రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

By KTV Telugu On 7 November, 2022
image

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు సబబే అన్న ధర్మాసనం

ఈడబ్లుఎస్‌ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి 10 శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని సుప్రీంకోర్టు విసృత ధర్మాసనం తెలిపింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదని పేర్కొంది. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలవరించింది. ఈ రిజర్వేషన్లను ముగ్గురు జడ్జిలు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్థీవాలా సమర్థించగా సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ మాత్రం వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి తీర్పు వెలువరించారు. ఈ రిజర్వేషన్లు కేటాయించడంలో ఎలాంటి వివక్ష లేదని జస్టిస్‌ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తీర్పులతో జస్టిస్ జేబీ పార్థీవాలా ఏకీభవించారు. అయితే జస్టిస్ రవీంద్రభట్‌ మాత్రం వీరి అభిప్రాయాలను వ్యతిరేకించారు. ఈడబ్లుఎస్‌ పది శాతం కోటా కేటాయించడం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు నిర్ణయించిన 50 శాతం పరిమితిని దాటుతుందని జస్టిస్‌ భట్‌ అన్నారు. దీన్ని సిజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్ కూడా అంగీకరించారు. 2019 ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. అయితే సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటి ఈడబ్లుఎస్‌ రిజర్వేన్లు ఎలా ఇస్తారని పలువరు పిటిషన్లు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ మూలు స్వరూపాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.