“టెక్నికల్‌గా ప్రపంచవిజేతలుగా నిలిచిన అమెరికా జపాన్ వంటి దేశాల్లో కూడా బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. మనకు ఎందుకు ఈవీఎంలు అనే వాదన దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వినిపిస్తూనే ఉంటుంది. ఓడిపోయిన వారు ఖచ్చితంగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. గెలిచినవారు అంతకు ముందు అనుమానాలు వ్యక్తం చేసినా గెలిచారు కాబట్టి అప్పుడు అనుమానాలు వ్యక్తం చేయలేరు. ఈ ప్రకారం చూస్తే అన్ని పార్టీలు ఈవీఎంలపై అపనమ్మకంతోనే ఉన్నాయి. బీజేపీ ఒకప్పుడు ఈవీఎంలను వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఈవీఎం ఓటింగ్‌ను తెచ్చింది. కానీ ఇప్పుడు ఈవీఎంలను నమ్మడం లేదు. టెక్నికల్‌గా ఏదీ ట్యాంపర్ చేయడం అసాధ్యం కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటప్పుడు ఈవీఎం ఎన్నికలు నమ్మదగ్గవి కావన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోంది. ఈవీఎంలపైనే ఇలాంటి అపనమ్మకం ఉండగా ఈసీ కొత్తగా రిమోట్ ఓటింగ్ పేరుతో మరో కొత్త విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇది రాజకీయ పార్టీల్లో మరింత ఆందోళనకు కారణం అవుతోంది.
అర్బన్ ప్రాంతాల్లో ఓటు వినియోగించుకునేవారి శాతం తక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై శాతానికి ఉండే ఓటింగ్ సిటీల్లో మాత్రం అరవై శాతానికి మించడం లేదు. ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొందరు అలసత్వం వహిస్తున్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం ఎక్కువ స్థాయిలో రావడం లేదు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు తక్కువ పడుతున్నాయి. అంటే ఉద్యోగాలు చేసేవారు చదువుకున్న వారే ఓటు వేసే విషయంలో వెనుకబడి ఉన్నారు. అందుకే అలాంటి వారికి ఎక్కడా ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమ సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల సమయానికి భౌతికంగా ఉండలేని వ్యక్తులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోంచి అయినా ఓటు వేయడానికి అవకాశం కల్పించడమే ఈ రిమోట్ ఓటింగ్ విధానం. ఉదాహరణకు విజయవాడ ఓటర్ హైదరాబాదులో పనిచేస్తుంటే గనుక ఎన్నికల పోలింగ్ రోజున హైదరాబాద్‌లోనే పోలింగ్ బూత్‌కు వెళ్లి విజయవాడలో తన ఓటు వినియోగించుకోవచ్చు.
ఎక్కడో ఉన్నా సొంత నియోజకవర్గంలో ఓటు వేయడానికి ఈసీ ఈవీఎం తరహాలోనే రిమోట్ ఓటింగ్ మిషన్ రూపొందించింది. ఈవీఎంలో కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓటు వేయవచ్చు. కానీ ఆర్వీఎంలో 72 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లు వేయవచ్చు. దాని ప్రకారం ఆ 72 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ను ఎలా వినియోగించుకుంటారో పోలింగ్ రోజు సొంత ప్రాంతానికి దూరంగా ఉన్నవారు రిమోట్ ఓటింగ్ మిషన్ ద్వారా అలాగే ఉపయోగించుకుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆర్వీఎంల రాకతో ఓటు హక్కు వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుందని ఈసీ చెబుతోంది.
ఈవీఎంలపైనే ఇప్పటికీ విపక్షాలకు క్లారిటీ రాలేదు. ఇక ఆర్వీఎంలను అంగీకరించే అవకాశం ఉండదు. అదే జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అందరికీ డెమో ఇచ్చింది. ఈ సందర్భంగా అభిప్రాయాలు సేకరించింది. ఈసీ డెమోకి ముందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు సెపరేట్ గా మీటింగ్ పెట్టుకున్నాయి. ఆర్వీఎం మనకు వర్కవుట్ కాదని తేల్చేశాయి. అధికార పార్టీలు ఆర్వీఎంలను దుర్వినియోగం చేస్తాయని అనుమానించాయి. ఈ పద్ధతి వద్దే వద్దు అని కాంగ్రెస్ అంటుంది. దీనిలో అక్రమాలు జరగవచ్చని ఆరోపిస్తుంది. అటు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా రిమోట్ ఓటింగ్ వద్దంటున్నారు. అయితే ఆయన పూర్తి అవగాహన లేకుండానే విదేశాల్లో కూర్చుని ఓటు వేసే పద్ధతి మంచిది కాదని అంటున్నారు. ఈవీఏంలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ డెమోకు గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలు 57 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. డెమో అనంతరం ఆర్వీఎంను కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. సమావేశంలో ఆర్వీఎంల పనితీరును పార్టీలకు ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు. కానీ విపక్ష పార్టీలు శాటిస్ ఫై కాలేదు.
ఎన్నికలంటే బ్యాలెట్. బ్యాలెట్ పై ఓటు వేస్తేనే ఎవరికైనా ఓటు వేసినట్లుగా ఉంటుంది. లేకపోతే ఉండదు. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఒక్క మీట నొక్కి ఫలితం ప్రకటిస్తున్నారు. కానీ తమ ఓట్లు ఎటు పోయాయన్న అనుమానం అభ్యర్థుల్లో బలపడుతుంది. ఈవీఎంలు వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ ల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న స్పష్టత వస్తోంది. దీంతో తమ ఓట్లు ఎటు పోయాయన్న అనుమానం మరింత ఎక్కువగా ఉంది. సీక్రెట్ ఓటింగ్ అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఓ పోలింగ్ బూత్‌లో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారో తెలిసిపోతోంది. అదే సమయంలో ఫలితాలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా మంది అసలు గెలిచిన పార్టీ అది కాదని అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇప్పుడు ఈవీఎంలపైనే అందరికీ నమ్మకం కలిగించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు రిమోట్ ఓటింగ్ మెషిన్లను బలవంతంగా అమల్లోకి తెస్తే ప్రజల్లో మరిన్ని అనుమానాలు బలపడతాయి.
ప్రజాస్వామ్యం ఎన్నికల మీద నిలబడుతుంది. ఈ ఎన్నికలపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ఎప్పుడైనా నమ్మకం కోల్పోతారో అప్పుడు ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోతుంది. పాలకులు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయం కాకుండా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దేశంపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది.