హిండెన్‌బర్గ్‌..బీబీసీ..జార్జ్‌ సోరోస్‌..మూకుమ్మడి దాడి.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి

By KTV Telugu On 20 February, 2023
image

హిండెన్‌బర్గ్‌…బీబీసీ….జార్జ్‌ సోరోస్‌…! ప్రస్తుతం భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్న పేర్లు ఇవి. ఈ సంస్థలు, వ్యక్తులు మన దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు వాళ్ల వెనకాల ఎవరున్నారు అసలేం జరగుతోంది. వివిధ దేశాల్లో తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోతున్న గౌతమ్ ఆదాని జైత్ర యాత్రకు అమెరికాకు చెందిన పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ జనవరి 24న వెల్లడించిన నివేదికతో అడ్డుకట్ట పడిన సంగతి అందరికీ తెలిసిందే. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కంపెనీలతో సంబంధమున్న 578 అనుబంధ సంస్థల, షెల్‌ కంపెనీల నిధుల సేకరణ కార్యకలాపాలు, దేశం వెలుపల సాగించే కార్యకలాపాల గురించి అనేక ఆధారాలను అందులో పొందుపరిచింది. ఆ నివేదిక ప్రభావంతో అదానీ వ్యాపార సామ్రాజ్యానికి బీటలు పడింది.

ఒక్కరోజులో ఆదాని రూ.50 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ అంతకంతకూ దిగజారిపోతున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న అదానీ ఫిబ్రవరి 5 నాటికి 23వ స్థానానికి జారిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతోనే ఆదాని తన వ్యాపార సామ్రాజ్యాన్ని అడ్డదారిలో విస్తరిస్తున్నారని అంతకుముందు నుంచే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ నివేదిక తో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. పార్లమెంట్లో విపక్షాలు కేంద్రంపై గళమెత్తాయి. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఒక కమిటీ నియమించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
కమిటీ నియామకం కోసం కేంద్రం సీల్డ్ కవర్ లో కొందరు నిపుణుల పేర్లను సూచించింది. అయితే ఆ పేర్లను పరిశీలించిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్ధివాలాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

అదానీ-హిండెన్ బర్గ్ అంశంలో తామే కమిటీ వేస్తామని సభ్యుల నియామకం తామే చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల కావాడానికి పదిరోజుల ముందు అంటే జనవరి 17న బిబీసీ ఒక డాక్యుమెంటరీని ప‌్రసారం చేసింది. రెండు ఎపిసోడ్‌లతో ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఆ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీలో 2002లో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. బీబీసీ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ కూడా మన దేశంలో కలకలం సృష్టించింది. ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్రం బ్యాన్‌ చేసింది. దానికి సంబంధించిన లింకుల్ని సోషల్‌ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్‌, ట్విట్టర్‌ నుంచి తొలగించింది. అయితే పలు యూనివర్సిటీలలో ఈ డాక్యుమెంటరీలను విద్యార్థులు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరెవైపు ఈ డాక్యుమెంటరీ పై బ్రిటన్‌ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. మరోవైపు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

మన దేశంలో బీబీసీ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ముంబై, ఢిల్లీ లో ఉన్న బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు సోదాలు చేశారు. సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని ఇంటికి పంపించేసి సోదాలు కొనసాగించారు. ఆదాయం, ఖర్చు, ఆదాయం దారి మళ్లింపు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఐటీ దాడులు కక్షసాధింపు చర్యలే అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసిన మూడో పేరు జార్జ్ సోరోస్‌. ఇంతవరకు ఈయన ఎవరో చాలామందికి తెలియదు. గత వారం రోజులుగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. జర్మనీలోని మ్యూనిచ్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో జార్జ్ సోరోస్ మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వాది కాదన్నారు. మోదీ వేగంగా నాయకుడిగా మారడానికి భారతీయ ముస్లింలపై హింసే ప్రధాన కారణమని ఆరోపించారు గౌతమ్ ఆదాని పతనంతో కేంద్ర ప్రభుత్వంపై మోదీ పట్టు కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు సోరేస్.

2020 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో కూడా సోరోస్‌ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మోదీ భారతదేశాన్ని హిందూ జాతీయవాద దేశంగా మారుస్తున్నారని విమర్శించారు. పౌరసత్వ చట్టం ద్వారా లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సోరోస్‌ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. విదేశాల నుంచి భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నమని అన్నారు. సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. అదానీ వ్యవహారం భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్, ప్రతిపక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీనికి జార్జ్ సోరోస్‌కు సంబంధం లేదు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా తీవ్రంగా ఖండించారు. సోరోస్‌ అనే వ్యక్తి ధనికుడు, వృద్ధుడు, ప్రమాదకారి, మూర్ఖమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు. న్యూయార్క్‌లో కూచుని తన అభిప్రాయాల ప్రకారమే ప్రపంచమంతా నడుచుకోవాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఈ జార్జ్‌ సోరోస్ ఎవరు ఆయన నేపథ్యం ఏమిటి. 92 ఏళ్ల సోరోస్‌ అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడు. హంగరి దేశంలో ఉన్న తయూదు కుటుంబంలో జన్మించారు. లండన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఫిలాసఫి చదివారు. 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నాశనం చేశాడని అపకీర్తిని మూటగట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన సోరోస్ దాదాపు రూ. 3.6 లక్షల కోట్లు సంపాదించారు. 1979లో ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు దాదాపు 120 దేశాలకు విస్తరించింది. పలు దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి తనకు అనకూలమైన వర్గాలకు నిధులు సమకూర్చి ఉద్యమాలు లేవదీయడం ఈయన పని అని ఆరోపణలున్నాయి. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్‌లకు మద్దతు ఇచ్చాడు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యిప్ ఎర్డోగన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. తుర్కియేని విభజించి నాశనం చేయాలనుకునే యూదుల కుట్రలో సోరోస్ కేంద్రంగా ఉన్నారని తుర్కియే అధ్యక్షుడు ఆరోపించారు. సోరోస్ జన్మస్థలమైన హంగేరీ ప్రభుత్వం కూడా ఆయనను తన శత్రువుగా భావిస్తోంది. ఇంత పెద్ద చరిత్ర ఉన్న సోరోస్ ఇప్పుడు మోదీని టార్గెట్‌ చేసుకున్నారు. హిండెన్‌బర్గ్‌, బీబీసీ, జార్జ్‌ సోరోస్ ఒకే సమయంలో కట్టకట్టుకుని భారత ప్రభుత్వం మీద ముఖ్యంగా మోదీ మీద దాడి చేయడం వెనకాల అంతర్జాతీయ కుట్ర ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.