ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియాయే ఇందిర. .. ఇండియాయే ఇందిర అన్నారు. అలాంటి బలమైన వాదన ఇప్పటి వరకూ మోదీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోదీ అనేలా వినిపించింది. బీజేపీ ప్రస్థానాన్ని మర్చిపోయేలా.. మోదీ బీజేపీనే అసలైన బీజేపీ అన్నట్లుగా క్యాడర్ మారిపోయింది. కానీ ఇప్పుడు మోదీ పదవిలో ఉండగానే ఆయన పార్టీ వ్యవహారాలపై అదుపు కోల్పోయారన్న ప్రచారం జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో పార్టీని నడిపించే వారిని నియమించడమే కాదు.. చాలా చోట్ల ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు.. కేంద్ర మంత్రి వర్గాన్ని కూడా ఆయన మార్చుకోలేకపోతున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల్ని మార్చేసి కొత్త వారిని నియమించినంత వేగంగా… కేంద్ర కేబినెట్లో మోదీ మార్పు చేర్పుుల చేయలేకపోతున్నారు. ఇదిగో అదిగో అన్నారు కానీ.. మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ ఎప్పుడు జరుగుతుదో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులకు .. రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఇచ్చారు. వారు అటు కేంద్ర మంత్రి పదవిలో.. ఇటు .. బీజేపీ అధ్యక్షులుగా పని చేసుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే… ఆ రెండు రాష్ట్రాలు.. రాజస్థాన్, తెలంగాణల్లో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ సమావేశాలకు ముందే ఉంటుందని అనుకున్నారు. కానీ సమీకరణాలు కుదరలేదు.. బీఎల్ సంతోష్, అమిత షాల కసరత్తు మోదీకి నచ్చలేదని చెబుతున్నారు. అందుకే పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. ఇలా మోదీ… తన టీమ్ పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేకపోతూండటంతో పాటు…. ఇతర కారణాల వల్ల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఆలస్యం అవుతోంది. పార్టీపై మోదీ పట్టు తప్పిపోతోందని అనడానికి ఇదే నిదర్శమన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి.
వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్దగా కష్టపడకుండా… మంత్రివర్గాన్ని మార్చేయడం గత ఎనిమిదేళ్లుగా జరుగుతూనే ఉంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన వారిని ఎక్కువగా మంత్రులు గా చేసే వారు. చాలాసార్లు ఈ ప్రయోగం సక్సెస్ అయింది. . గవర్నర్లు , రాష్ట్రపతి లాంటి పదవులను ఎంపిక చేసేటప్పుడు కూడా మోదీ మాటలకు ఎదురు చెప్పేవారే ఉండరు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూంటే అంతా మారిపోయిందా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇటీవల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కానీ అక్కడ శాసనసభాపక్ష నేతను ఇటీవలి వరకూ నియమించలేకపోయారు. కర్ణాటకలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి శాసన సభా పార్టీ నేతను నియమించలేని దుస్థితిలో బీజేపీ పడింది. గత్యంతరం లేక యడ్యూరప్పను ఢిల్లీ పిలిపించుకుని ఆయన సలహా ప్రకారం మాజీ సీఎం బొమ్మైనే శాసన సభా నేతగా నియమించారు. ఆయన డిమాండ్ మేరకు ఆయన కుమారుల్లో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, లేక మరొకరిని కేంద్రమంత్రిగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజస్థాన్‌లో వసుంధరా రాజే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆమె నాయకత్వాన్ని మార్చాలని మోదీ చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇతర నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి వెనుకాడుతున్నారు.
ఈ పరిణామాలన్నింటికీ కారణం ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, బీఎల్ సంతోష్ మధ్య అనుకున్నంతగా పరిస్థితులు సామరస్యంగా లేకపోవడమేనని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చాలని.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షా, బీఎల్ సంతోష్ రిపోర్ట్ రెడీ చేశారని… అంటున్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం… ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ గురించి గత రెండు, మూడు నెలలుగా ప్రచారంభ్ జరుగుతోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతీ సారి కేంద్రంలో మార్పులు చేర్పులు సహజంగానే జరుగుతున్నాయి. ఈ సారి కూడా jఅలా చేస్తారని అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ అమిత్ షా, బీఎల్ సంతోష్ ల వ్యహాలపై నమ్మకం కోల్పోయారని అంటున్నారు. వారు చెప్పిన ప్రతి విషయానికి అంగీకిరంచి.. ముఖ్యమంత్రుల్ని మార్చడం వల్ల.. కర్ణాటకలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని మోదీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
గతంలో అమిత్ షా చెప్పేదే వేదం. కానీ ప్రధాని మోదీ ఇప్పుడు కొన్ని అంశాల్లో అమిత్ షాతో విబేధిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీలో వేగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. బీజేపీ ఎదిగే అవకాశం వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడలో విఫలం కావడంతో మళ్లీ పడిపోయిన వ్యవహారం కూడా బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. పై స్థాయిలో నేతల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని అందుకే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ … బీజేపీ ప్రధాన వ్యూహకర్తలు.. యాక్షన్ ప్లానర్లుగా ఉన్న అమిత్ షా,, బీఎల్ సంతోష్ లపై నమ్మకం కోల్పోతే… ఇక ఆయనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు.అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అదనపు సమస్యలు వస్తాయని అనుమానిస్తున్నారు.
ఓ వైపు సొంత పార్టీలో మోదీ పట్టు జారిపోతోందన్నఅభిప్రాయం వినిపిస్తూంటే.. మరో వైపు విపక్ష నేతల్లోనూ భయం తగ్గిపోతోంది.b బీజేపీతో విబేధిస్తే దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయేమోనని నిన్నటి వరకూ భయపడే నేతలు ఇప్పుడు అసలు ఆలోచించడం లేదు. మోదీపై పోరాటానికి సై అంటున్నారు.
బెంగళూరులో ఇండియా కూటమి సమావేశం జరుగుతున్నప్పుడే.. తమిళనాడులో స్టాలిన్ మంత్రివర్గంలోని మరో మంత్రిపై ఈడీ దాడులు చేసింది. కానీ స్టాలిన్ మాత్రం… తేల్చుకుందామన్నట్లుగా మాట్లాడారు. ఈ పరిణామం ఒక్క తమిళనాడు నుంచి కాదు.. చాలా రాష్ట్రాల నుంచి వస్తోంది. దేశంలో రెండు మూడు ప్రాంతీయ పార్టీలు తప్ప ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డాయి. వీరిలో నాలుగైదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ బీజేపీతో మనస్ఫూర్తిగా చేతులు కలిపే పార్టీలు లేవు. ఫలితాలు తేడా వస్తే ఆ పార్టీలు బీజేపీని వదిలేస్తాయి. సీబీఐ, ఈడీల సాయంతో మోదీ చేసిన రాజకీయం ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం బీజేపీ రాజకీయ వ్యూహానికి తోడ్పడింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన రాజకీయనాయకుల్లో 90శాతం ప్రతిపక్ష నేతలే ఉన్నారు. భయపడినవారంతా బీజేపీలో చేరిపోయారు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వా శర్మపై 2014, 2015లో శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రింద సీబీఐ, ఈడీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ దర్యాప్తు ఊసే లేదు. ఏక్‌నాథ్ షిండే నుంచి అజిత్ పవార్ వరకు బీజేపీతో చేతులు కలిపేందుకు కారణం ఈడీయే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో పని చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూండటంతో ఈడీ, సీబీఐలు తమను ఏదో చేస్తాయని భయపడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు మోదీని చూసి భయపడి, ఆయనతో చేతులు కలిపితే రాజకీయంగా నష్టపోయినట్లేనని ఎక్కువ మంది వెనుకడుగు వేస్తున్నారు.
మోదీ దర్యాప్తు సంస్థలతో చేసిన రాజకీయం.. విపక్ష నేతలు అవినీతి పరులని మొదట్లో చేసిన వాదనలు ప్రజలు మొదట్లో నమ్మారు . కానీ అలా ఆరోపణలు చేసిన వారినే పార్టీలో చేర్చుకుని సైలెంట్ కావడంతో ప్రజలు కూడా మోదీ చేతల పట్ల విరక్తి చెందుతున్నారు. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మాను, మహారాష్ట్రలో అజిత్ పవార్‌ను అవినీతిపరులుగా అభివర్ణించిన బీజేపీ ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వారి భాగస్వామ్యంతో ప్రభుత్వాలను ఏర్పర్చింది. జగన్ విషయంలో బీజేపీ తీరు అంతే ఉంది. ఆయన అవినీతి గురించి విమర్శలు చేస్తూనే కావాల్సినంతగా సహకరిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కేసుల విషయంలో ఉదాసీనంగా ఉంటూ, ఏజెన్సీల చర్యల విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలతో మోదీ క్రమంగా బలహీనపడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అది వచ్చే ఎన్నికల నాటికి ఏ స్థాయికి పడిపోతుందో అంచనా వేయడం కష్టమే.
ప్రచారంతో ఓ రాజకీయ నాయకుడు తన ఇమేజ్ ను నిర్మించి అదే పనిగా కొనసాగించలేరు . ఆ ఇమేజ్ కు తగ్గట్లుగా పనులు చేయాలి. లేకపోతే బెదిరించేవారు ఎక్కువయిపోతారు. ఇప్పుడు మోదీని బెదిరించేవారు క్రమంగా పెరుగుతుంది. ఇలా ఊపందుకుంటే… ఆయన అత్యంత బలహీనమైన నేతగా మిగులుతారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..