లేడీ ఐఏఎస్‌..ఐపీఎస్‌ల సిగపట్లు.. గవర్నమెంట్ షాక్‌ ట్రీట్‌మెంట్‌

By KTV Telugu On 22 February, 2023
image

వాళ్లిద్దరూ దేశంలోనే అత్యున్నత స్థాయి సివిల్‌ సర్వీస్‌ అధికారులు. ఒకరు ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి,
కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ గా పనిచేస్తున్నారు. మరొకరు ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గల్‌. రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన ఈ మహిళా అధికారుల మధ్య ఎందుకనో మనస్పర్థలు మొదలయ్యాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ గొడవేదో వాళ్లిద్దరి మధ్యలో ఉంటే ఏదోవిధంగా సద్దు మనిగేది. కానీ ఇద్దరూ పంతాలకు పోయి వీధికెక్కారు. ఏకంగా సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వారి జగడం గురించి అందరికీ తెలిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే..

కర్ణాటకలో ఎమ్మెల్యే మహేష్ భూ కబ్జాకు పాల్పడ్డారని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కొద్ది నెలల క్రితం ఆరోపించారు. దానికి ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. అయితే మహేష్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఐపీఎస్‌ అధికారి డి.రూప రోహిణి ఐఏఎస్‌ సింధూరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సింధూరిపై, రూప 20 ఆరోపణలు చేశారు. రోహిణికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు రూప. ఆ ఫోటోలను రోహిణి ముగ్గురు మగ ఐఏఎస్ ఆఫీసర్లకు షేర్ చేసిందని ఆరోపించారు. ఇది ఐఏఎస్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం నేరం. ఈ ఫోటోల వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు రూప. అసలు ఒక ఐఏఎస్ అధికారి అయిన రోహిణి ఎమ్మెల్యే మహేష్ ని కలవడానికి ఎందుకు వెళ్ళింది అని ప్రశ్నించారు. దీనికి గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు రూప. ఆ ఎమ్మెల్యేతో ఒక రెస్టారెంట్ లో రోహిణి సింధూరి చర్చలు జరుపుతున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను కూడా రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రోహిణి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు రూప. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు రూప. బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని కానీ ఐటీ రిటర్న్స్‌లో ఆ ఇంటి ప్రస్తావన లేదని ఆరోపించారు. ఆ ఇంటికి కోట్ల రూపాయలతో ఇటాలియన్ ఫర్నీచర్ 26 లక్షల రూపాయల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్ కు డబ్బలు ఎక్కడివని ప్రశ్నించారు. కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టర్ గా ఉన్న రోహిణి కలెక్టరేట్ లో విలాసవంతమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించారని విమర్శించారు. ఐపీఎస్‌ రూపా తన ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై ఐఏస్‌ రోహిణి మండిపడ్డారు. తన ఫొటోలను బయటపెట్టడం నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రూపా ముద్గల్‌ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి విమర్శించారు. వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతోనే రూప ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని అన్నారు రోహిణి. తన వ్యక్తిగత ఫొటోలను తాను ఎవరికి పంపించానో చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. అయితే రోహిణి వ్యాఖ్యలపై స్పందించిన రూప డిలీట్‌ అయిన న్యూడ్‌ ఫొటోల గురించి మాట్లాడుతారా అని చేసిన ఆరోపణ కలకలం రేపింది.
రోజు రోజుకూ శృతిమించిపోతున్న ఈ ఇద్దరు మహిళా సివిల్‌ సర్వీస్‌ అధికారులు జగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వారిద్దరిపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. ఇద్దరికీ నోటీసులు జారీ చేయాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఐఏఎస్‌ రోహిణి, రూప చీఫ్‌ సెక్రటరీ వందితాశర్మను కలిసి వివరణ ఇచ్చారు. అయితే సీఎస్‌ను కలిసిన అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ మళ్లీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరు మహిళా అధికారుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించామని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల్సిన వారు ఇలాంటి ఆరోపణలతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్లకు అవమానం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ జగడం పై స్పందించారు. ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీ చేస్తూ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పటికైనా వీళ్లిద్దరూ తమ గొడవకు ఫుల్‌స్టాప్‌ పెడతారా కంటిన్యూ చేస్తారా చూడాలి.