పాయింట్ బ్లాంక్‌లో ఇద్ద‌రి మ‌ర్డ‌ర్‌.. పోలీసుల ప్రేక్ష‌క‌పాత్ర‌

By KTV Telugu On 17 April, 2023
image

పాకిస్తాన్‌నుంచి భార‌త్‌లోకి జొర‌బ‌డి ముంబైలో మార‌ణ‌హోమం సృష్టించారు ముష్క‌రులు వారిలో క‌స‌బ్ ఒక‌డు. ప‌దుల‌సంఖ్య‌లో ప్రాణాలుపోయాక క‌స‌బ్ స‌జీవంగా దొరికాడు అత‌న్ని విచారించారు. కుట్ర‌ను ఛేదించారు. ఆ కిరాత‌కుడిని చివ‌రికి ఉరికంబం ఎక్కించారు. దొర‌గ్గానే కోపం ప‌ట్ట‌లేక క‌స‌బ్ ఇంటిని కూడా బుల్లెట్ల‌తో జ‌ల్లెడ చేసుండొచ్చు కానీ మ‌న‌కో న్యాయ‌వ్య‌వ‌స్థ ఉంది. అస‌దుద్దీన్ ఒవైసీ ఈ విష‌యాల‌న్నీ మాట్లాడితే కొంద‌రికి అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకోవ‌చ్చు. చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకుని అరాచ‌కాలు చేసిన అన్న‌ద‌మ్ముల‌ను చంపితే పండ‌గ చేసుకోవాల్సింది పోయి త‌ప్పుప‌డ‌తారేంట‌ని కొంద‌రికి కోపం రావ‌చ్చు. కానీ యూపీలో మాజీ ఎంపీ అతీక్ అహ్మ‌ద్‌ అత‌ని సోద‌రుడు అష్ర‌ఫ్‌ల హ‌త్య‌తో ఆ రాష్ట్రంలో యోగి మార్క్ న్యాయం బోనులో నిలుచుంది.

క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుల‌ను రాత్రి 10గంట‌ల ప్రాంతంలో వైద్య‌ప‌రీక్ష‌ల‌కు తీసుకెళ్ల‌డం ఏమిటో వారిని గేటు బ‌య‌టే దించి మీడియా మైకుల‌ముందుకు అనుమ‌తించ‌డం ఏమిటో ఆ మీడియాలోకి ముగ్గురు సాయుధులు చొరబ‌డి నుదురుకు తుపాకీ గురిపెట్టి మ‌రీ కాల్చేయ‌డ‌మేంటో క‌ర‌డుగ‌ట్టిన నేరస్తులు ఎక్క‌డున్నా వెతికివెతికి చంపే స‌మ‌ర్ధులైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు త‌మ క‌ళ్లెదుట జ‌రుగుతున్న ఈ ఘోరాన్ని చేష్ట‌లుడిగి చూడ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం. తుపాకుల్లోని తూటాల‌న్నీ అయిపోయాక ఆ హంత‌కులు చేతులెత్తిన త‌ర్వాతే యూపీ పోలీసులు ఎంతో సాహ‌సం చేసి వారిని ప‌ట్టుకున్నారు. ఎంత నాట‌కీయం అతీక్ అహ్మ‌ద్ సోద‌రుల దురాగ‌తాల‌పై ప‌క్కా సాక్ష్యాలున్నాయి. కోర్టు శిక్ష ఆల‌స్యం అవుతుంద‌నుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుపెట్టి త్వ‌ర‌గా విచార‌ణ జ‌రిపించేసి శిక్ష వేయించొచ్చు. కానీ యూపీ ఎన్‌కౌంట‌ర్ల‌కు భిన్నంగా ఇదో కొత్త ట్రెండ్.

అతీక్ అహ్మ‌ద్ మంచోడా చెడ్డోడా అన్న‌ది కానే కాదు ప్ర‌శ్న‌. అధికారంలో ఉన్న‌వాళ్లు మ‌ద్ద‌తిచ్చిన‌ప్పుడు అతీక్ నేర సామ్రాజ్యాన్ని న‌డిపాడు. అడిగేవారు లేర‌న్న‌ట్లు రెచ్చిపోయాడు. దాదాపు100కుపైగా క్రిమినల్​ కేసుల్లో నిందితుడు. బీఎస్పీ ఎమ్మెల్యే హ‌త్య‌కేసు సాక్షి ఉమేష్‌పాల్ హ‌త్య‌కు అత‌ని కుటుంబం మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. అత‌ని కొడుకు స‌హా నలుగురుని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. త‌న‌ను కూడా ఎన్‌కౌంట‌ర్ చేస్తార‌ని త‌న‌కుప్రాణ‌హాని ఉంద‌ని అతీక్ అహ్మ‌ద్ గ‌గ్గోలు పెట్టాడు. చివ‌రికి ఎన్‌కౌంట‌ర్ కాకుండా మ‌రో రూపంలో ప్రాణాలు కోల్పోయాడు.

అతీక్ అహ్మ‌ద్ సోద‌రుల్ని కాల్చిచంపిన నిందితుల‌ను లవ్లేశ్‌ తివారీ సున్నీ అరుణ్‌ మౌర్యగా గుర్తించారు. నిందితులు 18నుంచి 23 సంవ‌త్స‌రాల‌లోపు వారు. నేర‌చ‌రిత్ర ఉన్నవాళ్లేనంటున్నారు పోలీసులు. వీరిలో 18 ఏళ్ల అరుణ్‌మౌర్య అయితే దోపిడీకి అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ని హ‌త‌మార్చిన కేసులో నిందితుడు. ముగ్గురూ డాన్లు అవుదామ‌న్న ల‌క్ష్యంతోనే అతీక్ అహ్మ‌ద్‌ని అత‌ని సోద‌రుడిని చంపార‌న్న‌ది మ‌రో యాంగిల్‌. ఒక‌వేళ అదే నిజ‌మైతే నేర‌సామ్రాజ్యాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తున్నాం అనుకున్న‌చోట హంత‌కుల రూపంలో క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులు పుట్టుకొస్తున్న‌ట్లే లెక్క‌.

అతీక్ అహ్మ‌ద్‌ అష్రాఫ్‌లను కాల్చిచంపాక నిందితులు జై శ్రీరామ్ నినాదాలు చేసి కొత్త ప్ర‌శ్న‌లెన్నో లేవ‌నెత్తారు. అతీక్​ అహ్మద్​ సోద‌రుల హత్యపై దర్యాప్తుకోసం ప్ర‌భుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. శిక్ష‌ప‌డ్డ ఖైదీని ర‌క్షించ‌లేక‌పోవ‌డం యూపీ పోలీసుల వైఫ‌ల్యం. ఎన్‌కౌంట‌ర్ చేసే అవ‌కాశం లేక మ‌రోలా నిందితుల‌కు అవ‌కాశం క‌ల్పించారా లేక‌పోతే ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేక‌పోయారా అన్న‌ది ఎంక్వ‌యిరీలో తేలుతుంది. మ‌రోవైపు యూపీలో 2017 నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది.