భావస్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. ఆ స్వేచ్ఛ నోరెత్తలేని బడుగుజీవులెందరికో ఆశాదీపం కావచ్చు. కానీ ఆ గళం కొందరిని భయపెట్టొచ్చు. సమాజం గురించి, అసమానతల గురించి మాట్లాడినవారు అర్బన్ నక్సలైట్లు అవుతున్నారు. అన్యాయాలు, అసహనం గురించి గొంతెత్తేవారు దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు. భీమాకొరెగావ్ కేసు సామాన్యులకే కాదు మేథావులకు కూడా అంతుపట్టని బ్రహ్మపదార్థమే. ఏడుపదులు నిండినవారు, వీల్చైర్లకే పరిమితమైనవారు కూడా జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఈ సమాజానికి ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే.
భీమాకొరెగావ్ కేసులో అరెస్టయినవారికి బెయిల్ దొరకడం కూడా కష్టమైంది. ఎందుకంటే ఎన్ఐఏ మోపిన అభియోగాలు అంత తీవ్రమైనవి. వాళ్లు బయటికొస్తే దేశ సమగ్రతకే ముప్పనీ ఉగ్రవాదం పేట్రేగుతుందన్నట్లు కేంద్ర నిఘా విభాగం బలమైన వాదన వినిపించింది. మేథావులు అణుబాంబుల్లా ఎందుకు మారిపోయారో, చట్టానికి వారు అత్యంత ప్రమాదకరంగా ఎందుకు కనిపిస్తున్నారో ఎవరికీ అర్ధంకాదు. ఇదే కేసులో జైలుపాలై మధ్యంతర బెయిల్ కోసం నిరీక్షిస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు ఫాదర్ స్టాన్ స్వామి. 84 ఏళ్ల స్టాన్ స్వామిపై ఎన్నో అభియోగాలు మోపారు. ఆయన బయటపడకుండా చూశారు. దీంతో చివరికి జైలుగోడల మధ్యే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
భీమాకొరెగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామి(84)పై మోపిన అభియోగాలపై ఇప్పుడు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ఎన్ఐఏ చూపిన ఆధారాలపై అమెరికా ఫోరెన్సిక్ సంస్థ సందేహాలు లేవనెత్తింది. ఆధారాలుగా చూపించిన మావోయిస్టు లేఖలతో పాటు 40కి పైగా పత్రాలు స్టాన్ స్వామి లాప్‌టాప్‌లోకి సైబర్ అటాకర్ ద్వారా ప్రవేశపెట్టినట్లు వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని హ్యాకర్ 2014-2019 మధ్యకాలంలో ఆ పత్రాలను స్టాన్ స్వామి లాప్‌టాప్‌లోకి చొప్పించారని ఆర్సెనల్ కన్సల్టింగ్ సంస్థ నిర్థారించిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. స్టాన్‌స్వామి జార్ఖండ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు, క్రైస్తవ మత బోధకుడు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, భీమాకొరెగావ్‌లో హింసకు ప్రేరేపించారనే ఆరోపణలతో 2020లో ఆయన్ని అరెస్ట్‌చేశారు.
బెయిల్ రాకుండానే 2021 జులైలో ఆయన జైల్లోనే కన్నుమూశారు. 17 నెలల తర్వాత ఆయన లాయర్లు ఫోరెన్సిక్ సేవలందించే మసాచుసెట్స్‌కు చెందిన ఆర్సెనల్ కన్సల్టింగ్ని సంప్రదిస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఎనిమిదిపదుల వయసున్న సామాజిక ఉద్యమకారుడిపై ఎందుకింత కక్ష? ఆయన్ని నేరస్తుడిగా నిరూపించేందుకు ఫోర్జరీ పత్రాలు పెట్టాల్సినంత అగత్యం ఏమొచ్చింది? ఇదే కేసులో మరో ఇద్దరు నిందితుల ల్యాప్‌టాప్‌ల్లోకి కూడా హ్యాకర్ చొరబడ్డారన్న అనుమానాలతో అసలు ఈ కేసే ఓ మిస్టరీగా ఉంది. కుక్కని చంపాలంటే పిచ్చిదనే ముద్రవేయాలి. ఇప్పుడు ఎవర్నయినా జైల్లో పెట్టాలంటే దేశద్రోహిగా ఆధారాలు సృష్టిస్తే సరిపోతుందేమో!