జీపీఎస్ చాలు.. టోల్ ఎంతో తేల్చేస్తుంది
ఇక ఆగడాలుండవ్.. అంతా ఆటోమేటిక్
ఫాస్టాగ్. ఒకప్పుడు వింటానికే కొత్తగా అనిపించేది. మన రోడ్లమీద మనకుండే ట్రాఫిక్ ఒత్తిడిలో ఈ విధానం సాధ్యమేనా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఫాస్టాగ్ మన ప్రయాణంలో భాగమైపోవడమే కాదు కొత్త మార్పులు సంతరించుకుంటోంది. టోల్పాస్ల జారీ, చార్జీలు తీసుకుని చిల్లర తిరిగొచ్చేయడం వంటి కాలహరణ ప్రక్రియతో టోల్గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరేవి. కానీ ఇప్పుడు వాహనం ఆగిన మరుక్షణమే పచ్చలైటు వెలుగుతోంది. ఎక్కువసేపు వాహనాలు నిలబడే అవసరం రావడంలేదు. ప్రతీ వాహనానికి ఫాస్టాగ్ స్టిక్కర్ కనిపిస్తోంది. దేశంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెప్పొచ్చు.
2021 జనవరి 1నుంచే దేశంలోని అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ద్వారా రోజువారీ ఆదాయం 80కోట్లు. పండగల్లాంటి రద్దీ సీజన్లలో ఇది 120కోట్లు దాటుతోంది. అందుకే ఈ విధానాన్ని మరింత అప్డేట్ చేయడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ఫాస్ట్‌ట్యాగ్ ఎనేబుల్డ్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని జమ్మూలోని మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ జనరల్ బస్టాండ్‌లో ప్రారంభించటం ఓ మంచి ప్రయత్నం. పార్క్ ప్లస్ యాప్‌తో సులువుగా పార్కింగ్ స్పాట్ కనుక్కోవచ్చు. బుక్ చేసుకుని ముందే ఫీజు చెల్లించేయొచ్చు. అత్యాధునిక స్మార్ట్ పార్కింగ్ ఫాస్ట్‌ట్యాగ్ జమ్ముకశ్మీర్‌లో మొదటిదైనా దేశంలో రెండోదికావడం విశేషం.
దేశంలో మొదటి UPI ఆధారాతి ఫాస్ట్‌ట్యాగ్ పార్కింగ్ సదుపాయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 2021 జూలై 6 కష్మీర్ గేట్ మెట్రోస్టేషన్లో ప్రారంభించింది. ఫాస్ట్ట్యాగే వైవిధ్యం అనుకుంటే టోల్ చార్జీల చెల్లింపు మరింత కొత్త రూపు సంతరించుకుంటోంది. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ చార్జీలు వసూలు చేయాలని కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే నేషనల్ హైవేల మీద ఒక వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో గమనించి దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు. ఇది కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను ఎత్తేయాలనుకుంటోంది కేంద్రం.