఏమీ తీసిపోనని జేడీఎస్ కూడా కొందరు అభ్యర్ధులను ఎంపిక చేసి ప్రచారం పర్వంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన పార్టీ నాయకత్వంలోనూ లేదు. పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడాలన్న ఆలోచన పార్టీ నేతల్లోనూ అప్పుడే లేదు. పార్టీ గెలిచిన తర్వాత పరిస్థితుల ఆధారంగా సిఎం పోస్టు గురించి చర్చ జరగడం పోటీలు పడ్డం అనేది సహజం. అందుకే బిజెపి నేతలు ఎన్నికల్లో విజయం కోసం పాటు పడుతున్నారు. అధికార పక్షం కావడం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో బిజెపి కాస్త డిఫెన్స్ లో ఉంది కూడా. అందుకే విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి తీరాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవ్వరూ ఊహించని హడావిడి చేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కొన్ని సర్వేలు ప్రొజెక్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు నేల మీద నడవడం లేదు గాల్లో తేలిపోతున్నారు. పార్టీలో అగ్రనేతలయితే పార్టీ ఎలాగూ అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొందరపడ్డ కోయిల్లా తమ సన్నిహితుల దగ్గర ముందుగానే కూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరి కన్నారేసులో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరుండానేది గెలిచిన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని నర్మగర్భంగా అన్నారు సిద్ధరామయ్య ఇందులో చాలా అర్ధాలు వ్యూహాలు ఉన్నాయి. కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీ నుండి హై కమాండ్ సీల్డ్ కవర్ లో సిఎంని పంపడానికి వీల్లేదన్న హెచ్చరిక ఒకటి ఉంది. అదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ నేతల మద్దతు తనకే ఉంటుందన్న ధీమాకూడా ఉంది. బహుశా అభ్యర్ధుల ఎంపిక సమయంలోనే తనకు అనుకూలంగా ఉండే వారికే సిద్ధరామయ్య పెద్ద సంఖ్యలో టికెట్లు ఇప్పించుకుని ఉండచ్చని భావిస్తున్నారు.
ఈలెక్కలతోనే తర్వాతి సిఎం తానేనని సిద్ధరామయ్య సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యతో పోటీ పడుతోన్న మరో అగ్రనేత డి.కే.శివకుమార్. రెండున్నరేళ్ల క్రితం డి.కే. శివకుమార్ ని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. అప్పట్నుంచీ ముఖ్యమంత్రి పదవి రేసులో నేనూ ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చేశారు డికే. తనకు పోటీ కాబోయే డి.కే తో సహజంగానే సిద్ధరామయ్య కు పడదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి కాదు మంచు గడ్డ వేసినా భగ్గుమంటుంది. అంతగా ఒకరినొకరు ప్రేమించుకుంటారిద్దరూ. ఒకరి తలని మరొకరు నరికేసుకోగల అభిమానం ఆప్యాయత కూడా ఉన్నాయి ఇద్దరిలో. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు సలహాదారు అయిన అహ్మద్ పటేల్ కు కావల్సిన వారు డి.కే. శివకుమార్. అంచేత సోనియా గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకీ ఆర్ధికదన్ను ఇచ్చేది కూడా డికేనే. అదే ఆయనకు అడ్వాంటేజ్. ఇంకో విధంగా అదే ఆయనకు మైనస్ కూడా.
డి.కె.శివకుమార్ పై అక్రమ నగదు చెలామణీ కేసులు ఉన్నాయి. ఈ కేసులోనే ఆయన 2019లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అంచేత డి.కే. శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవచ్చునని సిద్ధరామయ్య లెక్కలు వేసుకుంటున్నారు. అయితే డికే శివకుమార్ జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే డికేని సిఎంని చేయడానికి సోనియా అభ్యంతరం చెప్పకపోవచ్చునని అంటున్నారు.
డి.కె. శివకుమార్ తన జాగ్రత్తలో తాను ఉన్నారు. ఒక వేళ కేసులే తనకి సిఎం పదవి అధిరోహించడానికి ఆటంకం అయితే ఆ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆప్త మిత్రుడు సిద్ధరామయ్యకు అందడానికి వీల్లేదని డి.కే పంతంగా ఉన్నారు. దానికోసం ఓ వ్యూహం కూడా అమలు చేసుకుపోతున్నారు తాజాగా ఢిల్లీలో పార్టీ అధినాయకత్వంతో చర్చల సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్ని విధాలా అర్హతలు ఉన్న నాయకుడని డి.కె. ప్రతిపాదించారు. ఖర్గే నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని డి.కే. అన్నారు. ఖర్గే నాకన్నా 20 ఏళ్లు పెద్ద వారు అపార అనుభవం ఉంది. ఆయన్ను మించిన సిఎం అభ్యర్ధి మరొకరు ఉండరు అని డి.కే. ముక్తాయించారు.
ఎనిమిది పదుల వయసు దాటిన మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. పాలనా పరంగానూ ఆయన దక్షుడే ఎటువంటి అవినీతి ఆరోపణలు ఆయన దగ్గరకు కూడా రాలేదు. క్లీన్ ఇమేజ్ ఉండడంతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విధేయుడు కూడా. ఆయనకున్న సీనియారిటీకి ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావలసి ఉంది. 1999, 2004,2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఖర్గే ముందు వరసలో ఉన్నారు కాకపోతే సమీకరణలు కలిసి రాలేదు. సిఎం పదవి ఆయన దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. అయినా ఆయన ఏనాడూ ఆ అసంతృప్తిని బయట పెట్టుకోలేదు. తనకు పదవి ఇవ్వలేదని అధిష్ఠానంపై అలిగి కూర్చోలేదు. తనకు పదవి రాకుండా అడ్డుకున్న వారిపై కక్షలు పెట్టుకోలేదు. పార్టీ అధిష్ఠానం ఏం ఆదేశిస్తే ఆ పని చేయడం ఏ పదవిని ఇస్తే దానికి న్యాయం చేయడమొక్కటే ఖర్గేకి తెలుసు. ఈ కారణంగానే సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలనుకున్నప్పుడు అశోక్ గెహ్లాత్ తోక జాడించినపుడు సోనియా గాంధీ మరో ఆలోచనే లేకుండా ఖర్గేను అధ్యక్ష పదవికి ప్రతిపాదించి పోటీలో పెట్టారు. సోనియా ఆదేశించడమే ఆలస్యం ఖర్గే అధ్యక్ష పదవి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసి యస్ మేడమ్ అన్నారు. ఖర్గే కి ఉన్న ఈ బ్యాక్ గ్రౌండ్ వల్లే ఆయనకు సిఎం పదవి కట్టబెట్టచ్చని రాజకీయ పండితులు అంటున్నారు.
అయితే ఇదంతా ఎప్పుడు ముందుగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని సాధించాలి. ప్రభుత్వం ఏర్పాటుకు జేడీఎస్ పైనో మరొకరిపైనో ఆధార పడాల్సిన అవసరం ఉండకుండా ఉండాలి. అప్పుడే సిఎం పదవికి ఎవరు అనేది చర్చ మొదలవుతుంది. ఎన్నికల్లో వ్యూహాలు పన్నడం వదిలేసి సిద్ధరామయ్య డి.కె. శివకుమార్ లు ముఖ్యమంత్రి సీటుపై రుమాలు వేసేయడం విడ్డూరంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ముగ్గురితో పాటు పార్టీ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షులు ఎం.బి.పాటిల్ పిసిసి మాజీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్ కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ముచ్చటపడుతున్నారు. కాకపోతే అసలు ఎన్నికలే జరక్కుండా పోలింగ్ కి ముందే ప్రచారం కూడా పూర్తి కాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం మూడు ముక్కలాట ఆడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని ఇతర పక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.