కేసు వేస్తావా వేస్కో.. మా లెక్క ప‌క్కా!

By KTV Telugu On 28 January, 2023
image

అదానీ ముసుగు తొల‌గిపోయింది. కేంద్రంలోని కొంద‌రు పెద్ద‌ల ఆశీస్సుల‌తో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో చేరిపోయిన అదానీ ఎదుగుద‌ల వెనుక ఎన్ని అక్ర‌మ సోపానాలున్నాయో బ‌య‌టికొచ్చింది. షేర్ల‌ను హాట్‌కేకుల్లా అమ్మేసుకుని జ‌నాన్ని వేల‌కోట్లు ముంచేసిన బిగ్ చీట‌ర్‌లా చూస్తున్నారిప్పుడు. అంబానీని మించిపోదామ‌నుకున్న స‌మ‌యంలో త‌న చీక‌టికోణం బ‌య‌టపడ్డా తేలుకుట్టిన దొంగ‌లా ఉండ‌టంలేదు అదానీ. త‌న‌వెనుక ఏదో కుట్ర జ‌రిగిందంటున్నారు. నివేదిక బ‌య‌ట‌పెట్టిన సంస్థ‌ను కోర్టుకు ఈడుస్తానంటున్నారు. 20వేల కోట్ల అదానీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ఎఫ్‌పీవోను దెబ్బ‌తీసేందుకే ఇలాంటి నివేదిక‌ను తెర‌పైకి తెచ్చార‌న్న‌ది అదానీ వాద‌న‌.

అదానీ కోర్టుకెక్కుతాన‌న్నా ప‌రువు న‌ష్టం దావాకు సిద్ధ‌ప‌డుతున్నా హిండెన్‌బ‌ర్గ్ డోంట్ కేర్ అంటోంది. నీ జాత‌క‌మంతా మా చేతుల్లో ఉంద‌ని గ‌ట్టిగా చెబుతోంది. గ‌తంలో ఎల‌క్ట్రిక్ ట్ర‌క్కుల‌పై నికోలా కార్ప్ అనే కంపెనీ ప్ర‌చారం బూట‌క‌మ‌ని సాధికారికంగా సాక్ష్యాల‌తో బ‌య‌ట‌పెట్టింది ఈ సంస్థ‌. దాంతో ఈ కంపెనీ షేర్‌మార్కెట్ క్యాప్ దారుణంగా ప‌డిపోయింది. అదానీ షేర్ల భాగోతం అత‌ని కంపెనీల వెనుక మాయాజాలాన్ని కూడా గ‌ణాంకాల‌తో వెలుగులోకి తెచ్చింది హిండెన్‌బ‌ర్గ్‌. త‌మ ఆరోప‌ణ‌లు నూటికి నూరుపాళ్లు నిజ‌మ‌ని స‌మ‌ర్ధించుకుంది. నివేదిక‌లోని ప్ర‌తీ అక్ష‌రానికీ తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

గుమ్మ‌డికాయ‌ల దొంగ భుజాలు త‌డుముకుంటున్నాడు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లంటూ కొట్టిపారేస్తున్న అదానీ త‌మ అప్పుల‌మీద నోరెత్త‌డం లేదు. కంపెనీల షేర్లు అంత అసాధార‌ణంగా ఎలా పెరిగాయో ఎందుకు ప‌త‌నం అవుతున్నాయో వివ‌ర‌ణ ఇచ్చుకోలేదు. హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ కూడా ఇదే పాయింట్ వేలెత్తిచూపుతోంది. ఆ సంస్థ అదానీ గ్రూప్‌కి 88 ప్ర‌శ్న‌లు వేసింది. అందులో ఒక్క‌దానికీ అదానీ నుంచి స‌మాధానం ఎందుకు లేద‌ని హిండెన్‌బ‌ర్గ్ ప్ర‌శిస్తోంది. ద‌మ్ముంటే అదానీగ్రూప్ అమెరికా కోర్టుల్లో కేసు వేయాల‌ని స‌వాల్ విసిరింది. అక్క‌డే తేల్చుకుంటామ‌ని అదానీ అక్ర‌మాల గుట్టుర‌ట్టు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఆధారాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయంటున్న హిండెన్‌బ‌ర్గ్ రియాక్ష‌న్ అదానీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

అదానీ నిర్వాకం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. అదానీలాగే వంద‌ల‌సంఖ్య‌లో బ్లాక్ డీల్ చేసే బ‌డాబాబులు ఉన్నార‌ని ఇన్వెస్ట‌ర్లు అనుమానిస్తున్నారు. అమ్మ‌కాల ఒత్తిడి పెర‌గ‌టంతో మ‌దుప‌రుల వేల‌కోట్ల పెట్టుబ‌డులు క‌రిగిపోతున్నాయి. షేర్‌మార్కెట్‌లో మోసాలు కొత్తేం కాదు. మూడు ద‌శాబ్దాల కాలంలో హ‌ర్ష‌ద్‌మెహ‌తా, కేత‌న్‌ప‌రేఖ్ వంటి వాళ్లు ఎన్నో మోసాల‌కు పాల్ప‌డ్డారు. ఇన్వెస్ట‌ర్ల‌ను నిలువునా ముంచారు. న‌ష్టాలు త‌ట్టుకోలేక ఎందరో ప్రాణాలు తీసుకున్నారు. షార్ట్ సెల్లింగ్‌పై సెబీ ఎప్పుడో దృష్టి పెట్టి ఉంటే అదానీలాంటివారి ఆట‌లు సాగేవి కావు. ఎఫ్‌పీవోల మాటున జరుగుతున్న దందా సెబీకి తెలీద‌నుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మే. ఇప్ప‌టికైనా సెబీ వెంట‌నే రంగంలోకి దిగ‌క‌పోతే స్టాక్‌మార్కెట్ విశ్వ‌స‌నీయ‌త పూర్తిగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది.