బీజేపీకి భ‌జ‌న‌చేస్తే గ‌వ‌ర్న‌ర్ గిరీ.. ఎదురు తిరిగితే? ఉస్కో ఉస్కో

By KTV Telugu On 23 April, 2023
image

మొన్న‌టిదాకా ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ బీజేపీ అధినాయ‌క‌త్వానికి న‌మ్మ‌క‌స్తుడు. అందుకే జ‌మ్ముక‌శ్మీర్‌లాంటి చోట కూడా ఆయ‌న సేవ‌ల్ని పార్టీ వాడుకుంది. కానీ సీన్ క‌ట్‌చేస్తే ఇప్పుడాయ‌న క‌మలం పార్టీకి కంట్లో న‌లుసు బీజేపీ పెద్ద‌ల‌కు పంటికింద‌రాయి. అవ‌గాహ‌న లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడ‌ని తేలిగ్గా తీసుకోడానికి లేదు. ఎందుకంటే మొన్న‌టిదాకా ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌. కీల‌క‌మైన రాజ్యాంగ‌ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి. అలాంటివాడే దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు మాట్లాడితే ఎవ‌ర‌యినా ఎందుకు తేలిగ్గా తీసుకుంటారు. అందుకే మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ వ్యాఖ్య‌ల‌తో బీజేపీ ఉలిక్కిప‌డింది. ఇలా అడ్డం తిరుక్కునేవాళ్ల నోళ్లు మూయించ‌డానికి అమ్ముల‌పొదిలో ఓ బ్ర‌హ్మాస్త్రం ఉందిగా. దాన్ని బ‌య‌టికి తీసింది. కేంద్రం అమ్ముల‌పొదిలోని అస్త్రాల్లో ఇప్పుడు ప‌వ‌ర్‌ఫుల్‌గా ప‌నిచేస్తోంది సీబీఐనే. ఢిల్లీ డిప్యూటీ సీఎంని జైల్లో వేసింది. స్వ‌యంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రిని గంట‌ల త‌ర‌బ‌డి ఇంట‌రాగేట్ చేసింది. తెలంగాణ‌సీఎం కేసీఆర్ కూతురిని కూడా అవ‌స‌ర‌మైతే అరెస్ట్ చేసేలా ఉంది.

పుల్వామాలాంటి ఉగ్రదాడిమీద న‌మ్మ‌శ‌క్యం కాని నిజాలు చెబుతున్న మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ మీద కూడా అదే అస్త్రాన్ని సంధించింది. స‌త్య‌పాల్‌మాలిక్ స్కామేం చేయ‌లేదు ఆయ‌న ఆరోప‌ణ‌ల‌ను ఆధారం చేసుకుని సీబీఐ స‌మ‌న్లు ఇచ్చింది. జమ్ముకశ్మీర్ ఇన్సూరెన్స్ స్కామ్‌లో త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేదుకు రావాల‌ని సీబీఐ స‌మ‌న్లు జారీచేసింది. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబరు 30దాకా సత్య‌పాల్‌మాలిక్ జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రెండు ఫైళ్ల‌పై సంతకాలు చేసేందుకు తనకు కొందరు రూ.300 కోట్ల ముడుపులు ఇవ్వజూపారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌చేశారు స‌త్య‌పాల్‌మాలిక్‌. స‌త్య‌పాల్‌మాలిక్‌కి భారీ లంచం ఆఫ‌ర్ ఇచ్చిన రెండు ఫైళ్ల‌లో ఒక‌టి కశ్మీర్‌ ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాంట్రాక్టుకు సంబంధించింది. రెండోది కిరూ జలవిద్యుత్‌ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్‌ వర్కుకు చెందింది. స‌త్య‌పాల్‌మాలిక్ ఆరోప‌ణల త‌ర్వాత సీబీఐ ఈ రెండు అభియోగాల‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. త‌న ఆరోప‌ణ‌ల‌పై త‌న‌కే స‌మ‌న్లు రావ‌టంతో నిజాలు చెప్పేందుకు భ‌య‌ప‌డేదే లేదంటున్నారు స‌త్య‌పాల్‌ మాలిక్‌. తాను ఏమాత్రం భయపడనంటున్నారు అయితే గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడే స‌త్య‌పాల్‌మాలిక్ ఈ విష‌యాలు మాట్లాడి ఉండాల్సిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అప్పుడెందుకు మౌనంగా ఉన్నార‌ని అమిత్‌షా ప్ర‌శ్నిస్తున్నారు.

లంచం ఆరోప‌ణ‌ల‌కంటే ఎక్కువ‌గా పుల్వామా దాడి విష‌యంలో స‌త్య‌పాల్‌మాలిక్ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనికుల భ‌ద్ర‌త‌తో మోడీ ప్ర‌భుత్వం రాజీప‌డింద‌న్న గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు కేంద్రాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. అస‌లే రాహుల్‌గాంధీ స‌భ్య‌త్వ ర‌ద్దుతో కాక‌మీదున్న కాంగ్రెస్ ఈ ఆరోప‌ణ‌ల్ని ఎత్తిచూపుతూ కేంద్రాన్ని నిల‌దీస్తోంది. ది వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ప్ర‌భుత్వంపై సత్యపాల్‌ మాలిక్ ఆరోపణలు చేశారు. సైనికులను రోడ్డు మార్గాన తరలించడం అంత క్షేమం కాదని వారిని విమానాలలో పంపాలని చేసిన విజ్ఞప్తిని హోం శాఖ తిరస్కరించింద‌పి ఆరోపించారు. టెర్రరిస్టుల దాడిలో 40 మంది సైనికులు మరణించడానికి కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని, ఈ విషాదాన్ని మోడీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సత్యపాల్‌మాలిక్ ఆరోపించారు. దీన్ని కూడా అమిత్‌షా ఖండించినా గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన నాయ‌కుడి వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు మౌనంగా ఎందుకున్నార‌ని కొంటె ప్ర‌శ్న‌లు వేస్తున్నారు అమిత్‌షా. ఆ ప‌ద‌విలో ఉంటూ కేంద్రానికి వ్య‌తిరేకంగా నోరువిప్ప‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అదానీతోనే కేంద్రం ఎన్నో నింద‌లు ప‌డుతుంటే ఇప్పుడు స‌త్య‌పాల్‌మాలిక్ లంచం ఇవ్వ‌జూపింది రిల‌య‌న్స్ సంస్థ‌ అంటే అంబానీ. అందుకే నిప్పులేందే పొగ‌రాద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. స‌త్య‌పాల్‌మాలిక్ ఎంత ఒత్తిడి ఉన్నా నిజ‌మే చెబుతారా ద‌ర్యాప్త‌సంస్థల దెబ్బ‌కి ప‌డ‌క్కుర్చీలో వాలిపోయి కృష్ణారామా అనుకుందామ‌నుకుంటారా.