కన్నడనాట గాలి జనార్దన్ రెడ్డి పార్టీ దూకుడు.. మేనిఫెస్టో రిలీజ్‌

By KTV Telugu On 25 February, 2023
image

కర్నాటకలో గాలి పార్టీ కమలనాథులను కలవరపెడుతోందట. కొత్త పార్టీ పెట్టిన కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ దూకుడు పెంచుతున్నారు. అయితే ఆయన బీజేపీ నేతలను టార్గెట్ చేయడంతో పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిథులు అమిత్ షా వద్ద గాలి గాబరా చేస్తున్నాడని మొరపెట్టుకున్నారట. కళ్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు గాలి జనార్ధన్ రెడ్డి. ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్‌లకు ధీటుగా ఎన్నికల కదనరంగంలోకి దూకుతున్నారు. తనకు పట్టున్న నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు దూకుడు పెంచుతున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. రైతులను ఎక్కువ ఆకర్షించే ఉద్దేశంతో వారికి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. అధికారంలోకి వస్తే ప్రతి రైతు అకౌంట్‌లో 15 వేల రూపాయలు జమ చేస్తామన్నారు.

కర్నాటకలో మే లేదా జూన్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈ ఎన్నికలకు బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. మరోసారి అక్కడ అధికారాన్ని నిలుపుకొని సౌత్‌లో బలపడాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎన్నికల వరకు ఇంఛార్జ్‌గా నియమించింది. సహ ఇంఛార్జ్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలైని నియమించారు. అటు నడ్డా అమిత్ షాలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. అటు జేడీఎస్ కూడా ఈసారి అసెంబ్లీలో బలపడాలని ఉవ్విళ్లూరుతోంది.

అటు గాలి జనార్ధన్ రెడ్డి కేఆర్పీపీ పార్టీ కూడా ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే కోప్పళ, సిరుగుప్ప, కనకగిరి, సింధనూరు, హిరియూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి తన అభ్యర్థులను ప్రకటించారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తమ అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలిచే అభ్యర్థులను కష్టపడి ఓటర్లను ఆకర్షించే నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని గాలి చెబుతున్నారు. టికెట్ల కోసం చాలా మంది గాలి నివాసానికి క్యూ కడుతున్నారట. అందరినీ నేరుగా కలవలేక ఈమెయిల్ అడ్రస్‌కు వివరాలు పంపించాలని కోరుతున్నారట. మొత్తంగా కన్నడ నాట తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న గాలి జనార్దన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా గెలుచుకుని కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని తాపత్రయపడుతున్నారు. కర్నాటకలో కేఆర్‌పీపీ గాలి వీస్తుందా లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుందా అనేది ఎన్నికల్లో తేలిపోనుంది.