చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. రిమోట్‌ ఓటింగ్ మాత్రం వద్దట!

By KTV Telugu On 18 January, 2023
image

మంచంపై ఉన్నా మోసుకొచ్చి ఓటు వేయించాల్సిందే. ఏ అత్యవసర పనిమీదో దూర ప్రాంతాల్లో ఉన్నా ఓటింగ్‌ కేంద్రానికి రాలేకపోయినా ఓటు మురిగిపోవాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ఈవీఎంలను కూడా ఈదేశ రాజకీయం ఇప్పటికీ అంగీకరించలేకపోతోంది. బ్యాలెట్‌ పద్ధతే మంచిదంటోంది. మోసాలు జరుగుతున్నాయని ప్రజల తీర్పు తారుమారు అవుతోందనే అనుమానాలు చాలా రాజకీయపక్షాలకు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ కూడా వాటిని నివృత్తి చేయడంలో విఫలమవుతూనే ఉంది. అందుకే ఎన్నికలకోసం ఎలాంటి సంస్కరణలను కూడా కొన్ని రాజకీయపార్టీలు స్వాగతించలేకపోతున్నాయి. కొత్త మార్పులను వ్యతిరేకిస్తున్నాయి.

రిమోట్‌ ఓటింగ్‌. దేశంలో ఎక్కడ ఉన్నవారైనా ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన కొత్త ఆలోచన ఇది. కానీ దేశంలోని ఎక్కువ ప్రతిపక్షపార్టీలు రిమోట్‌ ఓటింగ్‌ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ డెమోను చూపించినా అసలు దీని అవసరమేంటన్నది ప్రతిపక్షాలనుంచి వచ్చిన ప్రశ్న. కొత్త కొత్త ఆలోచనలు పక్కనపెట్టి పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న ఉదాసీనతపై దృష్టిపెట్టాలని కేంద్ర ఎన్నికలసంఘానికి ఉచిత సలహా ఇచ్చాయి. ప్రతిపక్షాలేవీ ఆర్‌వీఎం కోరుకోవడం లేదంటోంది అందరి తరపున వకాల్తా పుచ్చుకున్న కాంగ్రెస్‌పార్టీ. ఏకాభిప్రాయం వచ్చేదాకా డెమోల అవసరమే లేదన్నది కాంగ్రెస్‌ మాట. అసలీ దేశంలో ఇలాంటి సంస్కరణలమీద ఏకాభిప్రాయం సాధ్యమేనా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఎన్నికల సమయానికి భౌతికంగా సొంత నియోజకవర్గరాల్లో లేనివారికి రిమోట్‌ ఓటింగ్‌ మంచి అవకాశం. అందుకే ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటింగ్‌శాతం పెరగాలి. అదే సమయంలో ప్రజలు వ్యయప్రయాసలకు గురికాకుండా ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలి. అయితే గుడ్డెద్దు చేలో పడ్డట్లే ఉంది కొన్ని ప్రతిపక్షపార్టీల పరిస్థితి. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్న ఆరోపించేవారు మరో కొత్త సాంకేతిక విధానాన్ని ఆహ్వానిస్తారనుకోవడం అత్యాశే. ఈకాలంలో బతుకుతెరువు కోసం ఎక్కడెక్కడో దూరప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది. ఓటు వేయడానికి పనిగట్టుకుని రావడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారికోసమే ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.

రిమోట్‌ ఓటింగ్‌ సిస్టమ్‌లో ఓటరు ముందుగా రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. దేశంలోని ఏ మూలన ఉన్నా తన నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. వాస్తవానికి ఈ విధానంతో చదువుకున్న వారిలో ఓటింగ్‌ చైతన్యం పెరుగుతుంది. ఇప్పటిదాకా ఓటింగ్‌ కేంద్రాలకు విద్యావంతులే సింహభాగం దూరంగా ఉంటున్నారు. అలాంటి విధానం అమల్లోకి వస్తే కూర్చున్న చోటినుంచే తమకు నచ్చినవారికి ఓటేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధానంలోనూ కేంద్రానికి దురుద్దేశం ఉందనే విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ పద్దతి అస్సలొద్దంటూ కాంగ్రెస్‌ ముందే ఈసీకి లేఖరాసింది. జాతీయపార్టీగా మారిన బీఆర్‌ఎస్‌ కూడా రిమోట్‌ ఓటింగ్‌ని వ్యతిరేకిస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఈ సంస్కరణను స్వాగతించింది. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ విప్లవాత్మక మార్పును ఆహ్వానించడానికి ఈ దేశ ప్రతిపక్షాలు సిద్ధంగా లేకపోవడం నిజంగా దురదృష్టకరం.