కర్ణాటక రాజకీయం మారుతోంది. గాలి మళ్లుతుందనే ఆశతో బళ్లారి మైనింగ్ కింగ్ జనార్దన్‌రెడ్డితో కొత్త పార్టీ పెట్టిస్తోంది. ఒకప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకున్న బీజేపీకి గాలి జనార్దన్‌రెడ్డి బరువైపోయాడు. ఒకప్పుడు కర్నాటక ప్రభుత్వంలో చక్రం తిప్పిన గాలి బ్రదర్స్ తమ ప్రాధాన్యం తగ్గడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనకేం తక్కువన్నట్లు కొత్త పార్టీ ఏర్పాటుకోసం గాలి జనార్దన్‌రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) పేరుతో కొత్త పార్టీకి గాలి దరఖాస్తు పెట్టుకున్నారు. గాలికి అత్యంత సన్నిహితుడైన కురుబ కులం నేతను అధ్యక్షుడిగా పెట్టి కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యూహంతో జనార్దన్‌రెడ్డి ఉన్నారు.
వైఎస్ జగన్‌తో గాలి జనార్దన్‌రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. వైఎస్ హయాంలోనే బళ్లారి సామ్రాజ్యాన్ని గాలి జనార్దన్‌రెడ్డి ఏలుకున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీ కర్నాటకలో వైసీపీ విస్తరణకు పరోక్షంగా ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ కూడా కర్ణాటకలో పోటీపై క్లారిటీతో ఉన్నారు. మాజీ సీఎం కుమారస్వామి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సమయంలో గాలి కొత్త పార్టీ ప్రయత్నాల వెనుక కేసీఆర్ కూడా ఉండొచ్చని కొందరు లెక్కలేస్తున్నారు.
కర్నాటకలో అధికారబీజేపీతో పాటు కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఆ రెండు పార్టీల నుంచి నేతలను ఆహ్వానించి కొత్త పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లొచ్చనే వ్యూహంతో గాలి జనార్దన్‌రెడ్డి ఉన్నారు. కనీసం 25 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనేది గాలి టార్గెట్. ఆయనకు పది నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ బలం ఉంది. బళ్లారి, విజయనగరం, కొప్పల్, రాయచూర్, యాదగిరి, బీదర్ జిల్లాల్లో గాలికి భారీసంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు.
గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీ ప్రయత్నాలతో కమలం పార్టీ కలవరపడుతోంది. ఆయన పార్టీ తమ ఓటుబ్యాంకుకి గండి కొడుతుందేమోనని కమలనాథుల్లో గుబులు మొదలైంది. 2013లో యడ్యూరప్ప బీజేపీని వీడి కర్ణాటక జనతా పార్టీని పెట్టినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు శ్రీరాములు సహాయంతో బీఎస్ఆర్. కాంగ్రెస్‌ని స్థాపించినప్పుడు కమలంపార్టీ నష్టపోయింది. అయితే బీజేపీని తనదారికి తెచ్చుకునేందుకే గాలి జనార్దన్‌రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఆయన సోదరుడు సోమశేఖర్‌రెడ్డి కూడా అన్న కొత్తపార్టీ పెట్టకపోవచ్చంటున్నారు. చెప్పలేం…గనులకు, నిధులకు కొరతలేని గాలి తన రాజకీయభవిష్యత్తు కోసం కొత్త జెండా పట్టినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు.