ప్రపంచంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రివర్ క్రూజ్ గంగా విలాస్ కు అనుకోని అవాంతరం ఎదురయ్యింది. గంగా నదీ తీరంలో తగినంత నీటి మట్టం లేకపోవడంతో నది మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి గంగా విలాస్ క్రూజ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 27 నదీ మార్గాల్లో 51 రోజుల పాటు దాదాపు 3,200 కిలోమీటర్ల మేర ఈ నౌకాయానం సాగనుంది. భారత్, బంగ్లాదేశ్ లోని వివిధ చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ గంగా విలాస్ క్రూజ్ ముందుకు సాగనుంది. ఇందులో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఈ క్రూజ్‌లో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు.
40సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది. టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.12.6 లక్షలు. ధర ఎక్కువే అయినప్పటికీ 2024 మార్చి వరకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. పర్యటన ప్రారంభమైన మూడో రోజున బీహార్ లోని చాప్రా వద్ద నున్న చారిత్రక ప్రదేశం చిరంద్ ను దర్శించడం కోసం ఈ నౌక డోరిగంజ్ వెళ్లింది. అయితే తీరం చేరుకునే క్రమంలో అనుకోని అవాంతరం ఎదురయ్యింది. తీరంలో తగినంత నీటిమట్టం లేకపోవడంతో నదిలోనే నిలిచిపోయింది. ఒడ్డున నీరు తక్కువగా ఉండడం వల్ల గంగా విలాస్ క్రూజ్ ను తీరం వరకు తీసుకువెళ్లడం కష్టమని అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి యాత్రికులను చిన్న చిన్న పడవల్లోకి ఎక్కించి తీరానికి చేర్చారు. నది మధ్యలోనే నిలిచిపోయిన ఈ విలాసవంతమైన భారీ నౌకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.